Bc Leader Election Campaign In Dharmavaram: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ నెలకొంది. రాజకీయ పార్టీల నేతలు గెలుపే లక్ష్యంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరం (Dharmavaram) నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. పొత్తులో భాగంగా ఈసారి ఎన్డీయే కూటమి తరఫున బీజేపీ కీలక నేత సత్యకుమార్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన సత్యకుమార్ (Satyakumar) బీసీల మద్దతును కూడగట్టేందుకు విస్తృత చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి చెందిన ముదిగుబ్బ మండల అధ్యక్షులు ఆదినారాయణ యాదవ్ వైసీపీకి రాజీనామా చేసి సత్యకుమార్ కు మద్దతు ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నా అగ్రవర్ణాలకు చెందిన నేతలే దాదాపు 50 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఇన్నేళ్లుగా టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీల తరఫున అగ్ర నేతలే పోటీ చేస్తూ విజయం సాధిస్తూ వస్తున్నారు. తొలిసారిగా ఎన్డీయే కూటమి తరఫున సత్య కుమార్ యాదవ్ కు పోటీ చేసి అవకాశం వచ్చింది.


అదే చర్చ 


మొదట్లో బీజేపీ కూటమి అభ్యర్థిగా సత్యకుమార్ అని ప్రకటించడంతో  వైసీపీ తరఫున పోటీ చేస్తున్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విజయం సులువని అంతా భావించారు. అనంతరం మారుతున్న సమీకరణాలతో పరిస్థితిలో మార్పు వచ్చింది. సత్యకుమార్ యాదవ్ కు మొదట్లో స్థానికంగా గట్టి మద్దతు లభించలేదు. అనంతరం బీసీ అభ్యర్థి అయిన ఆయనకు మద్దతు ఇస్తే తొలిసారిగా బీసీ అభ్యర్థిని గెలిపించుకున్నవారము అవుతామని చేనేత వర్గాల్లోకి ఆయన వర్గీయులు బలంగా తీసుకెళ్తున్నారు. ఇది సత్ఫలితాన్నివ్వొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ధర్మవరం పట్టణంలో దాదాపు 80 వేల ఓటర్లు కలిగిన చేనేతలతో పాటు బోయ, బలిజ, ఏకుల, కురుబ సామాజిక వర్గాలు సంపూర్ణ మద్దతు కూడగడితే సత్యకుమార్ విజయానికి దోహదపడతాయని చర్చ సాగుతోంది.


తనదైన మార్క్ తో ప్రచారం 


తనకు మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ.. ప్రత్యర్థి పార్టీ నాయకులతో ఏ ఇబ్బంది వచ్చినా క్షేత్రస్థాయిలో పోరాడుతానని సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేస్తున్నారు. ఆయన ఇస్తున్న బలమైన భరోసాతో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి వ్యతిరేక వర్గీయులు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. తనకు మద్దతిస్తున్న బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు నాయకులందరికీ ఎన్నికల తరువాత కూడా అండగా నిలుస్తానని సత్య కుమార్ హామీ ఇస్తుండడంతో ఆయన వెంట నడవడానికి సిద్ధమవుతున్నారు. సత్యకుమార్ కు జాతీయ స్థాయిలో మంచి పలుకుబడి ఉంది. సౌమ్యుడిగా పేరున్న ఆయన.. దాదాపు 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా ఎవరిపైన వ్యక్తిగత విమర్శలు చేసిన దాఖలాలు లేవు. ధర్మవరం చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే సత్య కుమార్ లాంటి నాయకుడు అవసరమని పరిశ్రమ అభివృద్ధిలో కీలక భూమిక వహించే దేశవ్యాప్తంగా చీరలను ఎగుమతి చేసే చేనేత రంగ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.


ఇప్పటికే కూటమి అభ్యర్థిగా సత్యకుమార్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆయనకు తన మద్దతు ప్రకటిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. మరోవైపు, ధర్మవరం టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గోల్డ్ సూర్యనారాయణ ఇప్పటివరకు తన నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో కొంత అయోమయ పరిస్థితి నెలకొంది. పరిటాల శ్రీరామ్ లాగే మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల కూడా సత్యకుమార్ కు మద్దతిస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Also Read: Pawan Kalyan: సీఎంపై రాయి దాడికి బాధ్యత వారిదే, ముందు ఆ నలుగురిని విచారణ చేయాలి - పవన్ కల్యాణ్