దేశవ్యాప్తంగా బీజేపీ బలం క్రమంగా తగ్గుతోందన్నారు రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్. దేశంలోని అనేక ప్రాంతాల్లో కమలం పార్టీ రాజకీయ బలం క్షీణిస్తోందన్నారు. కొన్ని రాష్ట్రాల్లోనే అధికారంలో ఉందన్న విషయాన్ని బీజేపీ గుర్తించాలన్నారు. ఎన్సీపీ ఆఫీస్‌ బేరర్ల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకునే పార్టీలతో దేశ ప్రజలు మద్దతుగా నిలవడం లేదని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉందన్నారు.  ఓ సారి దేశ మ్యాప్‌ను పరిశీలిస్తే, దక్షిణాదిలో ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ది చెబుతారని శరద్ పవార్ అన్నారు.


అధికార దుర్వినియోగం
రాజస్థాన్‌, పంజాబ్‌, ఢిల్లీ, హిమాచల్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదన్న ఆయన,  ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు మరో రెండు, మూడు రాష్ట్రాల్లో తప్ప దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కమలం పార్టీ ప్రాభవం తగ్గుతోందన్నారు. మహారాష్ట్రలో శివసేనను చీల్చి  అధికారంలోకి వచ్చింది. గోవాతోపాటు 2020 వరకు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లోనూ ఇటువంటి ఫార్ములానే కాషాయ పార్టీ అమలు చేసింది. ఎన్నికల తర్వాత ఈ విషయం మరింత స్పష్టంగా తెలుస్తుందన్నారు.  2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలో మహా వికాస్ అఘాడి ఏర్పాటులో శరద్ పవార్ కీలకపాత్ర పోషించారు. కూటమి ఎంతో కాలం కొనసాగలేకపోయింది. శరద్ పవర్ అన్నయ్య కొడుకు అజిత్ పవార్ బీజేపీతో జట్టుకట్టారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 


బీజేపీపై పోరాటం చేద్దాం
బీజేపీ బలం క్షీణించడానికి అధికార దుర్వినియోగమే కారణమన్నారు శరద్ పవార్. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయన్నారు. సామాన్యుడి సాధికారత దిశగా  ఆ పార్టీ నిర్ణయాలు తీసుకోవడం లేదని విమర్శించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పార్టీకి ప్రజలంతా వ్యతిరేకంగా పోరాటం చేయాలని శరద్ పవార్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో వేలాది మంది బాలికలు, మహిళలు అదృశ్యమయ్యారన్న శరద్ పవార్, ఢిల్లీలో జర్నలిస్టులపైనా, రాజకీయ ప్రత్యర్థులపైనా పోలీసులను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని, ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యమత్యంగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న వారి నుంచి లాక్కొని సామాన్యులకు అప్పగిస్తామన్నారు. 


కేజ్రీవాల్ ను వేధింపులు తప్పడం లేదు
తమ స్వలాభం కోసం అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న బీజేపీని వ్యతిరేకించాలని నిర్ణయించుకున్నామని శరద్ పవార్ తెలిపారు.  24కు పైగా ప్రతిపక్షాలను కలిగి ఉన్న ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ కూటమి గురించి ప్రస్తావించారు. I.N.D.I.A, ఇతర భావసారూప్యత ఉన్న పార్టీలతో కలిసి భవిష్యత్ లో పని చేస్తుందని స్పష్టం చేశారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మూడుసార్లు గెలిచిందన్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, కేజ్రీవాల్‌ను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. . ఆయన ఇంటిని మూడుసార్లు తనిఖీ చేశారని, అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేయడమే బీజేపీ ఫార్ములా అని శరద్ పవార్ విమర్శించారు. ఇలాంటి ఫార్ములాతో పార్టీ పనిచేస్తుంటే ఉమ్మడిగా వ్యతిరేకించాల్సి వస్తుందని అన్నారు.