CM Jagan Bus Yatra: దేశంతో పాటు రాష్ట్రంలోనూ ఎన్నికల సందడి మొదలైంది. ఏపీలో నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ భారీ ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో సీఎం జగన్ (CM Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. 'మేమంతా సిద్ధం' (Memantha Siddam) పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఈ నెల 26న లేదా 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం కానున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ దాదాపు 21 రోజుల పాటు ఈ యాత్ర సాగనుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంటరీ స్థానాల పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఈ యాత్ర సాగనున్నట్లు తెలుస్తోంది. తొలి విడతలో బస్సు యాత్ర, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. యాత్రలో భాగంగా ప్రతి రోజూ ఒక జిల్లాలో సీఎం జగన్ ప్రచారం నిర్వహిస్తారు. ప్రజలకు సంక్షేమాన్ని వివరిస్తూ.. వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. బస్సు యాత్ర, సభలపై పూర్తి వివరాలను మంగళవారం వెల్లడిస్తామని వైసీపీ వర్గాలు స్పష్టం చేశాయి.


‘వైనాట్ 175’


‘వైనాట్ 175’ ఇదే నినాదంతో సీఎం జగన్ దూసుకెళ్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇటీవల 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల జాబితాను ఇటీవల విడుదల చేశారు. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలుపొందిన జగన్.. ఈసారి 175 నియోజకవర్గాల్లోనూ విజయం సాధించేలా అభ్యర్థులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేసుకుని సీట్లు కేటాయించారు. పార్లమెంటరీ స్థానాల్లోని అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. తాము చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించి.. వారి సూచనలు, సలహాలు తెలుసుకోనున్నారు. అన్ని వర్గాల ప్రజలతోనూ మమేకం కానున్నారు. ఇప్పటికే రీజియన్ల వారీగా 'సిద్ధం' సభలను నిర్వహించారు. ఇప్పుడు 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రతో ప్రజలను నేరుగా కలిసి ప్రభుత్వ పథకాలు, జరిగిన మంచిని వివరించనున్నారు. ప్రతి రోజూ ఉదయం ఇంటరాక్షన్.. మధ్యాహ్నం బహిరంగ సభ ఉండనున్నట్లు సమాచారం. కొన్ని నెలల ముందు నుంచే ఆయా నియోజకవర్గాల్లో సామాజిక సాధికార బస్సు యాత్రలతో మంత్రులు, నేతలు ప్రజల్లోకి వెళ్లారు. ఇప్పుడు సీఎం జగనే నేరుగా రంగంలోకి దిగనున్నారు. ఓ వైపు సిద్ధం సభలతో ఫుల్ జోష్ లో ఉన్న వైసీపీ శ్రేణులకు.. సీఎం జగన్ బస్సు యాత్ర రెట్టింపు ఉత్సాహాన్నిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గతంలో పాదయాత్రతో జగన్ ప్రజలకు చేరువయ్యారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈసారి కూడా ఎక్కువగా ప్రజల్లోనే ఉంటూ భారీ విజయం అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లకు కీలక సూచనలు ఇచ్చారు. పాలనాపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ప్రచారం నిర్వహించేలా చర్యలు చేపడుతున్నారు.


Also Read: North Andhra News: ఉత్తరాంధ్రను ఊపేస్తున్న రాజకీయ సమీకరణాలు-కీలక నియోజకవర్గాలపైనే అందరి చూపు