YSRCP Leaders : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ నేతలు పార్టీ పరువును బజారున పడేస్తున్నారు. హత్యలు, దౌర్జన్యాలు, బెదిరింపులు వంటి వాటిలో మునిగి తేలుతున్నారు. ఇవన్నీ మీడియాలో హైలెట్ అవుతూండటంతో వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్‌కు కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
హత్య చేశానని ఒప్పుకున్న ఎమ్మెల్సీ అనంతబాబు !
తానే హత్య చేసానంటూ నిస్సిగ్గుగా పోలీసులముందు ఒప్పుకుని జైలు పాలైన వైసిపి ఎమ్మెల్సీ అనంతబాబు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ పరువును నిండా ముంచేశారు.. తన మాజీ డ్రైవర్ను అతి కిరాతకంగా చంపేసి అడ్డంగా దొరికిపోయిన అనంత బాబు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచలు లెక్క పెడుతున్నాడు. నేర చరిత్ర కల్గి ఉన్న వారిని పెద్దల సభకు ఎలా పంపించారన్న విమర్శలు..సిఎం జగన్‌పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని దెబ్బతీశాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
పోలవరం ఇంజినీర్‌ను కొట్టిన జక్కంపూడి రాజా !
ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం సద్దుమణగక ముందే రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ ఏఈ తొత్తాడ సూర్య కిరణ్ ను చెంప చెళ్లు మనిపించేలా మూడు సార్లు కొట్టాడని.. పోలీసులకు ఫిర్యాదు అందింది. అధికార పార్టీలో ఉండి.. తమ ప్రభుత్వంలోనే పనిచేసే అధికారిపై చేయి చేసుకోవడం తీవ్ర విమర్శల పాలు కాగా దీనిపై పోలీసు స్టేషన్‌లో సదరు బాధిత ఏఈ సూర్య కిరణ్ ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు, ఇంజనీర్లంతా జక్కంపూడి రాజా దురుసు ప్రవర్తనను తీవ్రంగా ఖండించడం జరిగాయి. కొందరు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి చివరికి సదరు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పించడంతో ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.
సొంత పార్టీ నేతకు మంత్రి కొడుకు బెదిరింపులు!
తాజాగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు ఓ ఎంపీటీసీ పై బూతు పురాణం వెలుగులోకి వచ్చింది. కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమలాపురంలో ఇటీవల జరిగిన అల్లర్లలో మంత్రి పినిపే విశ్వరూప్ ఇళ్లు తగలబడి పోయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి విశ్వరూప్ తనయుడు కృష్ణా రెడ్డి వైసిపికి చెందిన ఓ ఎంపిటిసి పై తీవ్రస్థాయిలో ఫోన్లో రెచ్చిపోవడం.. రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి సంచలనమయ్యింది.. తమ ఇంటిని దగ్ధం చేసిన కుట్ర వెనుక నీ పాత్ర ఉందంటూ మంత్రి తనయుడు కృష్ణా రెడ్డి ఎంపిటిసి అడపా సత్తిబాబు అనే వ్యక్తిపై విరుచుకు పడటం.. చంపేస్తానని సెల్ ఫోన్లోనే బెదిరింపులకు దిగడం తీవ్ర కలకలం రేపింది.
ఆగని అనంతబాబు దాడులు !
ఈ సంఘటనలు మరువకముందే తన మాజీ డ్రైవరు సుబ్రమణ్యం హత్య కేసులో రిమాండ్ ఖైదీ గా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు సహ ఖైదీ ని కొట్టి గాయ పరిచాడంటు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అయితే ఇది ఏ మాత్రం వాస్తవం కాదని రాజమండ్రి జైల్ సుపరెం టెండ్ రాజారావు చెబుతున్నారు.. ఏది ఎమైనా గత కొన్ని రోజులుగా అధికార వైసీపీ నేతలు వ్యవహార శైలి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర చర్చనీయాంశ మవుతోంది ..