తెలంగాణ సీఎం కేసీఆర్‌పై భారతీయ జనతాపార్టీ నేతలు మండి పడుతున్నారు. ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో భారత ఆర్మీని కించపరిచేలా మాట్లాడారని విమర్శిస్తున్నారు. పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్ జరిగినట్లుగా ఆధారాలు అడుగుతున్న రాహుల్ గాంధీ అంశంపై స్పందిస్తూ అందులో తప్పేమి ఉందన్నారు. రాహుల్ లాగే తాను కూడా కేంద్రాన్ని అదే డిమాండ్ చేస్తున్నానని... సర్జికల్ స్ట్రయిక్స్‌కు ఆధారాలు చూపాలని అడుగుతున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామని మోడీ చక్రవర్తి కాదన్నారు. అయితే ఈ మాటలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. భారత ఆర్మీని కేసీఆర్ కించ పరుస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. అభినందన్ వర్థమాన్ సాక్ష్యం కాదా అని ప్రశ్నించారు. ఈ మేరకు సుదీర్గమైన ట్వీట్ చేశారు.
సర్జికల్ స్ట్రైక్స్ మీద తనకు కూడా అనుమానాలున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర సహాయ మంత్రి వి మురళీధరన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. సర్జికల్ స్ట్రైక్ ను ప్రశ్నిస్తే ఆపరేషన్‌లో పాల్గొన్న మన వీర జవాన్లను అవమానించడమేనని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా అ సోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సైనికులను అవమానిస్తున్నారు. మన సైన్యంపై దాడి చేసి దుష్ప్రచారం చేయడానికి మీరు ఎందుకు తహతహలాడుతున్నారుని ప్రశ్నించారు. అసలు ఈ అంశంపై రాహుల్ గాంధీని అనుచితంగా విమర్శించి వివాదాలకు ఎక్కింది అసోం ముఖ్యమంత్రే . ఆయనను తొలగించాని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీ నేతల విమర్శలపై టీఆర్ఎస్ మండిపడింది. బీజేపీ నాయకులకు మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప వేరొకటి తెలియదని తలసాని విమర్శించారు. ఆర్మీ ని కూడా రాజకీయనికి అడ్డం పెడుతారన్నారు. హిందుస్తాన్, పాకిస్తాన్ జీవిత కాలం ఇదే నినాదం బీజేపీదని విమర్శించారు. కిషన్ రెడ్డి ఒళ్ళు దగ్గరపెట్టుకోవాలని.. హైదరాబాద్ లో తిరగనివ్వమని హెచ్చరించారు.