Daggubati Politics Retire :  ఎన్టీఆర్ కుటుంబానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు  దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నట్టు ప్రకటించారు. బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఆయన ఈ ప్రకటన చేశారు. తాను, తన కుమారుడు హితేష్ చెంచురామ్ ఇద్దరం రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. ఎన్టీఆర్ పెద్దల్లుడైన దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాజీ మంత్రి కూడా. పర్చూరు నుంచి అసెంబ్లీకి పలుమార్లు ప్రాతినిధ్యం వహించారు. అలాగే, లోక్‌సభ, రాజ్యసభకు కూడా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరి పర్చూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. అయితే, ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో ఓటమి పాలయ్యారు.  


దగ్గుబాటి వెంకటేశ్వరరావు గత ఎన్నికలకు ముందే రాజకీయంగా రిటైర్ అవ్వాలనుకున్నారు. కుమారుడు దగ్గుబాటి హితేష్  రాజకీయ భవిష్యత్ కోసం అమెరికా పౌరసత్వాన్ని కూడా క్యాన్సిల్ చేయించుకున్నారు.  దేవుడి చెప్పినట్లుగానే భావిస్తున్నామని చెప్పి. తాను .. తన కుమారుడు రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించారు. ఆయన రాజకీయంగా రిటైర్మెంట్ గురించి అందరూ ఊహించినప్పటికీ.. అనూహ్యంగా ఆయన కుమారుడు హితేష్ కూడా ఇక రాజకీయాల్లో ఉండరని చెప్పడం ఆశ్చర్యకరంగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున హితేష్ ను పర్చూరు నుంచి బరిలోకి దింపాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు . వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ కూడా టిక్కెట్ ఖరారు చేశారు. 


అయితే ఆయన అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడంతో చివరి క్షణంలో దగ్గుబాటినే పోటీ చేయాల్సివచ్చింది. అప్పట్లో తప్పిపోయినా కొంత కాలం వైసీపీ కోసం హితేష్ పర్చూరులో పని చేశారు. తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరం అయ్యారు. పురందేశ్వరి బీజేపీ తరపున రాజకీయాల్లో ఉన్నారు.  దగ్గుబాటి కుమారుడికి చీరాల టీడీపీ టిక్కెట్ కేటాయిస్తారని కొంత కాలంగా ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు దగ్గుబాటి రాజకీయ విరమణ ప్రకటించడంతో అలాంటి చాన్స్ కూడా లేదని తేలిపోయింది. పురందేశ్వరి బీజేపీలోనే ఉంటారని…అంటున్నారు. ఒకప్పుడు చంద్రబాబుతో పోటీగా రాజకీయం చేసిన దగ్గుబాటి.. తర్వాత ఆయనకు దూరమయ్యారు. 


ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేకపోతున్నట్లుగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెబుతున్నప్పటికీ.... బలమైన కారణంతోనే ఆయన రాజకీయ విరమణ ప్రకటన చేశారని భావిస్తున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే చంద్రబాబు కుటుంబంతో గతంతో పోలిస్తే సంబంధాలు కాస్త మెరుగుపడ్డాయి. ఆయన ఆస్పత్రిలో ఉన్నప్పుడు చంద్రబాబు పరామర్సించారు కూడా.  అందుకే వారు టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అనూహ్యంగా రాజకీయంగా విరమణ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది 


దగ్గుబాటి, ఆయన కుమారుడు రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించడంతో ఇక పురందేశ్వరి మాత్రమే బీజేపీలో కొనసాగనున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో రెండు సార్లు ఎంపీగా గెలిచిన పురందేశ్వరి పదేళ్ల పాటు కేంద్రమంత్రిగా ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీలో చేరారు. రెండు సార్లు పోటీ చేసినా పరాజయం పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారో లేదో క్లారిటీ లేదు.