Ex MP Harsha Kumar : గోదావరి జిల్లాల్లో రాజకీయం ఎప్పుడూ హాట్ గానే ఉంటుంది. ప్రత్యర్థి పార్టీల ఎత్తులు చిత్తు చేస్తూ రాజకీయాలు చేస్తుంటారు నేతలు. సార్వత్రిక ఎన్నికలకు ముందే ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుండడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌, రాజ్యసభ సభ్యుడు, వైసీపీ సీనియర్‌ నాయకుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ ఇద్దరూ కలిసి మంతనాలు జరిపారు. ఇక హర్షకుమార్‌ వైసీపీలోకి చేరడం లాంఛనమే అన్న సంకేతాలు విపినిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలో కీలక పదవులు చేపట్టిన హర్షకుమార్‌ అమలాపురం ఎంపీగా రెండు సార్లు పోటీచేసి గెలుపొందారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడిగా హర్షకుమార్‌కు పేరుంది. అదే సమయంలో కాపు, శెట్టిబలిజ తదితర సామాజిక వర్గాల్లోనూ హర్ష కుమార్‌కు మంచి సంబంధాలున్నాయి. ఇతర పార్టీల్లో ఉన్న చాలా మంది హర్షకుమార్‌కు గతంలో అనుయాయులుగా ఉన్నారు.


కాంగ్రెస్‌ పార్టీపై హర్షకుమార్ అలక  


ఇటీవల ప్రకటించిన పీసీసీ పదవుల కేటాయింపులపై హర్షకుమార్‌ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించిన హర్షకుమార్‌కు ప్రచార కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. అది కూడా అగ్రవర్ణాలకు ఇవ్వకపోయారా? అంటూ అధిష్టానానికి సెటైర్‌ వేశారు హర్షకుమార్‌. కొన్ని రోజులుగా సైలెంట్ ఉన్న హర్షకుమార్‌ ఇటీవల అమలాపురంలో జరిగిన ఎస్సీల ఆత్మీయ సమావేశంలో కూడా రాజకీయాలు టచ్ చేయలేదు. పలు సందర్భాల్లో వైసీపీపై బహిరంగంగానే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన హర్షకుమార్‌ రాజమండ్రిలో జరిగిన ఓ నిరసనలో అరెస్ట్‌ అయ్యారు కూడా. అయితే వైపీపీ అధిష్టానం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ద్వారా హర్షకుమార్‌తో జరుపుతోన్న మంతనాలు చాలా వరకు ఫలించాయన్న టాక్‌ వినిపిస్తోంది.


అమలాపురం ఎంపీ అభ్యర్ధిగా బరిలో?


అమలాపురం పార్లమెంట్ అభ్యర్ధిగా వైసీపీ తరపున హర్షకుమార్‌ పోటీచేసే అవకాశాలున్నట్లు బాగా ప్రచారం జరుగుతోంది. హర్షకుమార్‌ కూడా ఇదే కోరుకుంటున్నట్లు, అదే విధంగా తమ కుమారులకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. అమలాపురంలో పార్లమెంటు అభ్యర్థిగా టీడీపీ తరపున దివంగత లోక్‌సభ స్పీకర్‌ బాలయోగి తనయుడు హరీష్‌ మాధూర్‌ రంగంలో ఉన్నారు. 2019లో కూడా వైసీపీ అభ్యర్థి చింతా అనురాధకు గట్టిపోటీ ఇచ్చారు. ఈసారి హరీష్‌ మాధూర్‌ గెలిచేందుకు చాలా అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. అమలాపురం ఎంపీగా ఉన్న చింతా అనురాధపై అధిష్టానం అంతగా గురిగా లేకపోవడం, ఆమె కూడా ఈ సారి ఎమ్మెల్యే టికెట్టుపై ఆసక్తిని కనపరచడంతో  వైసీపీ తరపున అమలాపురం ఎంపీ అభ్యర్థిగా జీవీ హర్షకుమార్‌ బరిలోకి దింపే అవకాశాలే ఉన్నాయని తెలుస్తోంది.


ఏపీ పీసీసీ అధ్యక్షుడి పదవి ఆశించిన హర్ష కుమార్ ఆ పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్ అధిష్ఠానంపై అసహనంతో ఉన్నారు. దీంతో ఆయనకు కేటాయించిన ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి కూడా చేపట్టనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు లేఖ రాశారు. కాంగ్రెస్ కూడా అగ్రవర్ణాలకే ప్రాముఖ్యత ఇస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న హర్ష కుమార్ ను వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కలవడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. హర్ష కుమార్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని జోరుగా ప్రచారం జరుగుతోంది.