Pawan Delhi Tour :   జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా కాలంగా మూడు పార్టీల కూటమిగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆయన ఉద్దేశం ప్రకారం 2014 కూటమి ఇప్పుడు కలిసి పోటీ చేయాలనుకుంటున్నారు. సీట్లు పంపకాల దాకా ఇంకా వెళ్లలేదు..కనీసం కలిసి పోటీ చేసేలా ఒప్పించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ తో కలిసి పోటీ చేయడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ బీజేపీని కూడా కలపాలని  పవన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఈ కూటమిలోకి టీడీపీని తీసుకు రావాలనుకుంటున్నారు. కానీ టీడీపీ మాత్రం.. బీజేపీ విషయంలో సాఫ్ట్ గానే ఉంటోంది కానీ ఎన్డీఏ కూటమిలోకి అంటే మాత్రం ఆలోచిస్తోంది. 


ఢిల్లీలో జనసేనాని జరిపిన చర్చల సారాంశం ఏమిటి ?


జనసేన అధినతే పవన్ కల్యాణ్ చాలా కాలంగా బీజేపీతో పొత్తులో ఉన్నారు కానీ రాష్ట్ర బీజేపీతో కలిసి పని చేసిన సందర్భం లేదు. బీజేపీతో కలిసి పోటీ చేసి పని అయితే.. జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించడమే అని తీర్మానించుకుని.. తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయాలనే ఆలోచనకు వచ్చారు. చంద్రబాబు, పవన్ మధ్య మూడు సార్లు సమావేశాలు జరిగాయి. ఏం చర్చించారన్నదానిపై స్పష్టత లేదు. కానీ పవన్ మాత్రం బీజేపీని వదిలి పెట్టి టీడీపీతో కలిసి వస్తానని చెప్పడం లేదు. మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని చెబుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఆయన చర్చల్లో ఖచ్చితంగా కూటముల అంశమే చర్చకు వచ్చి ఉంటుంది. జేపీ నడ్డా, అమిత్ షా వంటి నేతల నుంచి పవన్ కల్యాణ్‌కు ఎలాంటి సంకేతం అందింతో కానీ.. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయనే కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. 


అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు భేటీ అయినప్పటికీ రాని క్లారిటీ !


ఎన్డీఏతో కలిసేందకు చంద్రబాబు రెడీగానే ఉన్నారు. ఈ విషయంలో ఆయన చాలా స్పష్టత ఇచ్చారు. కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఓ సారి ఢిల్లీ వెళ్లి  అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. కానీ ఆ సమావేశం ఫోటోలు కూడా బయటకు రాలేదు. ఆ సమావేశం తర్వాత కూడా చంద్రబాబు పొత్తులపై ఎవరూ మాట్లాడవద్దని స్పష్టంగా చెప్పేశారు. పొత్తులు ఉంటాయని చెప్పడం లేదు. ఆ తర్వాత రెండు రోజుల వ్యవధిలో ఏపీ లో రెండు సభలు పెట్టిన అమిత్ షా, జేపీ నడ్డా .. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదంతా చంద్రబాబు టూర్ మహత్యమే అనుకున్నారు .కానీ చంద్రబాబు అంతటితో సంతృప్తి చెందలేదు. మరి చర్యలేవి అని ప్రశ్నించడం ప్రారంభించారు.  ఈ విషయంలో బీజేపీ వైపు నుంచి స్పందన రావడం లేదు. 


బీజేపీకి దూరం కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న వైఎస్ఆర్‌సీపీ


పొత్తులు కావాలంటే.. ఏపీలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలు, వివేకా హత్య కేసులో సీబీఐకి స్వేచ్చ వంటి అంశాలపై పట్టుబడుతున్నారన్నది సీక్రెట్ గా ఉన్నా..  ఎక్కువ మంది నమ్మే అంశం. అయితే వైసీపీ .. బీజేపీకి తమ కంటే నమ్మకమైన మిత్రపక్షం ఉండదని ఎప్పటికప్పుడు రుజువు చేస్తున్నారు. ఫలానా ప్రయోజనాలు కావాలని ఒత్తిడి తీసుకు రాబోమని.. కేంద్రం నిర్ణయాలను ప్రశ్నించబోమని.. చేపట్టాలనుకున్న ప్రతి సంస్కరణనూ అమలు చేస్తామని అంటున్నారు. చేస్తున్నారుకూడా. చివరికి వ్యవసాయ మోటార్లకు మీటర్లు కూడా పెడుతున్నారు. ఇలాంటి మిత్రపక్షంగా తాము ఎలా చర్యలు తీసుకోగలమనేది బీజేపీ భావన. ఈ వైసీపీ వ్యూహమే మొత్తంగా ఏపీలో కూటమి ఏర్పాటుకు అడ్డం పడుతోందని అనుకోవచ్చు.


యూసీసీ బిల్లుపై ఓటింగ్ తర్వాత కీలక పరిణామాలు ! 


వచ్చే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ఇచ్చిన అప్పుల పరిమితి దాదాపుగా ముగిసిపోయింది. నెలకు ఆరేడు వేల కోట్ల అప్పు పుట్టకపోతే ప్రభుత్వం నడవదు. కేంద్రం సహకారం లేకపోతే ఆ అప్పు రాదు. కేంద్రం ప్రభుత్వం ఇక సహకరిస్తే... బీజేపతో పొత్తుల గురించి టీడీపీ ఆలోచించే చాన్స్ ఉండదు. అప్పుడు పవన్ ఏం చేస్తారన్నదే కీలకం.