Sabitha Indrareddy Comments: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసెంబ్లీలో మాజీ సీఎం కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని.. ఎంతసేపూ అదే పనిలా కాకుండా సమర్థ పాలనపై దృష్టి సారించాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) సూచించారు. తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. సభలో సీఎం తీరు చూస్తుంటే కేసీఆర్‌ను తిట్టేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. 'కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా పాలన, ఇందిరమ్మ పాలన అని ఊదర గొడుతున్నారు. మహిళలకు ఇచ్చిన హామీలే ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాయి. అలాంటి ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలు భయంతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఇదే విషయాన్ని అసెంబ్లీలో నేను ప్రస్తావించా. మాకు మైక్ ఇవ్వడానికే సీఎం భయపడుతున్నారు. మేము నాలుగున్నర గంటలు నిల్చున్నా మాకు మైక్ ఇవ్వలేదు. ఆడబిడ్డలు నిలబడితే వాళ్లు ఆనందిస్తున్నారు.' అంటూ సబిత ఆవేదన వ్యక్తం చేశారు.
'పార్టీ మారటమే నేరమా.?'
తాము ఇప్పటివరకూ ఎంతో మంది సీఎంలను చూశామని.. వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ మహిళలకు సభలో ఎంతో గౌరవం ఇచ్చారని మాజీ మంత్రులు సబిత, సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. వారు మహిళలు ఇన్ని గంటల తరబడి సభలో నిలబడితే స్పందించేవారని.. కానీ ప్రస్తుతం అలా జరగడం లేదని మండిపడ్డారు. 'స్పీకర్ కూడా మా వినతిని పట్టించుకోలేదు. సభలో 9 మంది మహిళా సభ్యులున్నా మాట్లాడే అవకాశమే రావట్లేదు. ఎస్సీ వర్గీకరణపై మాట్లాడదామనుకుంటే మైక్ ఇవ్వలేదు. బీఆర్ అంబేడ్కర్ దళితుల గురించే కాదు మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం గురించీ కూడా చెప్పారు. దాన్ని కనీసం పాటించలేదు. డిప్యూటీ సీఎం భట్టి సీఎల్పీ పదవి మా వల్ల పోయిందని అంటున్నారు. పార్టీ మారటం పెద్ద నేరమైతే.. అసెంబ్లీలో ఇప్పుడున్న వాళ్లలో ఎంతమంది పార్టీలు మారలేదు.?. సభలో లేని ఎమ్మెల్సీ కవిత పేరు సీఎం తీసుకోవడం ఎంతవరకు కరెక్టు. .ఆడబిడ్డలను అవమానించడమే సీఎంకు నిత్యకృత్యంగా మారింది. ఆ పదవికున్న గౌరవాన్ని రేవంత్ కాపాడుకుంటే మంచిది. రాహుల్ గాంధీ రేవంత్‌ను నమ్ముకున్నారు. ఆయన బతుకు సికింద్రాబాద్ స్టేషన్ చేస్తారా.? మహిళలపై అత్యాచారాల గురించి రేపు సభలో లేవనెత్తుతాం. మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. మాకు అండగా నిలిచిన మహిళ లోకానికి, బీఆర్ఎస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.' అని సబిత పేర్కొన్నారు.
అటు, శాసనసభలో తమకు జరిగిన అవమానం బాధాకరమని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. 'రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి. నా ప్రచారానికి వస్తే కేసులు నమోదయ్యాయని సీఎం రేవంత్ అంటున్నారు. ఆయన ప్రసంగాల వల్ల నా మీదనే మూడు కేసులు నమోదయ్యాయి. సీఎం సమాచారం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. మాకు మద్దతు ఇచ్చిన అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎస్సీ వర్గీకరణ కు మేము వ్యతిరేకం అన్నట్టు గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిగజారి మాట్లాడారు. శుక్రవారమైనా స్పీకర్ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి.' అని సునీత డిమాండ్ చేశారు.