Telangana BJP Leadership Vacuum Bengal Formula:   తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్‌కు అధికారమిచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో ఎదుర్కొంటున్న సవాళ్లు, అంతర్గత విభేదాలు, పరిపాలనాపరమైన ఇబ్బందులతో ప్రజల్లో కొంత అసంతృప్తి మొదలవుతోంది. ఇటు బిఆర్‌ఎస్ ప్రాభవం కోల్పోతుండటం, అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుండటంతో.. కమలం పార్టీకి స్పష్టమైన పొలిటికల్ స్పేస్ లభించింది. కానీ,  ఈ సువర్ణ అవకాశాన్ని ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో తెలంగాణ బీజేపీ తీవ్రంగా తడబడుతోంది .

Continues below advertisement

ఒక్క చాన్స్ కోసం ఎందుకు అడగలేకపోతున్నారు? 

మీరు కేసీఆర్ పదేళ్ల పాలన చూశారు, కాంగ్రెస్ మార్పు పాలననూ చూస్తున్నారు.. ఒక్కసారి కమలానికి అవకాశం ఇవ్వండి అనే బలమైన నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ విఫలమవుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో 8 ఎంపీ స్థానాలు గెలుచుకుని సత్తా చాటినప్పటికీ, ఆ ఉత్సాహాన్ని రాష్ట్ర స్థాయి అధికారం దిశగా మళ్లించే సమిష్టి వ్యూహం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. కేవలం ఢిల్లీ పెద్దల ఇమేజ్, మోదీ చరిష్మాపైనే ఆధారపడటం తప్ప.. స్థానిక నాయకత్వం ప్రజల్లో బలమైన విశ్వాసాన్ని నింపలేకపోతోంది. కేవలం ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఎత్తిచూపడం మాత్రమే సరిపోదు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే  ప్రణాళికను దాన్ని నడిపించే ఒక  ఫేస్ ను చూపిస్తేనే ప్రజలు జాతీయ పార్టీలకు ప్రాంతీయ స్థాయిలో ఓటేస్తారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. 

Continues below advertisement

నడిపించే నాయకుడు ఎవరు?

తెలంగాణ బీజేపీకి ఉన్న ప్రధాన లోపం..  స్పష్టమైన  సీఎం ఫేస్  లేదా తిరుగులేని ఒకరిద్దరు బలమైన నాయకులు లేకపోవడం . గతంలో బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అగ్రెసివ్ హిందూత్వ, నిరసనలతో కేడర్‌లో పీక్ లెవెల్ జోష్ ఉండేది. ఆ తర్వాత జి. కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ వంటి అగ్రనేతలు ఉన్నప్పటికీ.. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయనే భావన ప్రజల్లోకి వెళ్తోంది. నాయకుల మధ్య సమన్వయ లోపం వల్ల అధికార కాంగ్రెస్‌పై లేదా ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఒక్కటిగా దాడి చేయలేకపోతున్నారు.

బెంగాల్ తరహా పోరాట వ్యూహం ఎలా? 

పశ్చిమ బెంగాల్‌లోని  దీదీ కోటను బద్దలు కొట్టడానికి బీజేపీ ఎలాగైతే అగ్రెసివ్ కేడర్ పాలిటిక్స్ చేసిందో, తెలంగాణలోనూ అలాంటి  బెంగాల్ తరహా పోరాట వ్యూహం అవసరమనేది పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం. అక్కడ కమలం పార్టీ ప్రతీ పంచాయతీ, ప్రతీ వార్డు స్థాయి వరకు వెళ్లి కేడర్‌ను నిర్మించి, అధికార పార్టీ దాష్టీకాలను ధైర్యంగా ఎదుర్కొంది. కానీ తెలంగాణలో ప్రెస్ మీట్లు, కరపత్రాల పంపిణీ, ఢిల్లీ పర్యటనలకే పరిమితమవుతున్నారు తప్ప.. ప్రజల తరఫున సుదీర్ఘకాలం పాటు రోడ్డెక్కి పోరాడే పాదయాత్రలు, ధర్నాలు కరువయ్యాయి.  బీజేపీ పై సామాన్య ప్రజల్లో ఉన్న మరో అనుమానం.. బీఆర్‌ఎస్ - బీజేపీ ఒకటేనా?  అనే పాత ప్రచారం. ఈ నెగెటివ్ ఇంప్రెషన్‌ను పూర్తిస్థాయిలో తుడిచిపెట్టేలా బీజేపీ గ్రౌండ్ లెవెల్‌లో నమ్మకాన్ని కలిగించలేకపోయింది.

పూర్తిగా మారితేనే బీజేపీకి మలుపు 

 తెలంగాణలో బీజేపీకి అధికారం దక్కాలంటే తక్షణమే కొన్ని విప్లవాత్మక మార్పులు అవసరం. పార్టీలోని గ్రూపు తత్వాలకు స్వస్తి చెప్పి, ఒక సమర్థవంతమైన, మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడిని ముందు పెట్టి నడిపించాలి. ప్రజల నిత్య జీవిత సమస్యలైన రుణమాఫీ, ఉపాధి, రైతు భరోసా, మౌలిక వసతులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ నిరంతరం ప్రజల్లో ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలి. ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్లీ కోలుకోవడం తెలంగాణ బీజేపీకి సాధ్యం కాకపోవచ్చు.