ఆంధ్రప్రదేశ్‌లో బ్రదర్‌ అనిల్ భేటీలు కాక రేపుతున్నాయి. మొన్న ఉండవల్లితో బ్రదర్ భేటీ, అసంతృప్త వర్గాలతో ఇవాళ సమావేశం. అసలేం జరుగుతోందన్న చర్చ తీవ్రంగా నడుస్తోంది. 


పార్టీ ఖాయమా!


జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పార్టీ ఖాయమంటున్నారు విశ్లేషకులు. బ్రదర్‌ అనిల్‌ వరుస భేటీలు సన్నాహక సమావేశాలుగా చెబుతున్నారు. మొన్న ఉండవల్లితో భేటీ అయినప్పుడే చాలా మంది అనుమానించారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నేతలతో సమావేశం కావడం పార్టీ ఏర్పాటును ధ్రువీకరిస్తున్నారు. 


అబ్బే అలాంటిదేమీ లేదన్న అనిల్


కొత్త పార్టీ ఏర్పాటు ప్రచారంపై బ్రదర్ అనిల్ మాత్రం ఖండిస్తున్నారు. అలాంటిదైమేనా ఉంటే తానే మీడియా ముందుకు వచ్చి చెబుతానంటున్నారు. ఇలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని వేడుకుంటున్నారు. జగన్‌ను గెలిపించిన కొన్ని వర్గాలు ఆవేదనతో ఉన్నాయని.. వారి సమస్యలు పట్టించుకున్న వారే లేకుండాపోయారని విమర్శలు అందుకున్నారు. వాళ్లతో సమావేశమై సమస్యలు తెలుసుకున్నానంటూ మీడియాకు వివరణ ఇచ్చారు. అంతే తప్ప పార్టీపై ఎలాంటి చర్చలు సాగలేదన్నారు. 


ప్రభుత్వంపై విమర్శలు


ప్రైవేట్ ప్రాంతంలో జరిగిన ఈ భేటీలో చాలా అంశాలు ప్రస్తావనకు వచ్చాయంటున్నారు ఆ భేటీలో పాల్గొన్న నేతలు. ముఖ్యంగా బీసీ నేత సొంటి నాగరాజు చాలా సమాచారాన్ని మీడియాతో పంచుకున్నారు. జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారాయన. అనిల్ చెప్పినట్టు గత ఎన్నికల్లో మూకుమ్మడిగా వైఎస్‌ఆర్‌సీపీకి ఓట్లు వేశామన్నారాయన. గెలిచిన తర్వాత తమ సమస్యల పరిష్కారంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే జగన్ అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదన్నారు. అందుకే బ్రదర్ అనిల్‌ వద్ద తమ గోడు వెల్లబోసుకున్నట్టు చెప్పుకొచ్చారు. 


త్వరలోనే ప్రకటన


తమకు కొత్త ప్రభుత్వం కావాలని బ్రదర్ అనిల్‌తో చెప్పినట్టు సమావేశంలో పాల్గొన్న నేతలు చెబుతున్నారు. దీనికి స్పందించిన అనిల్ త్వరలోనే దీనిపై శుభవార్త వింటారంటూ చెప్పుకొచ్చారట. అన్నింటికీ సొల్యూషన్ చూపిస్తామన్నారని పేర్కొన్నారు. త్వరలోనే అది సాకరమవుతుందని భరోసార ఇచ్చినట్టు తెలిపారు. 


రాజకీయ అజెండాతోనే ఉండవల్లితో భేటీ  


ఫిబ్రవరి 25 ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో బ్రదర్ అనిల్ సమావేశమయ్యారు. రాజమండ్రిలోని ఆయన నివాసంలో ఈ సమావేశం జరిగింది. దాదాపుగా గంట పాటు రాష్ట్ర రాజకీయాలపై చర్చించినట్టు సన్నిహత వర్గాలు తెలిపాయి. 
రాజకీయాలు డైనమిక్‌గా మారుతున్న సమయంలో అప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌తో భేటీ ఇప్పుడు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న వర్గాలతో భేటీ ఆసక్తి రేపుతోంది. 


బ్రదర్ అనిల్ భేటీ అవుతున్న వారంతా జగన్‌ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న వారే. ఇప్పుడు బీసీ నేతలు కూడా బ్రదర్ అనిల్‌తో భేటీ అనంతరం సీఎం జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఏ వర్గానికి చేసిందేమీ లేదని దుమ్మెత్తి పోశారు.  


త్వరలో అన్ని విషయాలు చెబుతానని బ్రదర్ అనిల్ అప్పుడే చెప్పారు. ఇప్పుడు మాత్రం పార్టీపై ప్రచారాన్ని ఖండించారు. ఆయన చెప్పకపోయినా ఆయనతో సమావేశమైన వాళ్లంతా చెప్తున్నది ఒక్కటే. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పార్టీ ఖాయమంటూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే ఎప్పుడు వస్తుందన్నది ఒక్కటే ఇంకా తేలాల్సి ఉంది. 


షర్మిలా పార్టీ విస్తరణా? కొత్త పార్టీయా?


ఆంధ్రప్రదేశ్‌లో పెట్టబోయే పార్టీ షర్మిల పార్టీ విస్తరణలా ఉంటుందా. లేకుంటా కొత్త పార్టీ వస్తుందా అన్నదానిపై ఇప్పుడు చర్చ సాగుతోంది. అయితే ఇవాళ నేతలతో జరిగిన భేటీలో షర్మిల పార్టీ ప్రస్తావన ఎక్కడా బ్రదర్ అనిల్ తీసుకురాలేదని.. సమస్యలపైనే దృష్టి పెట్టారంటున్నారు నేతలు.