బిహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి దూసుకెళ్తోంది. జేడీయూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మొదట సెంచరీ మార్క్ దాటింది. తరువాత 150 మార్కును దాటి ప్రస్తుతం 168 స్థానాల్లో ముందంజలో ఉంది. మహాకూటమికి గట్టిపోటీ ఇవ్వడమే కాదు, మరోసారి అధికారం తమదే అని ఎర్లీ ట్రెండ్స్ చెబుతున్నాయి. బిహార్‌లో అధికారంలో ఉన్న ఎన్డీఏ మెజారిటీ మార్కును దాటి నిలకడ ప్రదర్శిస్తోంది. మొత్తం 243 సీట్లు ఉన్న బిహార్‌ అసెంబ్లీలో ఎన్డీఏ 168 సీట్లలో ముందంజలో ఉంది, దాంతో తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాకూటమి 70 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 3 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. బిహార్ రాజకీయాల్లో నితీష్ కుమార్ సంచలనానికి తెరలేపారు. ప్రతిసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు అయ్యేవి. కానీ ఈసారి బిహార్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు దాదాపుగా నిజమయ్యాయి.

Continues below advertisement

జేడీయూ చెప్పింది- "మళ్ళీ వస్తోంది నితీష్ సర్కార్"

ఎర్లీ ట్రెండ్స్ ఫలితాలు రాగానే జేడీయూ స్పందించింది. "బీహార్ సిద్ధంగా ఉంది, మళ్ళీ నితీష్ కుమార్ సర్కార్ వస్తోంది." అని జేడీయూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ జేడీయూ మరోసారి నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రిగా ప్రజెంట్ చేస్తుందని స్పష్టం చేసింది.

అయితే ఎన్డీఏ కూటమి నుంచి ఇప్పటివరకు సీఎం అభ్యర్థిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ జేడీయూ మాత్రం బిహార్ సీఎం అభ్యర్థి నితీష్ అని.. ఆయనే పగ్గాలు చేపడతారని నేతలు చెబుతున్నారు. ఫలితాల్లో మెరుగ్గా ఉండటం, రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి తీసుకురావడంతో నితీష్ నే కూటమి నేతలు సీఎంగా ఎన్నుకునే అవకాశాలున్నాయి.

ఎన్డీయే  జేడీయూ 101, బీజేపీ 101 స్థానాల్లో పోటీ చేయగా.. మిత్రపక్ష లోక్‌ జన్‌శక్తి (రాంవిలాస్‌) 28, హిందుస్థానీ అవామ్‌ మోర్చా (హెచ్‌ఏఎం) 06, రాష్ట్రీయ లోక్‌మోర్చా (RLM) 06 స్థానాల్లో పోటీ చేశాయి. మఢౌరాలో లోక్‌జన్‌శక్తి అభ్యర్థి సీమా సింగ్‌ నామినేషన్‌ను తిరస్కరించడంతో ఇండిపెండెంట్ క్యాండిడేట్ అంకిత్‌ కుమార్‌కు ఎన్డీయే సపోర్ట్ చేసింది. 

ఎన్డీఏ క్యాంప్‌లో సందడి, మహాకూటమిలో నిశ్శబ్దం

ఎన్డీఏ ఆధిక్యం ప్రదర్శించగానే బీజేపీ, జేడీయూ కార్యాలయాల్లో హడావుడి పెరిగింది. కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టేస్తున్నారు. అయితే అధికారిక ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు, మహాకూటమి శిబిరంలో నిరాశ కనిపిస్తుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని తేజస్వి యాదవ్ తన కార్యకర్తలను ఆదేశించారు.

మళ్ళీ నితీష్ చేతుల్లోకి అధికారం ?

ఎర్లీ ట్రెండ్ ఫలితాల కంటే ఎన్టీయే కూటమి సీట్లు ఆధిక్యం పెరుగుతున్నాయి తప్పా తగ్గడం లేదు. దాంతో బిహార్ లో ఎన్టీయే కూటమి విజయం దాదాపు కన్ఫామ్ అయింది. పూర్తి ఫలితాలు వచ్చాక మెజారిటీ ఎంత అనే దానిపై స్పష్టత రానుంది. రాజకీయ ఒడిదుడుకులు ఎదురైనా, నితీష్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేతలు సైతం నితీష్ కు మద్దతు తెలిపి కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని జేడీయే నేతలు ధీమాగా ఉన్నారు.