What next For Venkaiah : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాడు పదవీ కాలం ఆగస్టుతో ముగుస్తుంది. తదుపరి ఉపరాష్ట్రపతిగా బెంగాల్ గవర్నర్ ధన్‌ఖడ్ ఎంపిక ఖాయం. అందుకే ఇప్పుడు వెంకయ్యనాయుడు రాజకీయ భవిష్యత్‌పై చర్చ జరుగుతోంది. తర్వాత ఆయనకు బీజేపీలో కానీ ప్రభుత్వంలో కానీ ఆయనకు ఎలాంటిపదవులు.. ప్రాధాన్యత లభిస్తుందా ? ఆయన అనుభవాన్ని మోదీ, షాలు ఉపయోగించుకుంటారా? లేక ఇతర సీనియర్లలా రిటైర్మెంట్ లెక్కలోకి వెళ్లిపోతారా?
75 ఏళ్లు దాటితే బీజేపీలో రిటైర్మెంట్ !
వెంకయ్యనాయుడు వయసు డెభ్బై మూడేళ్లు. బీజేపీ పెట్టుకున్న విధానం ప్రకారం 75 ఏళ్లు రిటైర్మెంట్ వయసు. ఈ కారణంగానే చాలా మంది సీనియర్లను ఇళ్లకు పరిమితం చేశారు . కానీ వెంకయ్యనాయుడు రాజకీయ పరంగా మంచి వ్యూహకర్త. బీజేపీలో చిన్న స్థాయి కార్యకర్త నుండి అధ్యక్షుడి వరకూ.. ప్రజాప్రతినిధి.. దిగువస్థాయి నుంచి ఉపరాష్ట్రపతి వరకూ ఎదిగారు. వెంకయ్యనాయుడు బీజేపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా పని చేశారు. పార్టీని నిలబెట్టారు. అయితే రిటైర్మెంట్ నుంచి మినహాయింపు కోసం ఇది సరిపోదన్న వాదన వినిపిస్తోంది.
రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండాలన్నది వెంకయ్య అభిలాష !
వెంకయ్యనాయుడు ఆరోగ్య పరంగా యాక్టివ్‌గా ఉంటారు. రాజకీయంగా ఆయన ఖాళీగా ఉండటం కష్టమేనని చెబుతున్నారు. బీజేపీ వ్యూహాల్లో తెర వెనుక పాత్ర అయినా పోషిస్తారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం బీజేపీలో మోదీ, షాలు తప్ప మరొకరి వ్యూహాలు ఆలోచనలు అమలు చేసే పరిస్థితి లేదు. వారు చెప్పినట్లుగా చేయాల్సిందే. అదే సమయంలో వెంకయ్య సంప్రదాయ రాజకీయాలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. అలాంటి వాటికి మోదీ, షాలు వ్యతిరేకం. వారి రాజకీయాలు డైనమిక్‌గా ఉంటాయి. అందుకే నేరుగా కాకపోయినా బీజేపీ కీలక నిర్ణయాల్లో భాగమయ్యే పరిస్థితి కూడా ఉంటుందా లేదా అన్నది చెప్పడం కష్టమనిఅంటున్నారు.
అనధికారిక రిటైర్మెంటే !
వెంకయ్యనాయుడు ఇక పూర్తిగా రాజకీయాలకు దూరమైనట్లేనని బీజేపీ వర్గాలు కూడా ఓ అంచనాకు వస్తున్నాయి. ఆయనకు ఇక ఎలాంటి పదవి దక్కకపోవచ్చని అంటున్నారు. ఉపరాష్ట్రపతిగా చేసిన ఆయన మరో పదవి తీసుకోలేరు. ఆయన స్థాయికి తగ్గ పదవిని సృష్టించలేరు కూడా. అందుకే ఆయన రాజకీయ ప్రస్థానం ఇంతటితో ముగిసినట్లేనని అంచనా వేస్తున్నారు. అయితే వెంకయ్యనాయుడు మాత్రం ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. బహుశా తన పదవీ కాలం చివరి రోజున భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. వెంకయ్యను పలు రకాలుగా పొగుడుతున్న బీజేపీ పెద్దలు ఆయన తర్వాత సేవలను ఎలా ఉపయోగించుకుంటారన్నదానిపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.