"లిక్కర్ పాలసీ" ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఢిల్లీలో మద్యం విధానాన్ని మార్చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం లిక్కర్ సిండికేట్లకు జోన్ల వారీగా వ్యాపారాన్ని ఇచ్చేసి పెద్ద ఎత్తున లంచాలు తీసుకుందని సీబీఐ కేసులు నమోదు చేసింది. ఆ కేసులో ఎవరెవరు ఉన్నారు ? ఎలా డబ్బులు మారాయో చెబుతూ బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.. చేస్తున్నారు. లిక్కర్ పాలసీ స్కాంలో ఇది ఓపెనింగ్ మాత్రమే.. ఈడీ కూడా రంగంలోకి దిగుతోంది. ఇంకా చాలా ట్విస్టులు ఉండనున్నాయి. అనూహ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ స్కాంపై చర్చ జరుగుతూండటం ఆసక్తి రేపుతోంది. అటు తెలంగాణ అధికార పార్టీ.. ఇటు ఏపీ అధికార పార్టీకీ సంబంధం ఉందని.. వారి వ్యవహారాలు కూడా బయటకు వస్తాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఏపీలో బీజేపీ ఢిల్లీ లిక్కర్ స్కాం లింకులు చూస్తుందా.., లేకపోతే ఏపీలోనే  ప్రత్యేకంగా ఉన్న ఏపీ లిక్కర్ పాలసీ వ్యవహారాలను కూడా పరిశీలిస్తుందా అన్నది ఇప్పుడు కీలకం. ఎందుకంటే ఏపీ లిక్కర్ పాలసీపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. 


ఢిల్లీ లిక్కర్ స్కాంలో అసలు జరిగింది ఇదీ !
  
దేశ రాజధానిలో మద్యం అమ్మే దుకాణాలను ఢిల్లీ ప్రభుత్వమే నిర్వహిస్తుంది.  2021 జూన్‌లో లిక్కర్ షాపుల  ప్రైవేటీకరణ చేయాలని కేజ్రీవాల్ సర్కార్‌ నిర్ణయించింది. మొత్తం ఢిల్లీని 32 జోన్లుగా విభజించింది. ఒక్కో జోన్‌లో 27 లిక్కర్ దుకాణాలు ఉండేలా నిబంధనలు రూపొందించింది. దీని ద్వారా ఖజానాకు రూ.9,500 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఆప్ ప్రభుత్వం.. లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు పంపిన నివేదికలో పేర్కొంది . ఢిల్లీలో ఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వమైనా అన్నీ అధికారాలు ఉండవు. ఎమ్‌ఆర్‌పీలతో సంబంధం లేకుండా ఇష్టారీతిన ధరలు నిర్ణయించుకునేందుకు లైసెన్స్‌దారులకు అధికారం ఇవ్వడం, తెల్లవారుజామున 3 గంటల వరకూ షాపులు నడుపుకునేందుకు అనుమతితో పాటు డ్రై డేలను 21రోజుల నుంచి 3 రోజులకు తగ్గించడం వంటివి చేసింది. అయితే మద్యం షాపుల కోసం టెండర్లు వేసినవారికి లైసెన్స్ ఫీజ్‌లో రాయితీలు ఇచ్చింది. కొందరికి పూర్తిగా లైసెన్స్ ఫీజ్ మాఫీ చేసింది. విదేశీ బీరు ఒక్కో కేసుకు 50 చొప్పున రాయితీ కూడా ఇచ్చింది. కంపెనీల దగ్గర డబ్బులు తీుకునే ఇలా చేశారని లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు ఆదేశఇంచారు. 


ఏపీ లిక్కర్ పాలసీలో ఏం జరుగుతోంది ! 


మద్యనిషేధం హామీని మేనిఫెస్టోలో పెట్టి మరీ సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఏపీలో లిక్కర్ పాలసీని సీఎం జగన్ పూర్తిగా మార్చేశారు. షాక్ కొట్టేలా ధరలు పెంచుతానని అప్పుడే తాగడం మానేస్తారని చెప్పి ధరలు విపరీతంగా పెంచారు. ఐదు వందలశాతం వరకూ ధరలు పెరిగాయి. దుకాణాల వేలం పాటను రద్దు చేశారు. అన్నీ ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. అయితే ఏపీలో పాత  బ్రాండ్లు ఒక్క సారిగా మాయమయ్యాయి. పాపులర్ బ్రాండ్లను అమ్మడం ఆపేశారు. దేశంలో ఎక్కడా అమ్మని లిక్కర్ మాత్రం ఏపీలో దొరుకుతోంది. .. అమ్మడానికి పర్మిషన్ కూడా ఇవ్వని లిక్కర్‌ను ఏపీలో బినామీ కంపెనీల ద్వారా తయారు చేసి అమ్మిస్తున్నారని టీడీపీ చాలా కాలంగా ఆరోపిసతోంది. ఆ మద్యం విషపూరితమని కొన్ని ల్యాబుల్లో టెస్టులు చేయించి మీడియా ముందు పెట్టింది. మొత్తం ప్రభుత్వం చేతుల్లో అంటూ.. నేరుగా సొంత వ్యాపారం చేస్తున్నారని.. అదాన్ డిస్టిలరీస్ పేరుతో  సొంత మద్యం సరఫరా చేస్తూ వేల కోట్లు దండుకుంటున్నారన్న ఆరోపణలను చేస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కేవలం నగదు లావాదేవీలు మాత్రమే అనుమతిస్తున్నారు. ఇవన్నీ స్కాంలు జరుగుతున్నాయన్నదానికి ఆధారాలని టీడీపీ నేతలంటున్నారు. 
 
ఏపీ లిక్కర్ స్కాం కూడా బయటకు వస్తుందంటున్న బీజేపీ నేతలు !


ఏపీ లిక్కర్ స్కాం కూడా బయటకు వస్తుందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శఇ విష్ణువర్దన్ రెడ్డితో పాటు తాజాగా జీవీఎల్ నరసింహారావు కూడా అన్నారు. అయితే వారు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీ వైఎస్ఆర్‌సీపీ నేతలున్నారని అంటున్నారా లేకపోతే..  ఏపీ లిక్కర్ పాలసీపైనా సీబీఐ విచారణ చేయిస్తామని అంటున్నారా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ మద్యం స్కాం విషయంలో బయటపడబోయే విషయాలు సంచలనం సృష్టించడం ఖాయమని ఏపీ బీజేపీ నేతలు ఢంకా బజాయించి చెబుతున్నారు. అయితే ఢిల్లీ స్కాం విషయంలో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు ఉందని.. ఆయన వ్యవహారమే తప్ప.. ఏపీ ప్రభుత్వ పెద్దలకు సంబంధం లేదని వైఎస్ఆర్‌సీ వర్గాలు చెబుతున్నాయి. 


బీజేపీతో వైఎస్ఆర్సీపీ సంబంధాలను బట్టే పరిణామాలు !


అయితే రాజకీయ నేతలు ఎన్ని మాట్లాడినప్పటికీ కేంద్రంలోని బీజేపీతో వైఎస్ఆర్‌సీపీకి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ కారణంగా వైఎస్ఆర్‌సీపీకి కొన్ని విషయాల్లో అడ్వాంటేజ్ లభిస్తోంది. అది ఇప్పటికీ కొనసాగుతుందా లేదా అన్నది కీలకం. ఇటీవలి కాంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు.. బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ నేతలు.. వైఎస్ఆర్‌సీపీ పాలనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ..  బీజేపీకి దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పరిణామాల్లో మార్పులు ఉంటే... ఖచ్చితంగా ఏపీ మద్యం పాలసీపైనా కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది రాజకీయ పరిణామాలను బట్టే ఉండవచ్చు.