Greater elections Congress Plans:  తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.   రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 1500కు పైగా వార్డులను   కైవసం చేసుకుంది. 90 శాతానికి పైగా మున్సిపాలిటీలలో అధికార పార్టీ జెండా ఎగురవేయగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ కేవలం 772 వార్డులకే పరిమితమైంది. పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రభుత్వ పథకాలు, రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు నమ్మకం ఉంచారని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు.  అందుకే హైదరాబాద్ లో కొత్తగా ఏర్పాటు చేసిన మూడు కార్పొరేషన్లలో గెలవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. 

Continues below advertisement

భారీగా పట్టు కోల్పోయిన బీఆర్ఎస్ 

దశాబ్ద కాలంగా పట్టణ ఓటర్లపై తిరుగులేని పట్టున్న బీఆర్ఎస్ ఈసారి భారీగా నష్టపోయింది. 90 శాతం మున్సిపల్  కౌన్సిళ్లపై నియంత్రణ కోల్పోవడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనుల కంటే, ప్రస్తుత ప్రభుత్వ  గ్యారంటీ లకే ప్రజలు ఆకర్షితులయ్యారని స్పష్టమవుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి, అల్ప ఆదాయ వర్గాలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదకరంగా మారింది. పార్టీ అంతర్గత విభేదాలు, బలమైన క్షేత్రస్థాయి సమన్వయం లోపించడం కూడా ఈ ఓటమికి కారణాలుగా కనిపిస్తున్నాయి.

Continues below advertisement

మూడు కార్పొరేషన్లపై  రేవంత్  మాస్టర్ ప్లాన్ 

మున్సిపల్ ఫలితాల ఊపుతో రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు జీహెచ్‌ఎంసీపై దృష్టి సారించింది. 2026 చివరలో లేదా 2027 ప్రారంభంలో జరగనున్న గ్రేటర్ ఎన్నికల కోసం ప్రభుత్వం భారీ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే జీహెచ్‌ఎంసీ పరిధిని ప్రస్తుతం ఉన్న 650 చదరపు కిలోమీటర్ల నుండి 2000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తరించే ప్రతిపాదన తెచ్చింది. చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలను గ్రేటర్ లో విలీనం చేయడం ద్వారా ఓటర్ల సంఖ్యను పెంచి, మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది.  జీహెచ్‌ఎంసీని మూడు వేర్వేరు కార్పొరేషన్లుగా  హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి  విభజించారు.  గతంలో వైఎస్ఆర్ అనుసరించిన ఫార్ములాను రేవంత్ అమలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  

 అభివృద్ధి మంత్రం - మౌలిక సదుపాయాలే అస్త్రాలు 

రాబోయే మూడు కార్పొరేషన్ల ఎన్నికల లోపు నగర రూపురేఖలు మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. ముసి నది పునరుజ్జీవనం, మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూ.2,787 కోట్ల కేటాయింపు, బంజారాహిల్స్ నుండి శిల్పా లేఅవుట్ వరకు కొత్త రహదారి నిర్మాణం వంటి ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుల ద్వారా  విశ్వనగరం  క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా నగర ఓటర్ల మనసు గెలవాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది.

విపక్షాల ముందున్న సవాళ్లు 

ప్రస్తుత ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, కాంగ్రెస్ దూకుడును అడ్డుకోవడానికి బలమైన నాయకత్వం, స్థానిక అజెండాతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ తన పాత కోటను కాపాడుకోవడానికి నగర వాసుల్లో మళ్ళీ నమ్మకం కలిగించాల్సి ఉంది. ఈ త్రిముఖ పోరులో రేవంత్ రెడ్డి సర్కార్ వేస్తున్న ముందడుగులు విపక్షాలకు మున్ముందు గడ్డు కాలం మిగిల్చేలా ఉన్నాయి.