మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులరెడ్డికి మరోసారి సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. ఈరోజు మధ్యాహ్నం బాలినేనిని తాడేపల్లికి రావాలని చెప్పారు. ఇంతకీ ఆయనతో సీఎం జగన్ ఏం మాట్లాడతారు, ఎలా సమాధానపరుస్తారు అనే విషయంపై తీవ్ర చర్చలు నడుస్తున్నాయి.
ఆమధ్య బాలినేని పార్టీపై అలిగారు. పార్టీలోనే కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను సీఎం జగన్ చెప్పినమాటే వింటానన్నారు. ప్రెస్ మీట్ లో కంటతడి కూడా పెట్టుకున్నారు. ఆ ఎపిసోడ్ తర్వాత బాలినేని కాస్త సైలెంట్ అయ్యారు. తాజాగా ఇప్పుడు బాలినేనిని మరోసారి తాడేపల్లికి పిలిచారు. కర్నూలు పర్యటన అనంతరం సీఎం జగన్ తాడేపల్లికి తిరిగి వచ్చి బాలినేనితో భేటీ అవుతారు. ఈ భేటీలో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల ఇన్చార్జి పదవి గురించి కూడా చర్చ జరుగుతుందని తెలుస్తోంది. ఇన్చార్జి పదవి తనకు వద్దని ఇటీవల బాలినేని, జగన్ కి తెగేసి చెప్పారు. ఆ తర్వాత విజయసాయిరెడ్డికి ఆ బాధ్యతలను తాత్కాలికంగా అప్పగించారు. ఇప్పుడు వాటిని పూర్తి స్థాయిలో విజయసాయికే అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. బాలినేని సమక్షంలోనే బాధ్యతలు అప్పగిస్తారని, ఒకవేళ బాలినేని మనసు మార్చుకుంటే ఆయన్నే ఇన్ చార్జ్ గా ప్రకటిస్తారని అంటున్నారు.
విజయసాయి దూకుడు..
ఇటీవల కొంతకాలంగా పార్టీ వ్యవహారాల్లో విజయసాయి హవా తగ్గినట్టు వార్తలొస్తున్నాయి. ఆ వార్తలకు బలం చేకూర్చేలా విజయసాయి కూడా కొన్నిరోజులుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆయనకు ఇన్ చార్జ్ బాధ్యతలు అప్పగించే విషయంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. విజయసాయి రెడ్డి మొదట్లో విముఖత చూపినా, తప్పదని జగన్ పట్టుపట్టడంతో అనివార్యంగా భుజానికెత్తుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. బాలినేని, విజయసాయి, జగన్ మధ్య చర్చలు ఈరోజు కీలకంగా మారే అవకాశముంది.
నెల్లూరులో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు, చిత్తూరు, కడపలో కూడా పరిస్థితి పూర్తి స్థాయిలో సానుకూలంగా ఉందని చెప్పలేం. కుప్పంని కూడా టార్గెట్ చేసి చిత్తూరులో క్లీన్ స్వీప్ చేయాలనుకుంటున్న జగన్, అక్కడ ఇన్ చార్జ్ కాస్త గట్టిగా పని చేయాలనుకుంటున్నారు. ఇటీవల ఆ మూడు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. దీంతో జగన్ మరింత కేర్ తీసుకోవాలనుకుంటున్నారు. విజయసాయికి ఆ బాధ్యతలు అప్పగించబోతున్నారు.
వైవీ సుబ్బారెడ్డి, బాలినేని దగ్గరి బంధువులే అయినా.. వీరి మధ్య ఇప్పుడు మాటల్లేవు. వీరిద్దరూ సీఎం జగన్ కి బంధువులే అయినా.. సర్దుబాటు చేయడానికి ఆయన కూడా పెద్దగా ప్రయత్నించలేదు. తీరా ఇప్పుడు పంచాయితీ పెట్టాల్సి వచ్చింది. ప్రకాశం జిల్లాలో తనను పలుచన చేసేందుకు వైవీ ప్రయత్నించారనేది బాలినేని ఆరోపణ. పరోక్షంగా ప్రెస్ మీట్లలో కూడా ఆయన ఇవే ఆరోపణలు చేశారు. తీరా ఇప్పుడు వీరిద్దరి మధ్య విజయసాయి ఎంట్రీ ఇస్తున్నారు. వైవీని ఉత్తరాంధ్రకు ఇన్ చార్జ్ గా పెట్టిన జగన్, ఇప్పుడు వైవీకి సానుకూల, వ్యతిరేక వర్గాలు రెండూ ఉన్న ప్రకాశం జిల్లాను విజయసాయి చేతుల్లో పెడుతున్నారు. జగన్ పొలిటికల్ గేమ్ తో ఆ మూడు జిల్లాల ముఖచిత్రం మారిపోతుందా, లేదా పెనంపైనుంచి పొయ్యిలో పడినట్టు అవుతుందా..? వేచి చూడాలి.