AP BJP Satyakumar : దేశవ్యాప్తంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్రలు చేస్తోందన్న కారణంగా కేంద్రం నిషేధం విధించింది. అయితే ఏపీలోని అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ కూడా ఆ పీఎఫ్‌ఐ లాంటి విధ్వంసకర పార్టీనే అని బీజేపీ సీనియర్ నేత సత్యకుమార్ ఆరోపించారు. పీఎఫ్ఐ లాంటి ప్రమాదకర పార్టీ వైఎస్ఆర్‌సీపీ అని ఆరోపించారు. ఓ ఉగ్రవాద సంస్తతో వైఎస్ఆర్‌సీపీని అదీ కూడా బీజేపీ జాతీయ స్థాయి నేత పోల్చడం చర్చనీయాంశమవుతోంది. వైఎస్ఆర్‌సీపీ, పీఎఫ్ఐ రెండింటివీ విధ్వంసకర ఆలోచనలేనని సత్యకుమార్ చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేయాలని ఇస్తున్న గరీబ్ కల్యాణ్ యోచన పథకం బియ్యాన్ని ఏపీ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు.
వైసీపీ విధ్వంసకర పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న సత్యకుమార్
ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసకర పాలన చేస్తున్న వైఎస్ఆర్‌సీపీని ప్రజలు చీత్కరించుకుంటున్నారని చెబుతున్నారు. గడప గడపకూ వెళ్తున్న అధికార పార్టీ నాయకుల్ని ప్రజలు నిలదీస్తున్నారని.. ప్రజా వ్యతిరేకత ఈ స్థాయిలో ఎందుకు ఉందో జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలన సత్యకుమార్ సలహా ఇచ్చారు. గృహ నిర్మాణంపై సీఎం ఎన్నిసార్లు సమీక్షించినా పురోగతి లేదని.. రాష్ట్రంలో 10 శాతం కంటే ఎక్కువ ఇళ్లు నిర్మించలేదని విమర్శించారు. విశాఖలో సీఎం ఇళ్లు కడితే విశాఖ అభివృద్ధి అవుతుందా అని ప్రశ్నించారు.
పీకే సర్వే ప్రకారం పులివెందులలో జగన్‌కు గడ్డు పరిస్థితి ఉందన్న సత్యకుమార్
ఏపీలో రాజకీయ పరిస్థితిపై సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో జగన్‌కు 51 శాతం మాత్రమే మద్దతు ఉందని చెప్పారు. ఈ గణాంకాలు తాము చెబుతున్నది కాదని ... వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ప్రశాంత్ కిశోర్ బృందం చేయించిన సర్వేలోనే ఈ విషయం తేలిందన్నారు. తన సొంత నియోజకవర్గంలోనే సీఎం జగన్ బొటాబొటీ మెజారిటీ పెట్టుకుని రాష్ట్రంలోని మొత్తం 175 సీట్లలో గెలవాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలను గడపగడపకు వెళ్లమని చెబుతున్న జగన్... తాను మాత్రం తన సొంత నియోజకవర్గంలో ఎందుకు తిరగడం లేదని సత్యకుమార్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల మాదిరే జగన్ కూడా తన నియోజకవర్గంలో పర్యటించాలని ఆయన డిమాండ్ చేశారు.
గతంలో పీఎఫ్ఐ సంస్థకు వైసీపీ నేతలు సాయం చేశారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపణ
పీఎఫ్ఐ సంస్థకు వైఎస్ఆర్‌సీపీకి చెందిన డిప్యూటీ సీఎం ఆంజాద్ భాషాతో పాటు పలువురు నేతలు సహకరిస్తున్నారని గతంలో ఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి ఆరోపించారు. పీఎఫ్ఐకి చెందిన వారిపై గత ప్రభుత్నాలు కేసులు నమోదు చేస్తే ఈ ప్రభుత్వం వాటిని ఎత్తి వేసిందన్నారు. ఇప్పుడు మరో ఏపీ బీజేపీ కీలక నేత వైఎస్ఆర్‌సీపీని పీఎఫ్ఐతో పోల్చి విమర్సలు చేయడం కలకలం రేపుతోంది. అయితే... ఏపీ బీజేపీ నేతలు ఎలాంటి విమర్శలు చేసినా వైఎస్ఆర్‌సీపీ పెద్దగా పట్టించుకోవడం లేదు.
హరీష్ రావు ఆ గ్యాంగ్‌తో జత కట్టారంటున్న సజ్జల - ఆ గ్యాంగ్ ఎవరు ? ఆ కథేంటి ?