AP MLAs disqualification: ఏపీలో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Elections) విజయం దక్కించుకున్నవారిలో ఎనిమిది మందిపై అనర్హత వేటు వేస్తూ.. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం(Speaker Tammineni Seetaram) నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రాత్రి చాలా పొద్దుపోయాక తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా సంచలనం సృష్టించింది. అధికార పార్టీ వైఎస్సార్ సీపీ(YSRCP)కి చెందిన నలుగురు, టీడీపీ(TDP)కి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయడం గమనార్హం. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత.. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడం ఇదే తొలిసారి. సభకు ఆటంకం కలిగించారన్న ఉద్దేశంతో సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి.. తప్ప సభ్యులను అనర్హులను చేసిన సందర్భాలు మాత్రం లేవు.
ఇదే తొలిసారి!
పార్టీ ఏదైనా.. ఎమ్మెల్యే ఎవరైనా.. సభ నుంచి సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయే కానీ.. ఎప్పుడు అనర్హత వేటు వేయలేదు. గత చంద్రబాబు హయాంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రిగా ఉన్న ఆర్కే రోజాను ఏడాది పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. ఇక, ఈ స్థాయిలో ఎవరిపైనా వేటు పడలేదు. వైఎస్సార్ సీపీ హయాంలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసినా.. అది ఆ సెషన్ వరకు మాత్రమే పరిమితం చేశారు. తాజా నిర్ణయం ప్రకారం.. వైస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి(వెంకటగిరి నియోజకవర్గం), కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(నెల్లూరు రూరల్), ఉండవల్లి శ్రీదేవి(తాడికొండ ఎస్సీ నియోజకవర్గం), మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి(ఉదయగిరి నియోజకవర్గం)లపై అనర్హత వేటు వేశారు.
1988లో చేసిన సవరణ
ఇక, టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీకి మద్దతుగా మారిన వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిలకు కూడా అనర్హత వర్తిస్తుందని స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు. దీంతో వారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? లేదా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో తెరమీదికి వచ్చాయి. వాస్తవాని కి రాజ్యాంగంలోని షెడ్యూల్ 10లో చేర్చిన అంశం ప్రకారం.. అనర్హత వేటు వేసిన ఎమ్మెల్యే కనీసం 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలి. ఇది 1988లో రాజ్యాంగాన్ని సవరిస్తూ.. అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హయాంలో పేర్కొన్న నియమం. తద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలు జాగ్రత్తగా ఉంటారని.. పార్టీలు మారకుండా ఉంటారని... ప్రజల తరఫున నిలబడతారని.. భావించారు.
సుప్రీం తీర్పుతో..
అయితే.. ఈ అనర్హత వేటు ప్రక్రియ తర్వాత కాలంలో భ్రష్టు పట్టింది. తమకు నచ్చని ఎమ్మెల్యేలపై వేటు వేయడం.. ఎంపీలను ప్రలోభ పెట్టి అధికార పార్టీవైపు మళ్లించుకోవడం వంటివాటితోపాటు తమ మాట వినని ఎమ్మెల్యేలపై కక్ష తీర్చుకోవడం అనే కాన్సెప్టు తెరమీదికి వచ్చింది. ఇలా.. మహారాష్ట్ర, కర్ణాటకలలో తొలిసారి ఇది వివాదం కావడంతో సుప్రీంకోర్టు సంచలన తీర్పుఇచ్చింది. ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించినా.. ఆ అసెంబ్లీ కాలానికి మాత్రమే పరిమితం అవుతుందని.. తదుపరి కాలానికి కాదని పేర్కొంది. గత ఏడాది ప్రారంభంలో మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో 17 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆరు సంవత్సరాల పాటు వేసిన వేటును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. అంటే.. తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఇచ్చిన ప్రొసీడింగ్స్ ప్రకారం.. ప్రస్తుతం డిస్‌క్వాలిఫై అయిన.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొచ్చునని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.