Andhra Pradesh BJP :  కేంద్ర మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ ఎంపీలు కాకుండా బీజేపీ తరపున ఎన్నికైన భూతపతిరాజు శ్రీనివాస వర్మకు చోటు దక్కడం సంచలనంగా మారింది.  ఏపీ నుంచి బీజేపీ తరపున ముగ్గురు ఎంపీలు గెలిచారు. ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభిస్తుంది. ప్రాధాన్యతల క్రమంలో చూసుకుంటే మొదటి పేరు పురందేశ్వరి… తర్వాత సీఎం రమేష్.. ఆ తర్వాత శ్రీనివాసవర్మ ఉంటారు. కానీ బీజేపీ హైకమాండ్ మాత్రం  శ్రీనివాసవర్మకే కేంద్ర మంత్రి పదవి ప్రకటించింది. ఆయన సహాయ మంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. ఆయనకు  కేంద్ర పెద్దలు ప్రాధాన్యమివ్వడం వెనుక కీలక సందేశం ఉందని అంచనా వేస్తున్నారు. 


బీజేపీకి కింది స్థాయి నుంచి పని చేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని సంకేతాలు 


బీజేపీలో కింది  స్థాయి నుంచి పని చేసే వారికి ప్రాధాన్యం ఉంటుందని వారిని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటామన్న సందేశాన్ని శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రి పదవి కేటాయించడం ద్వారా హైకమాండ్ పంపిందని అంటున్నారు.  ఏపీలో పొత్తుల్లో టిక్కెట్ల కేటాయింపు తర్వాతా అన్నీ ఒక్క గ్రూపుకే ప్రాధాన్యం లభించిందన్న ఆరోపణలు వచ్చాయి. మొదటి నుంచి పార్టీలోనే ఉన్న సీనియర్లను పక్కన పెట్టారని .. వారికి ఒక్క చోట కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వలేదన్న విమర్శలు వచ్చాయి. సీనియర్ నేతలు కొంత మంది ఈ అంశంపై హైకమాండ్‌కు కూడా లేఖ రాశారు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ కోసం పని చేసే వారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందన్న ఆందోళన కూడా కనిపించింది. 


టిక్కెట్ల కేటాయింపు సమయంలో న్యాయం చేయలేకపోయిన  హైకమాండ్        


అయితే పొత్తులు, ఇతర కారణాల వల్ల బీజేపీ హైకమాండ్ టిక్కెట్ల కేటాయింపులో న్యాయం చేయలేకపోయింది. అప్పటికీ నర్సాపురం సీటు కోసం రఘురామకృష్ణరాజు కోసం ఇతర పార్టీలు తీవ్రంగా ఒత్తిడి చేసిన వెనక్కి తగ్గలేదు. మొదటి నుంచి పార్టీలోనే ఉన్న భూపతిరాజు శ్రీనివాసవర్మకే కేటాయించారు. మార్పు చేయాలని వచ్చిన ఒత్తిళ్లను అంగీకరించలేదు. ఆయననూ మారిస్తే ఇక పేరుకే బీజేపీ పోటీ అని.. కిందిస్థాయి నుంచి బీజేపీలో పని చేస్తూ వచ్చిన వారు ఎవరికీ చాన్స్ రాలేదన్న అభిప్రాయం పెరుగుతుందని వెనక్కు తగ్గారు. 





 


భవిష్యత్ లో సీనియర్లకే ప్రాధాన్యం -  వర్మ పదవి ఇచ్చే సందేశం ఇదే !    


ఇప్పుడు కేంద్ర మంత్రి పదవి కూడా ఆయనకే  ఇవ్వడంతో పార్టీలో వలస నేతలకు మాత్రమే ప్రాధాన్యనం అనే ముద్రను చెరిపేయడానికి.. కిందిస్థాయి నుంచి పని చేసే కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి శ్రీనివాసవర్మకు చాన్సిచ్చారని చెబుతున్నారు. ఆయనకు పదవి ఖరారు కాగానే సోము వీర్రాజుతో సంతోషం పంచుకునున్నారు. ఎన్నికల్లో పోటీ కోసం గట్టిగా ప్రయత్నించిన విష్ణువర్ధన్ రెడ్డి కూడా కొత్త కేంద్రమంత్రిని అభినందించారు. బీజేపీలో  వార్డు మెంబర్ నుంచి కేంద్ర మంత్రిగా అయిపోవచ్చని వర్మ నిరూపించారు.ఆ భరోసా వర్మకు పదవి ఇవ్వడం ద్వారా పార్టీనే నమ్ముకున్న సీనియర్లకు, క్యాడర్ కు పంపింది. సీనియర్లకు మంచి భవిష్యత్ ఉంటుందన్న సంకేతాలను వర్మకు పదవి ద్వారాపంపారని అనుకోవచ్చు.