Telangana BJP: పశ్చిమ బెంగాల్ ప్లాన్ వర్కౌట్ అవ్వడం, అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఫోకస్ ఇప్పుడు తెలంగాణపై పడింది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నా సరే రెండేళ్ల తర్వాత వచ్చే తెలంగాణ ఎన్నికలపై వ్యూహాలు రచిస్తోంది కమల దళం. ఇప్పటి నుంచే గ్రౌండ్‌ను ప్రిపేర్ చేస్తోంది. అందుకే ఈ మధ్య కాలంలో ఢిల్లీ పెద్దలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. లీడర్‌లను కేడర్‌ను సన్నద్ధం చేస్తున్నారు. బయట పార్టీ నుంచి భారీగా చేరికలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
తెలంగాణలో అధికారంలోకి రావడానికి నౌ ఆర్ నెవర్ అనే రీతిలో బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణపై కాషాయదళం ఎంత ఫోకస్డ్‌గా ఉందో అర్థమవుతోంది. మేలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొన్ని రోజుల గ్యాప్ ఇచ్చి జూన్‌లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటించారు. మూడురోజుల పాటు ఇక్కడే ఉంటూ లీడర్లకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎలా సన్నద్ధంగా ఉండాలో కూడా తెలియజేశారు.
తాజాగా కేంద్రమంత్రి జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించారు. ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కీలక నేతలతో సమావేమయ్యారు. ఎన్నికలకు సన్నద్ధం కావాలని, విభేదాలు లేకుండా పార్టీ విజయం కోసం ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. అంతేకాకుండా ఆయన మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఆ కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి.
చాలా మంది ఇతర పార్టీల నేతలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, వారి కోసం డోర్లు ఓపెన్ చేయాలని నడ్డా లీడర్లకు సూచించారు. ఇప్పటికే పార్టీ ప్రజల్లో బలంగా ఉందని ఇతర పార్టీల నుంచి వచ్చే వారితో అధికారం దిశగా సాగుతుందని చెప్పుకొచ్చారు. అందుకే ఇప్పుడు పార్టీలో ఉన్న కీలక నేతలంతా విభేదాలను పక్కన పెట్టి పార్టీ విజయం కోసం పని చేయాలని హితవుపలికారు. సమన్వయంతో ముందుకెళ్తేనే పార్టీకి మేలు జరుగుతుందని అన్నారు.
కొత్తవారు వచ్చిన తర్వాత వారిని కూడా సమన్వయం చేసుకొని నిత్యం ప్రజలు ఉండాలని నడ్డా సూచించారు. కష్టపడే వారికే గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఎప్పటికప్పుడు ఇక్కడి విషయాలను ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా తెలుసుకుంటున్నారని అన్నారు. కచ్చితంగా న్యాయం చేస్తారని అన్నారు. ప్రజలు, కార్యకర్తలతో కలిసి ఉంటనే నేతలకు విజయం వరిస్తుందని లేకుంటే డిస్‌కనెక్ట్ అవుతారని హెచ్చరించారు.
పార్టీ నేతలకు చిన్న క్లాస్ తీసుకున్న నడ్డా, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. పదేళ్లు న్యాయం జరగలేదని కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అ పార్టీ మరింత ముంచేసిందని ఆరోపించారు. అందుకే ఆ రెండు పార్టీల నుంచి భారీ సంఖ్యలో నేతలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
ఇప్పుడు మరికొందరు మంత్రులు, కీలక నేతలు వారనికో పదిహేను రోజులకో ఒకసారి తెలంగాణను టచ్ చేసి వెళ్తారని సమాచారం. ఇప్పుడు బీజేపీలో ఉన్న నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడటం లేదు. ముందు వారిని ఒక దారిలో పెట్టి తర్వాత డోర్స్ తెరవాలని బీజేపీ చూస్తోంది. అందుకే ఢిల్లీ నుంచి నేతలు వచ్చి లీడర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. అయినా వారంతా ఏకదాటిపైకి వచ్చేందుకు ససేమిరా అంటున్నారు.
