BJP Reaction : భారతీయ జనతా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ వెంటనే చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయ సంచలనం అయింది. మిగతా విషయాలేమో కానీ బీజేపీలో కూడా ఈ అంశంపై చర్చ జరిగింది. అయితే ఈ భేటీలో పెద్దగా విశేషం ఏమీ లేదన్న అభిప్రాయానికి బీజేపీ వచ్చింది. చంద్రబాబు - పవన్ కల్యాణ్ భేటీని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. విశాఖలోపవన్ కల్యాణ్ పర్యటన విషయంలో జరిగిన పరిణామాల విషయంలో.. సంఘిభావం తెలిపేందుకు నిన్న సోమువీర్రాజు కూడా పవన్‌ను కలిశారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. ఇవాళ చంద్రబాబును పవన్ అలానే కలిశారని బీజేపీ, పవన్ విడిపోవాలనుకునేవారే హైప్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
జనసేనకు అండగా నలిచిన బీజేపీ
జనసేన అధినేత పవన్ ను ఒంటరిని చేయాలనే కుట్రను బిజెపి ఖండించి జనసేన కు అండ గానిలిచిందని విష్ణువర్దన్ రెడ్డి స్పష్టం చేశారు. జనసేన కు అండగా సోమూవీర్రాజు నిలబడ్డారు .. రాష్ట్ర ప్రజలు బిజెపి, జనసేనకు మద్ధతివ్వాలని కోరారు. వైసిపి గత మూడు రోజులుగా దుర్మార్గమైన రాజకీయాలకు పాల్పడిందన్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రులకు గాయాలైతే గాయపడిన మంత్రుల హెల్త్ బులిటెన్ విడుదల చేయాలి కదా అని ప్రశ్నించారు. మీడియా ముఖంగా మంత్రులు తిడుతున్నారు కదా. ఎందుకీ డ్రామా అని మండిపడ్డారు. వైసిపి మంత్రులు, అధికారులు జనసేన ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీయలేదు. బిజెపి వారికి అండగా ఉంటుందన్నారు.
తప్పుడు కేసులు పెడితే భయపడబోమన్న బీజేపీ
తప్పుడు కేసులు పెట్టి పార్టీని భయబ్రాంతులకు గురి చేస్తే భయపడతామా ...ప్రజా ఉద్యమాలను నిర్మూలిస్తామనేది పిచ్చి నిర్ణయం అవుతుందన్నారు. బిజెపి జనసేన కలిసి ఉద్యమాలు చేపడుతుందని ప్రకటించారు. తప్పుడు కేసులపై ఎపి ప్రభుత్వం వివరణ ఇవ్వాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. జనసేన కార్యకర్తల పై అక్రమంగా పెట్టిన కేసులపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలన్నారు. వైసిపి మంత్రులు ఎపి రాజకీయాల్లో కామెడీగా మారిపోయారు .. జోగి రమేష్, రోజా, అంబటి కామెడీ కే కేరాఫ్ గా మారిపోయారన్నారు. బఫూన్లు, కామెడీ ఆర్టిస్ట్ ల్లా మారొద్దు ..వైసిపి ప్రజాప్రతినిధులు తీరు మార్చుకోకపోతే ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
జనసేనతో కలిసి ప్రజాపోరాటాలు చేస్తామన్న విష్ణు
బీజేపీ విషయంలో పవన్ కల్యాణ్ కాస్తంత అసంతృప్తి వ్యక్తం చేసినా.. ఏపీ బీజేపీ నేతలు మాత్రం పవన్ విషయంలో పాజిటివ్‌గానే మాట్లాడుతున్నారు. బీజేపీతో కటీఫ్‌ను జనసే్న ప్రకటించకపోవడమే దీనికి కారణం అనుకోవచ్చు. అదే సమయంలో అటు టీడీపీ, జనసేన పొత్తుల గురించి మాట్లాడలేదు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై కలిసి పోరాడటానికి రావాలని పిలుపునిచ్చాయి. ఎన్నికల్లో పోటీ గురించి ఎన్నికలప్పుడు నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి. దీంతో మిత్రుడికి మద్దతుగానే ఉండాలని ఏపీ బీజేపీ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే టీడీపీ, జనసేనతో కలిసి ప్రభుత్వంపై పోరాడుతుందో లేదో మాత్రం స్పష్టత లేదు.