Defection MLAs problems For Telangana Congress: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు మింగుడు పడని మెతుకులా మారింది. బలమైన ప్రతిపక్షం లేకుండా చేయాలనే వ్యూహంతో బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్ పెద్దలకు, ఇప్పుడు వారే రాజకీయంగా పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. వారిపై అనర్హతా వేటు పడకుండా.. వారు తమ పార్టీ కాదని చెబుతున్నారు. ఆ పది మందిలో చాలా మంది అదే నిజం చేస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఈ ఎమ్మెల్యేల ద్వంద్వ వైఖరి పార్టీ క్యాడర్‌లో గందరగోళాన్ని సృష్టిస్తోంది.
కాంగ్రెస్‌కు దూరం దూరం
పటాన్ చెరు, గద్వాల వంటి నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి సహకరిస్తామనే సంకేతాలు ఇవ్వడం కాంగ్రెస్ హైకమాండ్‌ను విస్మయానికి గురి చేస్తోంది. ఇది కేవలం ఒక నియోజకవర్గానికో పరిమితం కాకుండా, మెజారిటీ ఫిరాయింపు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
పార్టీలోనే ఉన్న వారితో కొత్త సమస్యలు
జగిత్యాల వంటి చోట్ల ఎమ్మెల్యేలు సాంకేతికంగా కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ, పాత కాంగ్రెస్ కార్యకర్తలకు, ఈ కొత్త నేతలకు మధ్య సమన్వయం కుదరడం లేదు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ జెండా మోసిన నాయకులు, ఇప్పుడు తమ ప్రత్యర్థుల కింద పనిచేయడానికి ఇష్టపడటం లేదు. ఈ అంతర్గత పోరు వల్ల పార్టీ సంస్థాగతంగా బలహీనపడుతోంది. ఈ పరిణామాలను గమనిస్తుంటే, ఫిరాయింపులను ప్రోత్సహించడం కాంగ్రెస్ చేసిన ఒక వ్యూహాత్మక తప్పిదంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
దానం నాగేందర్ అంశాన్ని ఎలా డీల్ చేయాలో తెలియక తంటాలు !
మరోవైపు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారం పార్టీకి ఒక పరీక్షగా మారింది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన భవిష్యత్ అడుగులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పుడు ఆయనతో రాజీనామా చేయించి ఉపఎన్నికకు వెళ్లడమా, లేక అనర్హత వేటు పడే వరకు వేచి చూడటమా అనే సందిగ్ధంలో ప్రభుత్వం ఉంది. ఒకవేళ ఉపఎన్నికలు వస్తే, అవి ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా మారుతాయనే భయం కూడా కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది.
ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల అన్నీ సమస్యలే !
రాజకీయంగా బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టాలనే ఆత్రుతలో, సరైన వడపోత లేకుండా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్ తన సొంత అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసుకుంది. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉంటామని చెప్పే కాంగ్రెస్, ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వారా ప్రజల్లో ఉన్న నైతిక బలాన్ని కొంత కోల్పోయిందని చెప్పవచ్చు. ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు అటు బీఆర్ఎస్ కార్యకర్తలను మెప్పించలేక, ఇటు కాంగ్రెస్ శ్రేణులతో కలవలేక సతమతమవుతున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న చోట కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని భావించిన అధిష్టానానికి, ఇప్పుడు ఉన్న స్థానాలను కాపాడుకోవడం కూడా సవాల్‌గా మారింది. ప్రజలు కూడా ఫిరాయింపుల రాజకీయాన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ ఈ ఫిరాయింపు కష్టాల నుంచి ఎలా గట్టెక్కుతుందో చూడాలి.