Srikakulam Asking CM Sir : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. నరసన్నపేటలో జరిగే శాశ్వత భూ హక్కు-భూ రక్ష రెండవ విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. సాధారణ ముఖ్యమంత్రి జిల్లా పర్యటన అంటే ఆయన జిల్లాకి ఎటువంటి వరాలు కురిపిస్తారన్న ఆసక్తి సర్వత్రా ఉంటుంది. అయితే గతంలో ముఖ్యమ రాత్రి జిల్లాలో పర్యటించిన సందర్భంలో ఇచ్చిన హామీలు అమలుకి నోచుకోకపోవడంతో కొత్తగా ఇచ్చే హామీలపై ప్రజలకు ఆసక్తి లేకుండా పోయింది.
ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు జగనన్నా !
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన హయాంలో కొన్నింటిని చేపట్టినా అవి నేటికి పూర్తి కాలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనైనా అవి పూర్తవుతాయని అంతా ఆశిస్తున్నారు. అయితే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ళు అవుతున్నా ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ కూడా పూర్తికాకపోవడంతో జిల్లా వాసుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. శ్రీకాకుళం జిల్లాను సస్య శ్యామలం చేసేందుకు ఉద్దేశించిన వంశధార ప్రాజెక్ట్ ఫేజ్-2, స్టేజ్ -2 కూడా నేటికి పూర్తి కాలేదు. నిర్వాసితుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాజెక్ట్ లలో చోటు కల్పించినప్పటికీ సంవత్సరాలు గడుస్తున్నా పనులు ముందుకు సాగకపోవడం జిల్లా వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు. అదేవిధంగా నేరడి బ్యారేజ్ కి ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి ఒడిశా సిఎంతో చర్చలు జరపడంతో కొత్త ఆశలు రేకెత్తాయి. అయితే తర్వాత డిపిఆర్ లు సిద్ధం చేసినా ప్రాజెక్ట్ నిర్మాణంపై కదలిక మాత్రం రాలేదు. తాజాగా గొట్టా వద్ద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నెల్ఇవ్వడంతో పాటు పరిపాలన పరమైన అనుమతులు జారీ చేసి నిధులు మంజూరు చేసారు. అయితే ఆ పనులు సంగతేంటన్నది ఇంకా స్పష్టత రాలేదు. వచ్చే ఖరీఫ్ నాటికి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి శివారు ప్రాంతాలకి వంశధార నీటిని అందజేస్తామని జిల్లా మంత్రులు వివిద సందర్భాలలో చెబుతూ వస్తున్నారు. కాకపోతే ఇంకా టెండర్లు దశలోనే ఆ ఎత్తిపోతల పథకం ఉండడంతో నిజంగా అనుకున్న సమయానికి అది పూర్తవుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఉద్దానం తాగునీటి క్షోభ తీరెదెన్నడు ? ఆస్పత్రి అందుబాటులోకి వచ్చేదెప్పుడు ?
గతంలో సిఎం పలాస, నరసన్నపేట ,శ్రీకాకుళంలలో పర్యటించిన సందర్భంలో ఇచ్చిన హామీలు కూడా ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాలలో ను, ప్రజలలో అవన్నీ ఇప్పుడు ఆయా హామీలపై చర్చించుకుంటున్నారు. టెక్కలి, పలాస నియోజకవర్గ ప్రజల త్రాగు, సాగునీటి అవసరాలకు ఉద్దేశించిన ఆఫ్ షోర్ ప్రోజెక్ట్ పరిస్థితి కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. తాజాగా సవరించిన అంచనాల మేరకు నిధులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుందోననేది ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. ఉద్దానం ప్రాంత వాసులకి సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు ఉద్దేశించిన పథకం పనులతో పాటు కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు ముందుకు సాగుతున్నా అవి ప్రజలకి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయోనని ఆ ప్రాంత వాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కలెక్టరేట్‌కు రూ. పది కోట్ల మంజూరు ప్రకటన చేసి ఏళ్లు గడుస్తున్నా..పైసా రిలీజ్ చేయలేదు !
జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో కోడిరామ్మూర్తి స్టేడియంతో పాటు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. వాటిని జిల్లాకి చెందిన మంత్రులు సిఎం దృష్టికి తీసుకువెళ్లగా ఆయన శ్రీకాకుళం పర్యటన సమయంలో జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన హామీలను ఇచ్చారు. కొడిరామ్మూర్తి స్టేడియం నిర్మాణం కోసం 10 కోట్లు మంజూరు చేసినట్లుగా ప్రకటిం చినా నేటికి అవి అక్కరకు రాకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. జిల్లాలోని ఏకైక కోడిరామ్మూర్తి స్టేడియంని పూర్తి చేయాలన్న డిమాండ్ నెరవేర్చడంలోను ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కన్పిస్తోంది. ఇక ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణానికి కూడా నిధులు కొరత వెంటా డుతుండడంతో ముందుకు సాగలేదు. దాని నిర్మాణానికి సిఎం హామీనిచ్చినా ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో కూడా చెప్పలేనిపరిస్థితి నెలకొంది.
రోడ్లు సహా ఏ అభివృద్ధి పనికీ విడుదల కాని నిధులు !
అదేవిదంగా శ్రీకాకుళం - ఆమదాలవలస రహదారి విస్తరణకి నిధులు మంజూరైనా, భూసేకరణ, నిర్వాసి తులకు అందజేయాల్సిన నష్టపరిహారాలను చెల్లించేందుకు 18 కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా సిఎం గతంలో ప్రకటించారు. అయితే ఈ రోజుకి నిధులు జమకాకపోవడంతో పనులు అరకొరగానే నడుస్తున్నాయి. నరసన్నపేట నియోజకవర్గంలోని ప్రధానమైన బొంతు ఎత్తిపోతల పథకానికి నిధుల సమస్య వెంటాడుతుంది. శంకుస్థాపన చేసి సంవత్సరాలు గడుస్తున్నా పనులు మాత్రం ఎక్కిరిస్తున్నాయి. పలుమార్లు ప్రభుత్వం దృష్టికి స్వయంగా స్థానిక ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. నరసన్నపేట మెయిన్ రోడ్డు విస్తరణ పనుల పరిస్థితి కూడా అలాగే తయారైంది. సుమారు 4 కోట్లు అదనంగా అవసరం కాగా వాటిపై స్పష్టత రావడం లేదు. దీంతో నరసన్నపేట వాసులు పడరాని పాట్లు పడుతున్నారు. రానున్న సంక్రాంతి సమయానికి పనులు పూర్తి చేసేలా చూడాలని వ్యాపారులు కోరుతున్నారు.
ఫిషింగ్ హార్బర్‌కు శంకుస్థాపనే.. పనులెప్పుడు జగనన్నా ?
అలాగే సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల సమస్యలు పరిష్కరించే నాధుడే కరువ య్యారన్న ఆవేదన వారిని వెంటాడుతు ంది. భావనపాడు పోర్టును పూర్తిగా మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు. ను నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి స్వయాన శంకుస్థాపన చేసినా నేటికి పనులు ప్రారంభం కాలేదు. మంచినీ ళ్ళపేటది కూడా అదే పరిస్థితి. ఇవి కాకుండా జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయి. పెండింగ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తవుతాయ ని అంతా ఆశల పెట్టుకున్నారు. రాజన్న తనయుడే పూర్తి చేస్తాడని అధికార పార్టీ నేతలు బల్లలు గుద్ది చెప్పుతుంటారు. అయితే జిల్లా వాసులు ఆశించిన రీతిలో ప్రగతి దిశగా అడుగులు పడకపోతుండ డంతో ప్రజలలో నిరాస నిస్పృహలు నెలకొంటున్నాయి.