Three Capital Agenda : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అత్యంత కీలక దశకు చేరుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. అసలు ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర వరకూ సమయం ఉంది. కానీ నేడో రేపో ఎన్నికలన్నట్లుగా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు ఏ స్ట్రాటజీతో వెళ్లాలని సీఎం జగన్ సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. తాను సగం మంది జనాభాకు ప్రతి ఇంటికి ఏటా రూ. నాలుగైదు లక్షలు ఇస్తున్నానని... గడప గడపకూ పార్టీ నేతలను పంపించి చెబుతున్నారు. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తననే ఎన్నుకోవాలని ఆయన పార్టీ నేతల ద్వారా సందేశం పంపుతున్నారు. ఈ కార్యక్రమాన్ని జగన్ సీరియస్‌గా తీసుకున్న తీరు చూస్తే వచ్చే ఎన్నికల్లో తన సంక్షేమ పాలనపై రిఫరెండంగానే ఓటింగ్‌కు వెళ్లాలని డిసైడయ్యారని అనుకుంటారు. కానీ జగన్ ఇప్పుడు అనూహ్యంగా రూటు మారుస్తున్నారు. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. మూడు రాజధానులే తమ విధానమని.. ప్రకటించబోతున్నారు. మూడు రాజధానులకే ప్రజల మద్దతు ఉందని ఈ అంశాన్నే అజెండాగా చేసుకుని ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంలో ఉన్నారన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. ఇప్పుడు జగన్ ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటే సంక్షేమం. రెండు మూడు రాజధానులు. ఏ పడవపై పెట్టి ఎన్నికలు ఈదుతారన్నది ఇప్పుడు కీలకంగా మరింది.
సంక్షేమంపై ఎంతో నమ్మకం పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి !
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తన పాలనపై ఎంతో నమ్మకం. తాను ప్రతి కుటుంబం సుభిక్షంగా ఆకలి దప్పులు లేకుండా.. చదువుల ఖర్చులేకుండా.. వైద్యం తిప్పలు లేకుండా ఖర్చులకూ డబ్బులిస్తూ.. అందర్నీ సుఖంగా చూసుకుంటున్నానని నమ్ముతున్నారు. అర్హుల పేరుతో చాలా మంది అనర్హులను చేసినప్పటికీ ఆయన .. తన ఓటు బ్యాంక్ చెక్కు చెదకుండా ఉండేంతగా పథకాలను అమలు చేస్తున్నానని గట్టి నమ్మకంతో ఉన్నారు. వారందరి ఓట్లు గుంపగుత్తగా తనకే పడతాయని ధీమాగా ఉన్నారు. అందుకే 175 సీట్లు ఎందుకు గెలవకూడదని ఆయన ప్రశ్నిస్తున్నారు. పార్టీ నేతలకూ అదే చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన సంక్షేమ పాలనే అజెండాగా ఓట్లు అడగాలని అనుకున్నారు. అందుకే పార్టీ నేతలందర్నీ గడప గడపకూ పంపుతున్నారు.
హఠాత్తుగా మూడు రాజధానుల వైపు చూపు !
అయితే జగన్ ఇప్పుడు తన సంక్షేమంపై ధీమా కోల్పోయినట్లుగా కనిపిస్తోంది. మూడు రాజధానుల ఎజెండాగా ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. అందుకే మూడు రాజధానుల అంశాన్ని హఠాత్తుగా తెరపైకి తెచ్చారు. మూడు రాజధానుల బిల్లు పెడతామని మంత్రులు ప్రకటనలు చేశారు. వాస్తవంగా చూస్తే మూడు రాజధానుల బిల్లు మరోసారి పెట్టడం చట్టం చేయడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే హైకోర్టు ఈ అంశంలో స్పష్టమన తీర్పు ఇచ్చింది. అయితే అసెంబ్లీ చర్చించడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. అసెంబ్లీలో చర్చించి.. మూడు రాజధానులపై తన వాదన వినిపించి.. అదే అదెండాతో ప్రజల్లోకి వెళ్లి .. మరోసారి ఎన్నికలను ఎదుర్కోవాలన్న ఆలోచన జగన్ చేస్తున్నారని అంటున్నారు. అందుకే పార్టీ నేతలతో .. మూడు రాజధానులపై ఘాటుైన ప్రకటనలు చేయిస్తున్నారని అంటున్నారు.
ప్రజల పల్స్ తెలుసుకోవడానికా ?
అధికారం చేపట్టిన కొత్తలో మూడు రాజధానులు అంటే కొంత కదలిక కనిపించింది. అమరావతిలో ఓ వర్గం వారే అభివృద్ధి చెందుతారనే ప్రచారాన్ని వ్యవస్థీకృతంగా చేసి ఉండటంతో ఇతర ప్రాంతాల వారు తమకేంటి అనే ఆలోచనకు వచ్చారు. అయితే ఇప్పుడు దాదాపుగా నాలుగేళ్ల పాలన తర్వాత కూడా అదే అభిప్రాయం ఉండటం కష్టం. ఎందుకంటే ఏపీలో అభివృద్ది పనులు జరగడం లేదు. అమరావతిని ఉద్దేశపూర్వకంగా ఆపేసినా .. పోలవరం కూడా ఆగిపోయింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. రోడ్లు కూడా అధ్వాన్యంగా తయారయ్యాయి. చిన్న చిన్న పనులు కూడా చేయలేని పరిస్థితి ఉంది. ఇది సహజంగానే ప్రజల్లో అసంతృప్తి కలిగిస్తోంది. పెరిగిన ధరలు.. ఇతర వ్యవహారాలు కూడా ప్రజల్లో అసంతృప్తికి కారణం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల పల్స్ తెలుసుకోవడానికి సీఎం జగన్ సంక్షేమం, మూడు రాజధానుల అంశాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెస్తున్నారని అంటున్నారు.
మొత్తంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చే ఎన్నికల ఎజెండాను ఖరారు చేసుకోవడంలో క్రాస్ రోడ్స్‌లో ఉన్నారు. తన పాలన.. సంక్షేమంపై ఓట్లు అడగాలా.. మూడు రాజధానులపైనా అన్నది ఆయన తేల్చుకోవాల్సి ఉంది.