AP Elections 2024: ఎన్నికల షెడ్యూలు విడుదలవ్వక ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులకు తెలుగుదేశం(Telugu Desam) పార్టీ సవాల్‌ విసరగా....షెడ్యూల్ విడుదలకు గంట ముందు రాష్ట్రంలోని  అభ్యర్థులందరిని ఒకేసారి ప్రకటించి సీఎం జగన్(Jagan) దీటుగా జవాబిచ్చారు. ఈసారి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ఫలితాలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రను రాజధానిగా ప్రకటించడమేగాక, గెలిస్తే ఏకంగా విశాఖ(Visaka)లోనే ప్రమాణం చేస్తానని హామీ ఇచ్చారు. అటు తెలుగుదేశం పార్టీ సైతం జగన్ మోసం చేస్తున్నారంటూ ఎక్కడికక్కడ ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది. ఇరుపార్టీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఎలా ఉన్నా...ఉత్తరాంధ్రలో కొన్ని నియోజకవర్గాల్లో  పోరు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది..


సిక్కోళం సిత్రాలు
గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో పోరు రాయలసీమను  తలపించాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు....అరెస్ట్‌లు, ఆందోళనలతో ఉత్తరాంధ్ర(North Andhra Pradesh) ఉడికెత్తిపోయింది. ఇప్పుడు మరోసారి  అదే అభ్యర్థులు ప్రత్యర్థులుగా తలపడుతుండటంతో  మరింత ఆసక్తి రేకెత్తుతోంది. ముఖ్యంగా  శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో ఎన్నికల పోరు అంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది టెక్కలి(Tekkali) నియోజకవర్గమే. ఎందుకంటే ఇక్కడి నుంచి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu)పోటీ చేస్తుండగా...ఆయనపై మరోసారి దువ్వాడ శ్రీనివాస్ పోటీపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వీరిరువురి మధ్య జరిగిన సవాళ్లు, ప్రతిసవాళ్లు....ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(Duvvada Srinivs) ఏకంగా అచ్చెన్నాయుడు స్వగ్రామంలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మరోసారి వీరువురి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీపడుతుండటంతో  తీవ్ర ఆసక్తి కలుగుతోంది.


ఆమదాలవలసలోనూ  ఆసక్తికరపోటీ నెలకొంది. మరోసారి బావబావమరిది పోటీపడుతున్నారు. సభాపతి తమ్మినేని సీతారాం(Tammineni Seetaram)పై ఆయన మేనల్లుడు, బావమరిది అయిన కూన రవికుమార్‌(Kuna Ravi Kumar) కాలు దువ్వుతున్నారు.  తమ్మినేని వారసుడిగానే  రాజకీయ అరంగ్రేటం చేసిన కూన రవికుమార్ ఏకంగా ఆయనపైనే పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో బావ చేతిలో ఓటమి చవిచూసినప్పటికీ మరోసారి పోటీకి సిద్ధమయ్యారు.శారు. సొంత బావబావమరిది అయినప్పటికీ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా  విభేదాలు పొడచూపాయి. కావున వీరివురి మధ్య పోటీ సైతం ఆసక్తి రేకెత్తిస్తోంది.

శ్రీకాకుళం పేరు చెబితే గుర్తుకు వచ్చే మరో కీలక నేతలు ధర్మాన సోదరులు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం ఆ పార్టీకి కంచుకోటగా ఉంది. వరుసగా ఐదుసార్లు ఆ పార్టీ అభ్యర్థులే గెలుపొందగా....2004లో తొలిసారి ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasad Rao) ఆ విజయపరంపరకు బ్రేకులు వేశారు. తొలిసారి అక్కడి నుంచి గెలుపొందిన ఆయన 2009లోనూ విజయం సాధించారు. అయితే ఆయన హ్యాట్రిక్ విజయాలకు మళ్లీ తెలుగుదేశం బ్రేకులు వేయగా...గత ఎన్నికల్లో తిరిగి ధర్మాన గెలుపొందారు. మళ్లీ నాల్గొసారి శ్రీకాకుళం నుంచే ఆయన బరిలో నిలవగా....ఎన్డీఏ కూటమి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఆయన సోదరుడు మాజీమంత్రి ధర్మాన కృష్ణదాసు(Dharmana Krishna Das) సైతం నరసన్నపేట నుంచి మళ్లీ బరిలో దిగుతుండగా....ఆయనపై  బగ్గు రమణమూర్తిని తెలుగుదేశం పార్టీ నిలబెట్టింది.


రాజుల కోటలో పాగా ఎవరిది..?
విజయనగరం పేరు ఎత్తగానే రాజులు, రాజ్యాలే గుర్తుకువస్తాయి. ఒకప్పుడంటే రాచరిక వ్యవస్థ ఉంది కానీ...ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఐదేళ్లకు ప్రజలు ఎన్నుకోబడిన వారే ప్రభువులు. దీన్ని గౌరవిస్తూ  విజయనగరం రాజులు సైతం ఎన్నికల్లో పోటీ చేసే అధికారపీఠం అధిరోహించారు. విజయనగరంలో రాజకుటుంబం నుంచి నాల్గవతరం వారసురాలు  అదితి విజయలక్ష్మీ గజపతిరాజు(Adhithi Gajapathiraju) తెలుగుదేశం నుంచి పోటీలో ఉండగా...వైసీపీ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి అవకాశం కల్పించింది. గత ఎన్నికల్లో ఆయన చేతిలోనే ఓటమి పాలైన అదితి ఈసారైనా గెలుస్తారో లేదోనని జిల్లావాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


మరో రాజరిక కుటుంబం బొబ్బిలిగడ్డపై బేబీనాయన తెలుగుదేశం నుంచి పోటీ చేస్తుండగా...ఆయనపై చిన అప్పలనాయుడిని వైసీపీ బరిలోకి దింపింది. ఈసారి యుద్ధంలోనైనా  బేబీనాయన విజయం సాధిస్తారో లేదో చూడాల్సిందే. ఇక విజయనగరం జిల్లాలోనే కాదు...రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న  ఫలితం చీపురుపల్లిదే. ఎందుకంటే ఇక్కడి నుంచి సీనియర్ నాయకుడు మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) పోటీ చేస్తుండగా...ఆయనకు సమఉజ్జిని తెలుగుదేశం పార్టీ సిద్ధం చేసిపెట్టింది. మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao)ను ఈసారి బొత్సపై బరిలో దింపేందుకు తెలుగుదేశం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు గంటా నుంచి ఎలాంటి సానుకూల  సంకేతాలు లేకపోయినప్పటికీ...ఆయన్నే బరిలో దింపే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబు రెండుసార్లు స్వయంగా  గంటా శ్రీనివాసరావుకు సూచించారు. పోటీచేసిన ప్రతిసారీ గెలుపొందడం  గంటాకు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టే ఈసారి చీపురుపల్లి ఫలితం అత్యంత ఆసక్తికరంగా మారనుంది. 


గజపతినగరం నుంచి బొత్స సోదరుడు అప్పలనర్సయ్య సైతం వైసీపీ తరపున పోటీ చేస్తుండగా...ఆయనపై కొండపల్లి శ్రీనివాస్ బరిలో దిగారు. ఇకఈసారి నెల్లిమర్ల నియోజకవర్గంపైనా  సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక్కడి నుంచి విద్యాసంస్థల అధినేత లోకం మాధవి(Lokam Madhavi) జనసేన తరపున బరిలో దిగడమేగాక...తొలి జాబితాలోనే  సీటు దక్కించుకుంది. ఆర్థికంగానూ  బలంగా ఉండటంతో...గత ఎన్నికల్లో రాజకీయ కురువృద్ధుడు పతివాడ నారాయణస్వామి నాయుడుపై గెలుపొందిన  బడుకొండ అప్పలనాయుడికే వైసీపీ సీటు ఇచ్చింది.


వైజాగ్‌లో మెజార్టీ వాటా ఎవరిదో
తెలుగుదేశం పార్టీ కంచుకోట ఉక్కునగరంపై మరోసారి పట్టునిలుపుకునేందుకు  శతవిధాల ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా విఫలమైనా... విశాఖలోని నాలుగు సీట్లు కైవసం చేసుకుని సత్తా చాటింది. వైజాగ్ ఈస్ట్‌లో వరుసగా విజయాలతో దూసుకుపోతున్న  రామకృష్ణబాబు(Ramakrishna Babu)పై ఈసారి వైసీపీ బలమైన అభ్యర్థిని నిలబెట్టింది. సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ(MVV Satyanarayana) ను బరిలో నిలిపింది. విశాఖ దక్షిణం నుంచి తెలుగుదేశం నుంచి గెలుపొందిన వాసుపల్లి గణేశ్ వైసీపీలో చేరగా...వైసీపీ నుంచి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణయాదవ్‌ను కూటమి అభ్యర్థిగా నిలిపారు. వీరిరువురిలో ఎవరు గెలుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక గాజువాకలో చివరి నిమిషంలో సీటు సాధించిన మంత్రి గుడివాడ అమర్నాధ్‌(Gudivada Amarnath)పై తెలుగుదేశం అభర్థి పల్లా శ్రీనివాసు (Palla Srinivas)పోటీ చేయనున్నారు. పాయకరావుపేటలో తెలుగుదేశం ఫైర్‌బ్రాండ్ వంగలపూడి అనిత(Vanagalapudi Anitha0 బరిలో దిగుతుండగా..ఆమెపై కంబాల జోగులును వైసీపీ నిలబెట్టింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూసే మరో నియోజకవర్గమే నర్సీపట్నం. ఇక్కడి నుంచి సీనియర్ నేత మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు (Ayyannapathrudu) బరిలో దిగుతుండగా.....ఆయనపై సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమాశంకర గణేశ్ మరోసారి పోటీలో నిలిచారు.