Workshop for the TDP candidates : తెలుగుదేశం పార్టీ లోక్‌సభ, శాసనసభ అభ్యర్థులకు ఈ నెల 23న విజయవాడలో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం జరుగుతుంది. అభ్యర్థులతో పాటు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి వారు ఇప్పటికే నియమించుకున్న అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, పొలిటికల్ మేనేజర్, మీడియా మేనేజర్, సోషల్ మీడియా మేనేజర్లను వర్క్ షాప్‌నకు పిలిచారు.
ఒక్కో అభ్యర్థి నలుగురు మేనేజర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించిన టీడీపీ హైకమాండ్
టీడీపీ అభ్యర్థులు ఒక్కొకరు నలుగురు మేనేజర్లను ఏర్పాటు చేసుకోవాలని అధిష్టానం ఇప్పటికే సూచించింది. అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, పొలిటికల్ మేనేజర్, మీడియా మేనేజర్, సోషల్ మీడియా మేనేజర్లను ఏర్పాటు చేసుకోవాలని నిరంతరం వారి నుంచి పార్టీ కార్యాలయం ఫీడ్ బ్యాక్ తీసుకుంటుందని గతంలోనే చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన ఆదేశాల మేరకు వారందర్నీ నియమించుకున్నారు అభ్యర్థులు. ఇప్పుడు అభ్యర్థుల్ని వారి మేనేజర్లందర్నీ వర్క్ షాప్ కి పిలుస్తున్నారు. రాబోయే 2 నెలల ఎన్నికల కార్యాచరణ, పోల్ మేనేజ్‌మెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ వర్క్‌షాప్‌లో వారికి అవగాహన కల్పిస్తారని తెలుస్తోంది.
వైసీపీ అభ్యర్థులకు ఐ ప్యాక్ - టీడీపీకి చంద్రబాబు నేతృత్వంలో వర్క్ షాప్
ఇటీవలి కాలంలో రాజకీయ ప్రచార శైలి మారిపోయింది. వైసీపీ అభ్యర్థులకు సంబంధించిన ప్రతీ విషయం ఐ ప్యాక్ బృందం చూసుకుంటూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి స్ట్రాటజిస్ట్ ఉన్నప్పటికీ అభ్యర్థులపై పూర్తి స్థాయి పెత్తనం ఇవ్వలేదు. నియోజకవర్గాల పరిస్థితుల్ని బట్టి వారే నియమించుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో.. అలా నియమించుకున్న వారందరికీ టీడీపీ హైకమాండ్ శిక్షణ ఇస్తోంది.
రెండు రోజుల్లో పెండింగ్ ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన
లోక్‌సభ అభ్యర్థులతో పాటు, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఆ జాబితాల్ని గురు లేదా శుక్రవారాల్లో ప్రకటించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు ఈ నెల 24, 25 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారు. 26 నుంచి ‘ప్రజాగళం’ పేరుతో చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభిస్తారు. రోజుకో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పర్యటన ఉంటుంది. ఉదయం ఒక శాసనసభ నియోజకవర్గంలో 10 వేల మందితో ప్రజాగళం సభ జరుగుతుంది. మధ్యాహ్నం 4.30 గంటలకు ఒక నియోజకవర్గంలో, రాత్రి 7.30కు మరో నియోజకవర్గంలో రోడ్డుషో నిర్వహిస్తారు. 26 నుంచి సుమారు 20 రోజులపాటు ఎన్నికల ప్రచారం కొనసాగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.