PM Modi: దేశంలో సార్వత్రిక ఎన్నికల(General Elections) కోలాహలం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు స్థానాలకు నగారా మోగిన నేపథ్యంలో జాతీయ(National), ప్రాంతీయ పార్టీలు ప్రచారాన్ని ప్రారంభించాయి. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారు? అనేది జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు(Vote counting)తో తేలిపోనుంది. అయితే.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ తమదే గెలుపు అని బల్లగుద్దినట్టు చెబుతున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ(BJP) మాత్రమే. వాస్తవానికి అధికారానికి పదేళ్లపాటు దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ తరహాలో ధీమా వ్యక్తం చేయకపోవడం గమనార్హం. కానీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే(NDA) కూటమి మాత్రం గెలుపుపై పక్కా ధీమాతో ఉంది. మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పదే పదే చెబుతున్నారు. ఆయన ఎక్కడకు వెళ్లినా.. ఇదే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీలో పర్యటించిన ప్రధాని చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో నిర్వహించిన `ప్రజాగళం` సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూడా ఆయన ఎన్డీయే కూటమికి 400 పైచిలుకు పార్లమెంటు సీట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ ఒక్కచోటే కాదు.. దేశంలో ఎక్కడ పర్యటిస్తున్నా.. ``ఔర్ ఏక్‌బార్`` నినాదాన్నే మోదీ వినిపిస్తున్నారు.
ఎందుకీ ధీమా!
ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కనబరుస్తున్న ఈ ధీమా వెనుక కారణం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. గత పదేళ్లలో ఎన్డీయే హయాంలో అనేక సంస్కరణలు తీసుకురావడం, సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజల్లో భరోసా నింపడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు ద్వారా.. దేశప్రజలకు అందరికీ జమ్ము కశ్మీర్‌పై హక్కులు కల్పించారు. అదే విధంగా అక్కడి వారికి కూడా స్వేచ్ఛ కల్పించారు. అసలు గత ప్రభుత్వాలు తలుచుకునేందుకు కూడా భయపడిన ట్రిపుల్ తలాక్ రద్దు వంటివి ప్రధాని మోదీ తన హయాంలో సాధించారు. అలానే.. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వంటివి తీసుకువచ్చారు. ఇక, 500 ఏళ్ల నాటి సమస్య అయోధ్య రామమందిరానికి కూడా ఈ పదేళ్ల కాలంలోనే ఒక పరిష్కారం లభించింది. కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొని.. ప్రపంచానికి సైతం భారత్ దన్నుగా నిలిచింది. అంతేకాదు..అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అవినీతి రహితంగా పాలన అందించడం.. మోదీ పాలనలో ఎన్నదగిన విషయం. ఇక, గత కొన్నాళ్ల కిందటి వరకు ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితిని పక్కన పెట్టి ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా మేకిన్ ఇండియాకు పెద్దపీట వేశారు. ఫలితంగా.. రక్షణ రంగం సహా అనేక అంశాల్లో భారత్ ఇప్పుడు తయారీ కేంద్రంగా నిలిచింది. అంతేకాదు.. పొరుగు దేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి కూడా చేరింది. ఇలా.. ఏ విధంగా చూసుకున్నా.. ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు, వేసిన అడుగులు గెలుపుపై ధీమా వ్యక్తం చేసేలా దోహదపడ్డాయని అంటున్నారు పరిశీలకులు.
వచ్చే 100 రోజులకు మాస్టర్ ప్లాన్
వాస్తవానికి దేశంలో ఇంకా సార్వత్రిక సమరం పూర్తి కాలేదు. ఇప్పుడే ప్రకటన వచ్చింది. కానీ, ప్రధాని మోదీ మాత్రం తిరిగి తమ ప్రభుత్వమే ముచ్చటగా మూడోసారి కూడా కొలువు దీరుతుందని ఆశాభావంతోపాటు అచంచల విశ్వాసంతో ఉన్నారు. అందుకే ఆయన తన మంత్రివర్గ బృందానికి.. పెద్ద టాస్క్ అప్పగించారు. మూడోసారి తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చే 100 రోజుల(100 Days)కు ఎలాంటి కార్యక్రమాలు చేయాలో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. మొదటి 100 రోజుల పాలనలో అమలు చేసే కార్యక్రమాలకు సంబంధించి ఓ రోడ్ మ్యాప్ రూపొందించాలని కేంద్ర మంత్రులను కోరారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వచ్చే ఐదేళ్ల కొత్త ప్రభుత్వం కోసం తొలి వంద రోజుల్లో అమలు చేసే కార్యక్రమాలను ఏ విధంగా మెరుగ్గా అమలు పరచాలన్నది చర్చించారు. దీనిపై కేంద్రమంత్రులు వారి శాఖల కార్యదర్శులు, ఇతర అధికారులను కలవాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరునాడే ఈ సమావేశం జరగడం గమనార్హం. ఎన్నికల షెడ్యూల్‌పై ఈసీ సిఫార్సును రాష్ట్రపతికి పంపడం ద్వారా లోక్‌సభ ఎన్నికల తేదీలను నోటిఫై చేసే ప్రక్రియను కూడా క్యాబినెట్ పూర్తి చేసింది. మొత్తంగా చూస్తే.. గెలుపుపై ప్రధాని మోదీ పూర్తి విశ్వాసంతో ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తోంది.