AP Early Polls :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ లో అధికారికంగా ఏం చర్చించారన్నదానిపై ప్రెస్ నోట్ విడుదలవుతుంది. కానీ అంతర్గతంగా రాజకీయాలు ఏం చర్చించారన్నది అధికారికంగా ఎప్పటికీ తెలియదు. కానీ ఢిల్లీ వర్గాలు లీక్ చేసే సమాచారమే విస్త్రతంగా ప్రచారం అవుతూ ఉంటుంది. ఇప్పుడు జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న అంశం ముందస్తు ఎన్నికలు. ఏప్రిల్ తర్వాత అసెంబ్లీని రద్దు చేయడానికి  ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాల వద్ద అనుమతి తీసుకున్నారన్న ఓ ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై వైఎస్ఆర్‌సీపీ వర్గాలు మాత్రం గుంభనంగా ఉంటున్నాయి. 


కొంతకాలంగా ఏపీలో ముందస్తు మేఘాలు ! 


గత కొంతకాలంగా రాష్ట్రంలో ముందస్తు మాట తరచూ వినిపిస్తోంది. చంద్రబాబు పదే పదే ఎన్నికలు ముందే వస్తాయంటూ కేడర్‌ను సంసిద్ధం చేస్తూ ప్రజల్లో తిరుగుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు ఆ వార్తలను అధికార పార్టీ కొట్టివేస్తూ వస్తోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెబుతూ వస్తోంది. కానీ వైఎస్ఆర్‌సీపీ ముందస్తుకు తమ పార్టీ శ్రేణులను చాలా రోజులుగా సిద్ధంమ చేస్తోంది.  మూడున్నరేళ్ల పాలన పూర్తిచేసుకున్న వైసీపీ ప్రభుత్వం మళ్లీ వచ్చే ఎన్నికల కోసం శ్రేణులను సిద్ధం చేస్తోంది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందే గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం ద్వారా జనం బాట పట్టింది. మార్చిలో ఈ కార్యక్రమం ముగిసిపోతుంది. అప్పుడే టిక్కెట్లు ప్రకటిస్తానని జగన్ కూడా స్పష్టం చేశారు. ఈ పరిణామాలను గమనించిన విపక్షాలు ఆరు నెలల తర్వాత ముందస్తు ప్రకటన ఖాయమని ఊహిస్తున్నాయి. ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. 


ముందస్తుకు సహకరించాలని కేంద్ర పెద్దల్ని జగన్ కోరారా ?


ముందస్తుకు వెళ్లాలంటే.. జగన్ అసెంబ్లీని రద్దు చేస్తే సరిపోదు. ఖచ్చితంగా కేంద్ర సహకారం ఉండాలి. కేంద్రం అనుమతి లేకుండా రద్దు చేస్తే.. రాష్ట్రపతిపాలన విధించినా విధించవచ్చు. అందుకే జగన్ మోదీ, అమిత్ షాల పర్మిషన్ తీసుకున్నరన్న ప్రచారం జరుగుతోంది.  దీనికి తగినట్లుగానే తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక మిగిలింది అధికారిక ప్రకటనే అనేలా ఈ పరిణామాలున్నాయి. ఢిల్లీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్కడ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రుల్ని కలిశారు. జగన్ ఢిల్లీ టూర్ లో ఉన్న సమయంలోనే రాష్ట్రంలో నిఘా వర్గాలకు ముందస్తుకు సిద్ధంగా ఉండాలని సంకేతాలు అందినట్లు సమాచారం. బయటకు అలాంటిదేమీ లేదని చెబుతున్నా అంతర్గతంగా మాత్రం ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోందన్న అభిప్రాయంతో ఎక్కువ మంది ఉన్నారు. 


బడ్జెట్ తర్వాత అసెంబ్లీని రద్దు చేస్తారా ?


జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం మార్చిలో ముగుస్తుంది. అప్పటికే బడ్జెట్ సమావేశాలు ముగిసిపోనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ఏ క్షణమైనా ముందస్తు ఎన్నికలపై అధికారిక ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన నేతలు ముందస్తు సంకేతాలను ముందనుంచి గమనిస్తూ ఓ అంచనాకు వచ్చాయి. దానికి తగ్గట్లే చంద్రబాబు నిత్యం జనంలోనే ఉంటున్నారు. లోకేష్ పాదయాత్ర కూడా మరికొద్దిరోజుల్లో ప్రారంభం కాబోతోంది. కొంతకాలంగా ప్రభుత్వంపై దూకుడుగా వెళ్తోన్న పవన్ కళ్యాణ్ కూడా వారాహితో యాత్ర మొదలుపెట్టేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ పరిణామాలన్నీ ముందస్తుకు సూచనలుగానే భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇటీవల మంత్రి సీదిరి అప్పలరాజు కూడా..ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని సిద్ధంగా ఉండాలని తమ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. ఇదంతా ఓ సందేశమేనని నమ్ముతున్నారు. 


అధికార పార్టీది వ్యూహాత్మక అడుగులు !


ముందస్తుకు వెళితే..  ఎవరూ ఊహించనంత వేగంగా అడుగులు వేయాల్సి ఉంటుంది. విపక్షాలు ఎన్నికలకు సన్నద్ధం కాకుండా చేసి.. అడుగులు వేయాల్సి ఉంటుంది. సీఎం జగన్ ఏం ఆలోచిస్తున్నారో కానీ... ముందస్తుపై గత ఏడాది నుంచి ఏపీలో చర్చ జరుగుతూనే ఉంది.