Harish Rao Challange To Minister Komatireddy: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) తనపై చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అమెరికా వెళ్లి విశ్రాంత ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావును కలిసినట్లు మంత్రి నిరూపిస్తే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయడానికి సిద్ధమని అన్నారు. అలా రుజువు చేయలేకుంటే మంత్రి కోమటిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి అదే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలని సవాల్ విసిరారు. మంత్రి డేట్ అండ్ టైం చెప్పాలని.. తాను పాస్ పోర్ట్ వివరాలతో సహా చర్చకు వస్తానని స్పష్టం చేశారు. 'సీఎం, మంత్రులు అబద్ధాలతో ప్రభుత్వాలు నడుపుతున్నారని చెప్పడానికి ఆ ఆరోపణ ఓ ఉదాహరణ. నేను కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లింది వాస్తవం. కానీ, అమెరికా వెళ్లి ప్రభాకరరావును కలిసినట్లు మంత్రి మాట్లాడారు. ఏ దేశం వెళ్లాను, ఏ హోటల్‌లో ఉన్నాను.. వంటి వివరాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా పాస్ పోర్ట్‌తో పాటు ఇతర వివరాలు తీసుకుని బహిరంగ చర్చకు వస్తాను. పాస్ పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ ఇన్ అండ్ అవుట్ వివరాలు ఉంటాయి. కనీసం జ్ఞానం లేకుండా పబ్లిసిటీ కోసం కోమటిరెడ్డి మాట్లాడడం చౌకబారుతనం' అని హరీష్ రావు అన్నారు.
మంత్రి ఏమన్నారంటే.?
కాగా, మాజీ మంత్రి హరీష్ రావు.. దొంగచాటుగా అమెరికా వెళ్లి వచ్చారని ఆదివారం మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకరరావు అమెరికాలో ఉన్నాడని.. ఆయన్ను కలవడానికే అమెరికా వెళ్లారని అన్నారు. ప్రభాకరరావును ఇండియా రాకుండా ఆపేందుకు కేసీఆర్ పంపించారని.. ప్రభాకరరావు అప్రూవర్‌గా మారితే ఇబ్బందిగా మారుతుందని కేసీఆర్ భయపడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన హరీష్ రావు.. నిరూపించాలని సవాల్ విసిరారు.
Also Read: KCR: 'అధికారం లేకున్నా ప్రజల కోసం పని చేయాలి' - గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసమన్న కేసీఆర్