PM Narendra Modi Comments On Congress at PrajaGalam Sabha: అమరావతి: దేశంలో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యాక ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సభలో వైసీపీపై, జగన్ పై, కాంగ్రెస్ పై, షర్మిల మీద మోదీ కామెంట్స్ చేశారు. దాంతో ప్రధాని సభ ముగిశాక ఏపీ పీసీసీ అధ్యక్షురాలు తనదైనశైలిలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. అటు జగన్‌ను, ఇటు బాబును రెండు పంజరాల్లొ పెట్టుకుని ఆడిస్తున్న రింగ్ మాస్టర్ బీజేపీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


రాష్ట్ర వినాశనంలో బీజేపీది కీలక పాత్ర 
పదేండ్ల రాష్ట్ర వినాశనంలో ముఖ్య పాత్ర పోషించిన పార్టీ బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం అంటూ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. పైగా ఇప్పుడు నా మీద దాడులా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, వైసీపీ ఒకటే అని ప్రధాని మోదీ కూతలా? ఐదేళ్లుగా జగన్ తో అంటకాగిందెవరని సూటిగా అడిగారు షర్మిల. వైసీపీ నేతల అరాచకాలను అడ్డుకోకుండా, ఎదురు వారికి అడ్డగోలు సహాయ సహకారాలు అందించింది బీజేపీ అని ఆరోపించారు. ఇంకా నాశనం చేసుకోండి, ఇంకా అప్పుతెచ్చుకోండి అంటూ తెరచాటు స్నేహం నడిపింది ఎవరో, దత్తపుత్రుడు అన్నది ఎవరినో అంటూ తనదైన శైలిలో షర్మిల స్పందించారు. 


సిగ్గువిడిచి కేంద్రానికి సపోర్ట్ చేసిన జగన్ 
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు సిగ్గువిడిచి సపోర్ట్ చేసింది జగన్ రెడ్డి సర్కారు అని షర్మిల విమర్శించారు. మోడీ మిత్రులు అదానీ, అంబానీలకు రాష్ట్రంలో ఆస్తులు కట్టపెట్టి, వారికీ రాజ్య సభ సీట్లు ఇచ్చింది జగన్ సర్కారు అని ఆరోపించారు. ఇది వీరి స్నేహం, విడదీయరాని బంధం అని వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్ పై సెటైర్లు వేశారు. 






హామీలు ఇచ్చింది కాంగ్రెస్, వాటిని తుంగలో తొక్కింది బీజేపీ, టీడీపీ, వైసీపీ అని షర్మిల అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఆ అసమర్థత, మోసాలను కప్పిపెట్టాలని కాంగ్రస్ మీద పసలేని దాడులు చేస్తున్నారు.. అంటే కాంగ్రెస్‌కు మీరు భయపడుతున్నారా అని ప్రధాని మోదీని, బీజేపీని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదామీదే అన్న వాగ్దానం వణుకు తెప్పిస్తోందా? అని వైఎస్ షర్మిల తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.