Bhatti Vikramarka Slams Brs Chief Kcr: పదేళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి పచ్చి అబద్దాలు చెప్పారని.. ఇంతలా దిగజారి మాట్లాడడం సరికాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మండిపడ్డారు. సూర్యాపేటలో (Suryapeta) ఆదివారం పంటల పరిశీలన అనంతరం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఢిల్లీలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతుంటే ఆయన తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కట్టుకథలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించారని ధ్వజమెత్తారు. మైక్ సమస్య వస్తే.. కరెంట్ కోతలంటూ అబద్ధాలు చెప్పారని అన్నారు. 'చలికాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మా పాలనలో ఇంకా వర్షాకాలం రానే లేదు. కాళేశ్వరం ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ అంటూ డబ్బా కొట్టారు. ఇప్పుడు అది దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. కేసీఆర్ హయాంలో అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారు.' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
'ఎన్ని హామీలు నెరవేర్చారు.?'
పదేళ్ల పాలనలో కేసీఆర్ ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పాలని భట్టి విక్రమార్క నిలదీశారు. 'అందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించారా.?. ప్రతీ మండలంలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు, ప్రతీ నియోజకవర్గంలో కేజీ టూ పీజీ విద్యాలయాలు నిర్మించారా.?. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేశారా.?. ఐదేళ్లలో రైతు రుణమాఫీ చేశారా.?. వాననీటిని రిజర్వాయర్లలో నింపే పరిస్థితి లేకుండా చేసింది ఎవరు.?. వీటన్నింటిపైనా చర్చకు సిద్ధమా.?' అని భట్టి ప్రశ్నించారు.
'విద్యుత్ ప్రణాళికలు ఇలా'
ఏప్రిల్, మే నెలలోనూ సరిపడా విద్యుత్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. 2013లోనే యూపీఏ ప్రభుత్వం దేశమంతా గ్రిడ్ అనుసంధానం చేసిందని గుర్తు చేశారు. 'తెలంగాణకు (Telangana) 4 వేల మెగావాట్ల విద్యుత్ ఇవ్వాలని విభజనం చట్టంలోనే ఉంది. దాని ప్రకారమే రాష్ట్రానికి ఎన్టీపీసీ మంజూరైంది. బొగ్గు లభించే ప్రాంతానికి 350 కి.మీ దూరంలో యాదాద్రి పవర్ ప్లాంట్ పెట్టారు. దీంతో థర్మల్ ప్లాంట్ కు బొగ్గు సరఫరా కోసం భారీగా ఖర్చవుతోంది. పర్యావరణ అనుమతులు పొందడంలో ఆలస్యం వల్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్ నిర్మించాలి. కానీ, కమీషన్ల కోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్ చేపట్టారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం జరుగుతోంది. సరఫరా లేకుంటే ఇంత వినియోగం ఎలా జరుగుతుంది.' అని భట్టి ప్రశ్నించారు.