గులాబీ శిబిరంలో ఆపరేషన్ మరాఠా ఆకర్ష్‌ కంటిన్యూ అవుతోంది! ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నీ తానై నడిపిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చింది మొదలు జీవన్‌ రెడ్డి మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలపై ఫోకస్ చేశారు. అక్కడి ప్రజలను, మాజీ ఎమ్మెల్యేలను, చోటామోటా నాయకులను తెలంగాణ బాట పట్టించడంలో తలమునకలై ఉన్నారు. ఇప్పటికే నాందేడ్‌ నుంచి ఇబ్బడిముబ్బడిగా నాయకులు వచ్చి గులాబీ గూటికి చేరారు.


తాజాగా ఔరంగబాద్ జిల్లాలో సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఏ చేరిక చూసినా పక్కనే జీవన్ రెడ్డి ఉంటున్నారు. ఏ ఫోటో చూసినా జీవన్ రెడ్డే కనిపిస్తున్నారు. అంతేకాదు మరాఠా నేల మీద ఇప్పటి వరకు జరిపిన సభలన్నీ సింహభాగం జీవన్ రెడ్డే ఎగ్జిక్యూట్ చేశారని పార్టీ నాయకులు చెబుతున్నారు. తాజాగా ఈనెల 24న జబిందా మైదానంలో జరగబోయే సభా ఏర్పాట్లను కూడా జీవన్‌రెడ్డే చూసుకుంటున్నారు.   


ఈ సభను పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న  బీఆర్ఎస్ లో చేరేందుకు వివిధ పార్టీల నేతలు  క్యూ కడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఔరంగబాద్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రచారరథాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి యువతను ప్రగతి భవన్‌ గుమ్మం ఎక్కించడంలో జీవన్ రెడ్డి సక్సెస్ అవుతున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. కేసీఆర్ నాయకత్వం వైపు మొగ్గు చూపి పార్టీలో చేరుతున్నారని ఆశన్నగారి జీవన్ రెడ్డి అంటున్నారు. ఆయన సమక్షంలో నిత్యం భారీ చేరికల పరంపర జోరుగా సాగుతోంది.


శుక్రవారం మహారాష్ట్ర లోని ఛత్రపతి శంబాజీనగర్ (ఔరంగబాద్) లో జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో  రాష్ట్రవాది పశ్చిమ షెహర్ ఉపాధ్యక్షుడు షేక్ అబ్రార్, షేక్ ఫైజాన్, షేక్ ఇమ్రాన్,షేక్ అద్నాన్, రమేష్ పాటిల్, రాజ్ గైక్వాడ్, ఆకాష్ గైక్వాడ్ తదితరులు ఉన్నారు.


వీరందరికి  జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరో కార్యక్రమంలో ఛత్రపతి శంబాజీనగర్ (ఔరంగబాద్) జిల్లా కు చెందిన  వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ గూటికి చేరిన వారిలో మాలుంజా గ్రామ సర్పంచు జగదీశ్ సోలంకె , అబేద్ పటేల్, మన్సూర్ పటేల్, అనీఫ్, రాజారాం మాండే, అన్సారీలతో పాటు పలువురు ఆటో యూనియన్ సభ్యులు ఉన్నారు. వీరందరికీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.


ఇదిలా ఉంటే రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా పట్టణ అధ్యక్షుడు వీర్ దేవరాజ్, వంచిత్ బహుజన్ అగాడి జిల్లా అధ్యక్షుడు అజయ్ మస్కి, ఔరంగాబాద్ పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బన్సీలాల్ కుచే, పర్బని గ్రామ పంచాయతీ సర్పంచ్ గజానంద్, స్థానిక నాయకుడు సచిన్ సాత్ దివే, స్థానిక ఆటో యూనియన్ నాయకుడు యువరాజ్ తదితరులను జీవన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. 24వ తేదీన జరిగే బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కాగా ఈ నెల 24వ తేదీన జబిందా మైదానంలో జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను జీవన్ రెడ్డి పరిశీలించారు.