Congress leadership is gaining strength: దేశవ్యాప్తంగా ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, తమిళనాడులో డీఎంకే వంటి ప్రాంతీయ పార్టీల  ఓటమి ఇండియా కూటమి స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తోంది. అధికారం కోల్పోయిన మరుక్షణమే మమతా బెనర్జీ  ఐక్యత  మంత్రాన్ని పఠించడం, కూటమి నేతలతో వరుసగా ఫోన్లలో మాట్లాడటం వెనుక బలమైన రాజకీయ అవసరం కనిపిస్తోంది. ఒకప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రశ్నించిన వారంతా ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ గూటి కిందకు చేరక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Continues below advertisement

 అధికారం పోగానే  అలయెన్స్  గుర్తుకొచ్చిందా? 

బెంగాల్ ఎన్నికల సమయంలో ఒంటరిగా పోరాడి,  ఇండియా  కూటమిలో భాగంగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలను దూరం పెట్టిన మమతా బెనర్జీ, ఇప్పుడు ఓటమి తర్వాత అనూహ్యంగా స్వరం మార్చారు.  ఇకపై నా లక్ష్యం ఒక్కటే.. ఇండియా  టీమ్‌ను బలోపేతం చేయడం  అని ఆమె ప్రకటించారు.  అధికారం ఉన్నప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక అజెండాతో నడిచిన దీదీ, ఇప్పుడు అధికారం కోల్పోయాక పోరాటానికి ఇతర పార్టీల మద్దతు అనివార్యమని గుర్తించారు. ఇదే తీరు తమిళనాడులోనూ కనిపిస్తోంది. అధికారాన్ని కోల్పోయిన డీఎంకే కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అండ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Continues below advertisement

 రాహుల్ నాయకత్వానికి పెరిగిన వెయిట్ 

ఒకప్పుడు మమత, నితీష్ కుమార్ లేదా అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని తక్కువ చేసి చూశారు. కానీ, ప్రస్తుత ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కేరళ, అస్సాం వంటి రాష్ట్రాల్లో మెరుగైన ప్రదర్శన కనబరచడం, అటు  దళపతి  విజయ్ కూడా కాంగ్రెస్ మద్దతు కోరడం వంటి పరిణామాలు రాహుల్ ఇమేజ్‌ను పెంచాయి. బలహీనపడిన ప్రాంతీయ పార్టీల కంటే, బలమైన ప్రతిపక్షంగా నిలబడ్డ కాంగ్రెస్ నాయకత్వంలోనే బీజేపీని ఎదుర్కోవడం సాధ్యమని ఇతర నేతలు ఒక అవగాహనకు వస్తున్నారు.

కాంగ్రెస్ కు లభించిన సువర్ణావకాశం 

ఈ సంక్షోభం కాంగ్రెస్‌కు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. ప్రాంతీయ పార్టీలు తమ రాష్ట్రాల్లో ఆధిపత్యం కోల్పోవడంతో, కూటమిని నడిపించే బిగ్ బ్రదర్  హోదా ఇప్పుడు సహజంగానే హస్తం పార్టీకి దక్కింది. ఇప్పటివరకు కాంగ్రెస్ చెప్పే మాట వినని నేతలు కూడా ఇప్పుడు రాహుల్ లేదా ఖర్గే గీసిన గీత దాటలేని పరిస్థితి. ఇది ఒక రకంగా ప్రతిపక్ష ఐక్యతను మరింత క్రమబద్ధంగా, ఒకే నాయకత్వం కింద నడిపించడానికి దోహదపడుతుంది.  ప్రాంతీయ పార్టీలు కేవలం తమ రాష్ట్రాలకే పరిమితమైతే బీజేపీని జాతీయ స్థాయిలో ఢీకొట్టడం కష్టమని ఈ ఎన్నికలు నిరూపించాయి. అందుకే మమతా బెనర్జీ తనను తాను స్వేచ్ఛా విహంగం గా ప్రకటించుకుని, దేశవ్యాప్త పర్యటనలకు సిద్ధమవుతున్నారు. కూటమిలోని పార్టీలన్నీ కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరిస్తూ ముందుకు సాగితేనే 2029 లోక్‌సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వగలమనే వాస్తవం ఇప్పుడు స్పష్టమైంది.

మారిన  పవర్ సెంటర్ 

  బెంగాల్, తమిళనాడు ఓటములు ఇండియా కూటమిలో  పవర్ సెంటర్ ను ప్రాంతీయ నేతల నుండి ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి మార్చేశాయి. ఈ పరిణామం కాంగ్రెస్‌కు మేలు చేయడంతో పాటు, విపక్షాల మధ్య అనవసర పోటీని తగ్గించి ఒక బలమైన ఫ్రంట్ ఏర్పడటానికి దారితీస్తోంది. అహంకారాలను పక్కన పెట్టి, మమత వంటి నేతలు కాంగ్రెస్‌తో కలిసి నడవడానికి సిద్ధమవ్వడం భారత రాజకీయాల్లో ఒక కీలక మలుపు.