Opposition For TDP MLAs :  ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రతిపక్షానిది కూడా అంతే పాత్ర. తాము తప్పు చేస్తే ప్రజల ముందు ప్రతిపక్షం నిలబెడుతుందన్న భయం అధికార పార్టీలో ఉన్నప్పుడే ప్రభుత్వం అయినా ప్రజా ప్రతినిధులు అయినా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు. పాలనలో తప్పులు చేయడానికి వెనుకాడుతారు.  ప్రస్తుతం ఏపీలో  ప్రధాన ప్రతిపక్షం లేదు. కానీ ప్రతిపక్షం ఉంది. అయితే  ఆ పార్టీకి ప్రజాప్రతినిధులు తక్కువగా ఉండటం వల్ల, ప్రభుత్వంపై  పోరాటం కష్టమన్న భావన వల్ల సైలెంట్ అయిపోయిన నేతల వల్ల ప్రతిపక్ష పాత్ర ఏపీ రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. ఇది అధికార పార్టీకే ఇబ్బందికరంగా మారింది. 


ప్రతిపక్షం లేకపోవడం వల్ల రెచ్చిపోతున్న ఎమ్మెల్యేలు


అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలకు చక్రవర్తులుగా భావిస్తారు. ప్రతి విషయం తమ కనుసన్నల్లోనే జరగాలని చూసుకుంటారు. ప్రశ్నించేవారు లేకపోతే ఏం జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు అత్యధిక నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేలకు తిరుగులేదు. వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వారిలో చాలా మంది ఇనాక్టివ్ అయ్యారు. ఎన్నికలకు ఒకటి, రెండేళ్ల ముందు చూసుకుందామని అనుకుంటున్నారు. రాష్ట్ర పార్టీ కూడా సోషల్ మీడియా మీదనే దృష్టి పెట్టింది. ఇప్పుడు రాష్ట్ర స్థాయి నేతలు తమపై పడుతున్న కేసులు, ఇతర అంశాలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాల్సి వస్తోంది. దీంతో నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఎదురు లేకుండా పోతోంది. ఫలితంగా వారు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు  పాల్పడుతున్నారన్న వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. 


ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలి - వైఎస్‌ఆర్సీపీ వర్క్‌షాప్‌లో జగన్ కీలక వ్యాఖ్యలు


కమిషన్లు ఇవ్వాలని నేరుగా ప్రకటిస్తున్న ఎమ్మెల్యేలు


ఇసుక, లిక్కర్ సహా ఇతర వ్యాపారాలు చేసే వారు తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధి కోసం పదిహేను శాతం ఇవ్వాలని ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తండ్రి. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నేరుగానే మీడియా ముందు ప్రకటించారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఇలా చెప్పడం లేదు. నేరుగా యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. అడిగే వారు లేరు. నేరుగా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి.. ఎమ్మెల్యేలను హెచ్చరించాల్సి వస్తోంది. నిజానికి ఎమ్మెల్యేలకు ఆదాయ వనరు పనుల్లో వచ్చే కమిషన్లే. నియోజకవర్గానికి తామే సామంతరాజులుగా భావించి వసూళ్లు చేస్తూంటారు. ఇలాంటి వాటి వల్లే ఎక్కువగా వ్యతిరేకత వస్తుంది. అయినా ఏ ప్రభుత్వాధినేత వీటిని కట్టడి చేయలేకపోతున్నారు. వైసీపీ హయాంలోనూ ఇదే జరిగింది. 



Also Read: సైలెంట్‌గా పార్టీ ప్రక్షాళన చేస్తున్న జగన్- ఉత్తరాంధ్ర బాధ్యతలు విజయసాయిరెడ్డికి అప్పగింత- ప్రతిపాడులో వైసీపీకి టీడీపీ నేత హోప్




ఈ వ్యవహారం ముదిరిపోతే ప్రజా వ్యతిరేకతకు దారి తీస్తుందన్న ఉద్దేశంతో చంద్రబాబు వీలైనంత ఎక్కువగా కట్టడి  చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేకంగా టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి గట్టి హెచ్చరికలు చేయనున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడే ఇసుక, లిక్కర్ పై దృష్టి పెడుతున్నారు. ఇప్పుడే వార్నింగ్ ఇస్తే చాలా మంది ఆ దారిలోకి వెళ్లేందుకు తగ్గుతారని భావిస్తున్నారు. నేరుగా ప్రజల్ని ప్రభావితం చేసే అంశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు చెప్పనున్నారు. ఇతర పార్టీల వాళ్లు విమర్శిస్తారని ఇప్పటి వరకూ ఎమ్మెల్యేలు ఆచితూచి వ్యవహరించేవారు. ఇక ముందు చంద్రబాబు భయంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.