YS Jagan Pushpa Dialogue: గంగమ్మ జాతరలో వేటలను నరికినట్లు రప్ప రప్ప నరుకుతాం.. ఆ మధ్యెప్పుడో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్.. నిన్న జగన్ మోహనరెడ్డి పర్యటనలో ఫ్లెక్సీల్లో చూశాం.. మళ్లీ ఇవాళ అదే జగన్ మోహనరెడ్డి చెబితే కూడా విన్నాం. ఆయన చెప్పిన డైలాగులు.. తమ కార్యకర్తలకు, హార్డ్‌కోర్ అభిమానలకు ఊపునిస్తుందేమో కానీ.. మామూలు జనానికి మాత్రం ఆయన స్థాయికి తగనిది అనిపించింది. వైసీపీలో కూడా కొంతమంది ఇక మీరు మారరా.. జగన్ సార్ అంటూ ప్రశ్నించడం కనిపించింది.
రప్పరప్ప నరుకుతా అంటే తప్పేంటి..?
ఏడాది కిందట చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి బుధవారం పల్నాడు పరామర్శ యాత్ర చేసిన వైసీపీ అధినేత జగన్ రేపు సినిమా చూపిస్తానంటూ.. అక్కడ వ్యాఖ్యలు చేశారు. అన్నట్లుగానే ఆయన ఇవాళ సినిమా చూపించేశారు. ఓ సినిమా అంతసేపు సాగిన రెండు గంటల ప్రెస్‌మీట్‌లో అల్లు అర్జున్‌లా అభినయం కూడా చేశారు. రప్ప.. రప్పమని నరుకుతామని మా వాళ్లు సరదా పడితే తప్పేంటని ప్రశ్నించారు.
వైకాపా అధ్యక్షుడు జగన్ మోహనరెడ్డి ఈ మధ్య కాలంలో ప్రజల్లోకి ఎక్కువుగా వస్తున్నారు. పర్యటనలు కూడా బాగానే చేస్తున్నారు. అయితే ఈ పర్యటనల్లో కార్యకర్తల ఉత్సాహం శృతి మించుతోంది. పెద్ద సంఖ్యలో ఆయన్ను చూడటానికి వస్తున్న కార్యకర్తలు కొంత ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నారు. జగన్ తెనాలి, పొదిలి పర్యటనల్లో అలాగే జరిగింది. నిన్న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని రెంటపాళ్ల తమ కార్యకర్త విగ్రహావిష్కరణ పర్యటనలో ఇది ఉత్సాహం మరింత ముదిరింది. ఈ సారి ఏకంగా టీడీపీ కార్యకర్తలను హెచ్చరిస్తూ.. చాలా మంది ప్లకార్డులు, ఫ్లెక్సీలను పట్టుకుని వచ్చారు. తొక్కి పడేస్తాం.. రప్ప.. రప్ప నరికేస్తాం.. అంటూ ఉన్న ఫ్లెక్సిలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అలాంటి ఫ్లెక్సి పట్టుకున్న రవితేజ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
తన పర్యటన సందర్భంగా నమోదు అవుతున్న కేసులపై వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫ్లెక్సీలు ప్రదర్శించిన వారిపై కేసులు గురించి జగన్ ప్రెస్‌మీట్ లో ప్రస్తావనకు వచ్చింది. దానిపై ఆయన స్పందించిన తీరు ఎలా ఉందో చూడండి..
ఈ మొత్తం విషయాన్ని చూస్తే దీనిపై జగన్ ఎలా రియాక్ట్ అవ్వాలో ముందుగానే ప్రిపేర్ అయినట్లుగా కూడా అనిపిస్తుంది. ఫ్లెక్సీలో ఉన్న డైలాగ్‌ను జర్నిస్టులతో బిగ్గరకా అనిపించడమే కాకుండా.. ఆయన కూడా పలికి.. అదొక సినిమా డైలాగ్ అని అలా అంటే తప్పేంటని అంటున్నారు. జగన్ గారు.. మీరు 16 ఏళ్ల నుంచి ప్రతక్ష రాజకీయాల్లో ఉన్నారు… ఐదేళ్లు ముఖ్యమంత్రి.. మరో ఐదేళ్లు ప్రతిపక్షనేత.. ఓ పెద్ద పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు. కార్యకర్తల్లో ఉత్సాహం ఉండటం సహజమే.. వాళ్లని ఉత్తేజితుల్ని చేయడానికి ఇంకేదైనా మాట్లాడటం కూడా మంచిదే.. కానీ.. ఇలా హింసాత్మక ఘటనలు ప్రేరేపించేలా.. ఓ కార్యకర్త చేసిన పనిని ఓ సినిమా డైలాగుతో వత్తాసు పలకడం కరెక్టేనా.. అదొక సినిమా డైలాగ్ అని సింపుల్‌గా తీసేసే విషయమా..? అయితే పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి తెలుగుదేశానికి చెందిన వాడేనని అతనికి పార్టీ సభ్యత్వం కూడా ఉందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. ఈ విషయాన్ని జగన్ ముందు ప్రస్తావించినప్పుడు.. అంటే తెలుగుదేశం వాళ్లు కూడా ఆ రేంజ్‌లో చంద్రబాబును తిడుతున్నారు అన్నారు. అయితే టీడీపీ మాత్రం అరెస్టైన యువకుడు వైసీపీ సానుభూతిపరుడే అని.. కేవలం టీడీపీ కార్యకర్తలకు వచ్చే జీవితబీమా పాలసీని పొందడానికి కార్డు తీసుకున్నాడని వివరణ ఇచ్చింది. అతను ఏ పార్టీ వ్యక్తి అయినప్పటికీ ఆ వ్యాఖ్యలు సమర్థించదగ్గవైతే కాదు.
కంట్రోల్ చేస్తున్నారా.. రెచ్చగొడుతున్నారా..?
కార్యకర్తల దూకుడుని జగన్ సమర్థిస్తున్నారా.. లేక మరింత రెచ్చగొడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వైఖరిని చూసిన తర్వాతే వాళ్లు మరింతగా రెచ్చిపోతున్నట్లుగా ఉంది. కార్యకర్తలను కాపాడుకోవడానికి.. వాళ్ల అరెస్టును తప్పు పట్టడాన్ని ఎవ్వరూ తప్పనరు. కానీ ఈ వ్యాఖ్యలను సమర్థించడం ఎంత వరకూ సబబు.. ఇప్పుడే కాదు. జగన్ మోహనరెడ్డి వ్యవహారశైలి ఇంతకు ముందు కూడా ఇలాగే ఉంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగి చాలా మందికి గాయాలైతే.. నా మీద అభిమానం ఉన్నోళ్లు చేసి ఉంటారులే అన్నారు.
తెనాలిలో ఘటన విషయంలో వైసీపీ రాజకీయంగా ఓ స్టాండ్ తీసుకుని ఉండొచ్చు... ఆ విషయంలో పోలీసుల తప్పు ఉండొచ్చు కానీ.. ఆ మొత్తం వ్యవహారాన్ని జగన్ ప్రొజెక్టు చేసిన తీరు.. ఆయన పర్యటన.. ఆయనకు సంపూర్ణ ఆమోదాన్ని ఇవ్వలేదు. తెనాలి యువకులపై రౌడీషీట్లు ఉండటం.. వాళ్లు చేసిన పనులు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రౌడీషీటర్లకు, గంజాయి బ్యాచ్‌కు మద్దతిస్తున్నారన్నట్లుగా ఆ వ్యవహారంపై కామెంట్లు వచ్చాయి.
జగన్ ఒక్కరే అలాగే వ్యవహరిస్తున్నారా.. మిగిలన వాళ్లు తీవ్ర వ్యాఖ్యలు చేయడం లేదా.. అనొచ్చు.. కానీ.. ఈ స్థాయిలో సమర్థనలు లేవు. చంద్రబాబు, లోకేష్ కూడా పలుమార్లు పోలీసులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ఎన్నికలకు ముందు చేసిన ప్రసంగాలు చాలా వరకూ పోలీసుల విషయంలో బెదిరింపు ధోరణిలోనే ఉండేవి. అయితే తప్పు చేసిన పోలీసుల గురించే అని ఆయన వివరణ ఇచ్చారు. జగన్ మోహనరెడ్డి కూడా మొదట్లో పోలీసుల గురించ అంతకంటే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఓ దశలో గుడ్డలూడదీసి కొట్టిస్తాం అని కూడా కామెంట్లు చేశారు. కానీ ఆ తర్వాత కాస్త తగ్గి తప్పు చేసిన పోలీసుల గురించి అంటూ.. సవరించుకున్నారు. ఏమైనా .జగన్ సమర్థనపై మాత్రం అంత సానుకూలత అయితే రావడం లేదు.