Atamkur Nomainations :  నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. తొలిరోజు పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ తరపున గోదా రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఆత్మకూరు ఉప ఎన్నికల సందర్భంగా కనీసం అధికార పార్టీ తమతో సంప్రదించలేదని, పోటీ చేయొద్దని కానీ, ఏకగ్రీవానికి సహకరించాలని కానీ కోరలేదని అందుకే తాము పోటీ చేస్తున్నామని అభ్యర్థి రమేష్ ప్రకటించారు. నవతరం పార్టీ తరపున ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఉప ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా జిల్లా జాయింట్ కలెక్టర్ హరేందిర ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు తొలి రోజు నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. 


మరో వైపు బీజేపీ  నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు సంబంధించి "ఎన్నికల కమిటీని" ప్రకటించింది. ఎమ్మెల్సీ  వాకాటి నారాయణరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, జిల్లా బిజెపి అధ్యక్షుడు  భరత్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి  కమల, పార్టీ సీనియర్ నేత కందుకూరి సత్యనారాయణల ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు. అభ్యర్థిని ఎంపిక చేయడం ప్రచార వ్యూహాలు అన్నీ  ఈ కమటీ చూసుకుంటుంది. తాము ఖచ్చితంగా పోటీ చేస్తామని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. బలమైన అభ్యర్థి కోసం వెదుకుతోంది. 


జనసేన పార్టీ ఇంత వరకూ తమ స్టాండ్ ఏమిటో చెప్పలేదు. బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు మాట్లాడుకుని ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలో నిర్ణయం తీసుకుంటాయి. కానీ బీజేపీ జనసేనతో చర్చించకుండానే తాము పోటీ చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు జనసేన కూడా పోటీ చేయాలనుకుంటుందో లేక బీజేపీకి మద్దతిస్తుందో స్పష్టత లేదు. బద్వేలు సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు ... కుటంబసభ్యులకే టిక్కెట్ ఇవ్వడంతో తాము పోటీ చేయబోవడం లేదని జనసేన అధినేత ప్రకటించారు. ఇక్కడ కూడా మేకపాటి కుటుంబమే పోటీ చేస్తున్నందున జనసేన పోటీ చేసే చాన్స్ లేదని తెలుస్తోంది. 


మరో వైపు తెలుగుదేశం పార్టీ కూడా మేకపాటి కుటుంబమే పోటీ చేస్తున్నందున తాము పోటీ చేయదల్చుకోలేదని ఇప్పటికే ప్రకటించింది. ఆత్మకూరు విషయంలో ఆ పార్టీ ఎలాంటి కార్యచరణను ఇంకా ఖరారు చేసుకోలేదు. అంటే పోటీ చేయనట్లే లెక్క. ఏకగ్రీవం కోసం మేకపాటి కుటుంబీకులు కూడా ఎవరూ ప్రయత్నించడం లేదు. ప్రధాన పార్టీలు పోటీ వద్దనుకుంటూండటంతో మిగిలిన వారు పోటీలో ఉన్నా సమస్య లేదని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.