KTR Sensational Tweet On CM Revanth Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR).. సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 'బాబూ చిట్టి.. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుతో ఢిల్లీలో మార్కులు పడ్డాయిగా.. ఇక గాంధీ ఆస్పత్రిలో చనిపోతున్న పిల్లలు, ఆడబిడ్డల మీద దృష్టి పెట్టు.' అంటూ పేర్కొన్నారు. కాగా, ఇటీవల సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం సైతం చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన స్థానంలో కేవలం రాజకీయ దురుద్దేశంతోనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీశారని.. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. అలాగే, ఆశ పడి ఓట్లేసిన ఆడబిడ్డలను మోసం చేయడం.. నమ్మించి వంచన చేయడమే కాంగ్రెస్ నైజమని మండిపడ్డారు. గ్యాస్ రాయితీ.. ఉత్త గ్యాస్ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నీరుగారిపోతున్న గ్యారెంటీలని.. గంగలో కలిసిన హామీలను ట్విట్టర్‌లో పేర్కొన్నారు.










రైతుల అరెస్ట్ దారుణం


మరోవైపు, రుణమాఫీ కోసం పోరాడుతోన్న రైతులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని.. ఇది దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఛలో ప్రజాభవన్‌కు పిలుపునిచ్చిన వారి అరెస్టును ఖండిస్తున్నామని అన్నారు. రైతులు, సంఘాల నేతలను పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం దారుణమని చెప్పారు. ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసినందునే ఆందోళన చేస్తున్నారని.. అన్నదాతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం నుంచి పలుచోట్ల అన్నదాతల ఇళ్లకు వెళ్లివారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతుందన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఆపాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రైతులంటే ఎందుకంత భయం అని ప్రశ్నించారు.










Also Read: Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో కీలక ప్రకటన- తమ ఎక్స్‌ హ్యాండిల్‌లో లింక్స్ క్లిక్ చేయొద్దని సూచన