Congress Politics | హైదరాబాద్: మిగతా పార్టీల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో విచిత్రమైన వాతావరణం ఉంటుంది. పార్టీ పదవులు రాలేదని కొందరు అసంతృప్తి చేస్తుంటే, మంత్రి పదవులు రాలేదని బహిరంగంగానే విమర్శలు చేసేంత స్వేచ్ఛ హస్తం పార్టీలో ఉంటుంది. ఓవైపు ప్రభుత్వాన్ని నడుపుతూనే, మరోవైపు పార్టీ బాధ్యతల్ని చూసుకోవాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన 'సర్' (SIR - స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) జూమ్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు, నామినేటెడ్ ఛైర్మన్ పోస్టుల కోసం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు వచ్చే వారికి ఎలాంటి అపాయింట్‌మెంట్లు ఇవ్వవద్దని పార్టీ అగ్రనాయకత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ చుట్టూ తిరగడంపై రేవంత్ అసహనం
కొందరు నేతలు నియోజకవర్గాల్లో కాకుండా హైదరాబాద్‌లోనే ఉంటూ క్షేత్రస్థాయిలో పనిచేయకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రేపటి నుంచి ఆగస్టు 3 వరకు నేతలెవరూ పార్టీ ఆఫీసు అయిన గాంధీభవన్‌కు రావొద్దని, ఈ లోపు ఇన్‌ఛార్జి మంత్రులు అన్ని జిల్లాల్లో దీనిపై సమీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.
సర్ ప్రక్రియపై బీఎల్ఏ రిపోర్టులపై ఆధారపడకూదు.. సొంతంగా వర్క్ చేయాలి
రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు 489 భేటీలు జరిగాయని, ముఖ్యంగా వెనుకబడిన నియోజకవర్గాల్లోని నేతలు ఇప్పటికైనా చురుగ్గా స్పందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయి సమీక్షలు నిరంతరం జరపాలని, ఇన్‌ఛార్జిలుగా ఉన్న చోట బాధ్యతగా పనిచేయని వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. బూత్ లెవెల్ ఆఫీసర్ల (BLO) నివేదికలపై ఆధార పడటం కంటే పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) రిపోర్టులను పరిశీలించాలని, కేవలం అధికారుల నివేదికలపైనే ఆధారపడితే చర్యలు ఉంటాయన్నారు.
కాంగ్రెస్ నేతలు రాబోయే 10 రోజులు ఎన్నికల ప్రచారం తరహాలో నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలి. పదవులు, పోస్టులు అంటూ హైదరాబాద్ చుట్టూ తిరిగితే కుదరదు. జులై 30న SIR పై మళ్లీ పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తాం. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరింత బాధ్యత తీసుకుని ఈ ప్రక్రియను సమన్వయం చేయాలి. ఆగస్టు 3 వరకు సర్ ప్రక్రియ మీద ఫోకస్ చేయాలి, కానీ గాంధీ భవన్ వైపు మాత్రం పైరవీల కోసం ఎవరూ రావొద్దు. ఈ కార్యక్రమంలో అత్యుత్తమంగా పనిచేసే 100 మంది బీఎల్‌ఏలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిపిస్తామని, ఆయనతో ఫొటో దిగే ఛాన్స్ ఇస్తామని’ సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.
