BJP ByElection Plan :   తెలంగాణలో బీజేపీ పక్కా ప్రణాళికతో రాజకీయ అడుగులు వేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పరిస్థితి అనిశ్చితంగా ఉంది. టీఆర్ఎస్ సర్కార్‌పై వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. కానీ పలు సర్వేల్లో ఆ పార్టీకి మెరుగైన స్థానం లభిస్తోంది. అదే సమయంలో టీఆర్ఎస్ వ్యతిరేకత అటు బీజేపీకి కానీ ఇటు కాంగ్రెస్‌కు కానీ ఉపయోగపడుతోందని ఎవరూ చెప్పడం లేదు. ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. గాలి తమ వైపే ఉందని నిరూపించడానికి బీజేపీ ఇప్పుడు ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఉపఎన్నికల్లో గెలవడం ద్వారా వచ్చే ఊపుతో అసెంబ్లీ ఎన్నికల్లో ఊడ్చేయవచ్చని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 


మునుగోడుకు ఉపఎన్నిక కోసం ప్రణాళికలు !


ఉపఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఊపు ఎలాంటిదో రాజకీయాల్లో ఉండేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గాలి మొత్తం తమ వైపే ఉంటుందని అనుకుంటారు. ఉపఎన్నికలు సాధారణంగా అధికార పార్టీకి అనుకూలంగా జరుగుతూ ఉంటాయి. అధికార పార్టీ ఓడిపోతే తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లే లెక్క. ఈ ప్రకారం తెలంగాణలో ప్రభుత్వంపై వ్యతిరేకతను బీజేపీ బట్టబయలు చేయాలని ఆ వ్యతిరేకత తమకే లాభిస్తుందని నిరూపించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆకర్ష్ ప్రయోగించి ఉపఎన్నికలకు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 


ఉపఎన్నిక వస్తే ఖర్చు ఎక్కువ - పదవీ కాలం తక్కువ ! 


తెలంగాణలో వచ్చే ఏడాది అక్టోబర్‌లో అసెంబ్లీ సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అంటే గట్టిగా పదిహేను నెలల సమయం కూడా లేదు. ఇప్పుడు రాజీనామా చేయడం వల్ల రాజకీయ ప్రయోజనం తప్ప.. మరేమీ ఉపయోగం ఉండదు.  సాధారణంగా ఆరు నెలల కంటే పదవీ కాలం తక్కువ ఉంటే.. ఉపఎన్నిక పెట్టరు. ఆ ప్రకారం ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తే నిబంధనల ప్రకారం ఆరు నెలల్లో ఉపఎన్నిక నిర్వహించాలి ఆ తర్వాత పదవి కాలం మరో ఆరేడు నెలలు మాత్రమే ఉంటుంది. అయితే బీజేపీ అనుకుంటే ఉపఎన్నికలు నిర్వహిణ ఖాయమే. అయితే  టీఆర్ఎస్‌ను ఎదుర్కోవాలంటే కోమటిరెడ్డి ఇప్పుడు ఎంత ఖర్చుపెట్టాలో అంచనా వేయడం కష్టం. అలా తాను కష్టపడి ఖర్చు పెట్టి గెలిచినా తనకు వచ్చే లాభం స్వల్పమే. మళ్లీ ఎమ్మెల్యే అవుతారు. కానీ మళ్లీ ఆరు నెలలు.. లేదా ఏడాదిలో మళ్లీ అదే స్థాయిలో ఖర్చు పెట్టుకుని మళ్లీ ఎన్నికల్లో పోటీ పడాలి. 


ఉపఎన్నికను అడ్డుకునే అవకాశం టీఆర్ఎస్‌కూ ఉంది ! 


ఉపఎన్నిక అనేది బీజేపీ వ్యూహం కాబట్టి…  టీఆర్ఎస్ బీజేపీ రాజకీయ వ్యూహంలో ఇరుక్కుంటుదా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై స్పీకర్ ఎంత కాలం అయినా సాగదీయడానికి చాన్స్ ఉంది. అది స్పీకర్ అధికారం. ఏపీలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తే ఇంత వరకూ స్పీకర్ ఆమోదించలేదు. ఆయన పలుమార్లు కలిసినా స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకోలేదు.   తమ కుర్చీ కిందకు నీళ్లు తెచ్చేందుకే రాజీనామా చేస్తున్నారని అనిపిస్తే.. టీఆర్ఎస్ రాజీనామాను ఆమోదించకుడా జాగ్రత్తలు తీసుకోవచ్చు.  


ఉపఎన్నిక విషయంలో బీజేపీ, టీఆర్ఎస్‌కు సమాన వ్యూహం పాటించడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఉపఎన్నిక విషయంలో వీరిద్దరూ సవాళ్లకు సై అంటారా? లేకపోతే రాజకీయ వేడి రాజేసి ఊరుకుంటారా? అనేది వేచి చూడాల్సి ఉంది.