Bihar Election Result 2025: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. సీట్ల సంఖ్య ఇప్పుడే స్పష్టం కాకున్నా, భారీ మెజారిటీతోనే జేడీయూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారం చేజిక్కించుకుంది. అయితే మహాకూటమికి ఈ ఎన్నికల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ పార్టీలకు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పించాయి. భవిష్యత్తులో వీటిని విస్మరిస్తే ఏ పార్టీకైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఇప్పుడు బిహార్‌లో మహాకూటమికి ఎదురైన పరిస్థితే వారికి రానుంది.
1. అమలు చేయగలిగే వాగ్దానాలు చేయాలి..
ఓటర్లు ఇకపై పెద్ద, ఆకర్షణీయమైన నినాదాలకు ఓటు వేయరని రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలి. వారికి వాస్తవికమైన, అమలు చేయగలిగే వాగ్దానాలు కావాలి. నేతల నుంచి విశ్వసనీయత కోరుకుంటున్నారు. మహాకూటమి నాయకుడు తేజస్వి యాదవ్ 'ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం', 'మహిళలకు సంవత్సరానికి 30 వేల రూపాయలు' ఇస్తానని చేసిన వాగ్దానం అమలుకాదని రాష్ట్ర ఓటర్లు గుర్తించారు. ఈ వాగ్దానాలు అమలు సాధ్యం కానివి. ఈ వాగ్దానాలకు అయ్యే ఖర్చు బిహార్ బడ్జెట్‌తో సమానమని ప్రజలు గుర్తించారు.
2. సంస్థలపై దాడులు కాదు, ప్రజల సమస్యలపై ఫోకస్
రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధమైన, ఎన్నికలు నిర్వహించే సంస్థ అయిన ఈసీపై పదేపదే ప్రశ్నలు సంధించకూడదు. ఎన్నికల ప్రక్రియపై ఆరోపణలు చేయడం ప్రజలలో నమ్మకాన్ని పెంచడానికి బదులుగా ప్రతికూలతను కలిగిస్తుంది. మహాకూటమి నేతలు ఎన్నికల సమయంలో ప్రజల సమస్యలపై దృష్టిపెట్టడానికి బదులుగా ఈసీపై ఆరోపణలు చేశారు. కనుక విద్య, ఆరోగ్యం, ఉపాధి, మౌలిక సదుపాయాలు వంటి ప్రజా ప్రయోజన సమస్యలపై దృష్టి సారించే పార్టీలకు ప్రాధాన్యత ఇస్తామని బిహార్ ప్రజలు స్పష్టం చేశారు.
3. ఓటింగ్ కంటే ముందు ఎన్నికల బహుమతులు పంచడం వల్ల ప్రయోజనం!
ఎన్నికలకు ముందు ప్రజలను ఆకట్టుకునే పెద్ద ప్రకటనలు లేదా ఎన్నికల బహుమతులు (ఉచిత సౌకర్యాలు) ప్రకటించడం ఓట్లు రాబట్టేందుకు దోహదం చేస్తాయని నిరూపించాయి. ఈ ప్రకటనలు తరచుగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలకు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి ఉపశమనం కలిగిస్తాయి. దాంతో ఓటర్లు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. ఇది దీర్ఘకాలిక అభివృద్ధికి సరైనది కాకపోయినా, తమకు ఎంతో కొంత మేలు జరుగుతుందని ప్రజలు భావించడంతో ప్రయోజనం పొందవచ్చు.
4. మహిళల సమస్యలపై దృష్టి
బిహార్ ఎన్నికలు, అంతకుముందు జరిగిన ఎన్నికలలో ఒక ముఖ్యమైన సామాజిక మార్పు కనిపిస్తోంది. మహిళలు ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఓట్లు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఇది ఒక నిర్ణయాత్మకమైన సైలెంట్ ఓటింగ్ గా మారింది. ఈ ఎన్నికల్లో దాదాపు 71 శాతం మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాంతో రాజకీయ పార్టీలు మహిళల భద్రత, సాధికారత, మహిళల సమస్యలపై ఫోకస్ చేయాలి. మహిళల ప్రయోజనాలను కాపాడటంలో ఎవరు ముందుంటారో, ఆ పార్టీ విజయం సాధిస్తుంది. వారికి గొప్ప విజయం లభిస్తుంది.
5. కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం కావాలి
బిహార్ ఓటర్లు రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే రాజకీయ పార్టీ లేదా కూటమి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో వేర్వేరు పార్టీల ప్రభుత్వాలు ఉంటే వివాదాస్పద పరిస్థితులు ఏర్పడతాయి. రాష్ట్ర అభివృద్ధి పనులకు అవాంఛిత అడ్డంకులు ఏర్పడతాయని ప్రజలు భావించారు. అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ పాలసీకి మొగ్గు చూపారు. అప్పుడే రాష్ట్రానికి నిధులు వచ్చి, స్థిరంగా పాలన సాగుతుందని చూపించారు.