దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జరిగిన పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ పేలుడులో 12 మంది మరణించగా, ప్రాథమిక దర్యాప్తులో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన డాక్టర్ ఉమర్ ఈ దాడికి సూత్రధారి అని తేలింది. దర్యాప్తు సంస్థల ప్రకారం, అతను చాలా కాలం ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నాడు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుడు తర్వాత ఏజెన్సీలు నిరంతరం తనిఖీలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో పుల్వామాలోని ఉగ్రవాది ఉమర్ ఇంటిని ఐఈడీతో కూల్చివేశారు.
ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు తర్వాత దర్యాప్తు సంస్థలు దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించాయి. ఈ పేలుడు వెనుక ఉగ్రవాది డాక్టర్ ఉమర్ హస్తం ఉందని దర్యాప్తులో తేలింది. అతని టీమ్ గత రెండేళ్లుగా ఈ దాడికి పథకం రచిస్తోందని తెలిసింది. పోలీసులు ఉమర్ కుటుంబ సభ్యులపై కూడా చర్యలు తీసుకుని, అతని సోదరుడు, తల్లిని అదుపులోకి తీసుకున్నారని తెలిసిందే.
దర్యాప్తు సమయంలో ఉమర్ తల్లి ఏమన్నారు?
Delhi Blase Case దర్యాప్తు సమయంలో ఉమర్ తల్లి తన కుమారుడు తీవ్రవాద భావాలకు ఆకర్షితుడయ్యాడని తనకు ముందే తెలుసని చెప్పారు. చాలా రోజుల నుంచి అతనితో ఎలాంటి సంబంధం లేదు. పేలుడుకు కొంతకాలం ముందు ఉమర్ ఫోన్ చేయవద్దని తన కుటుంబానికి చెప్పాడు. అయితే, ఉమర్ అనుమానాస్పద కార్యకలాపాల గురించి కుటుంబం పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అని విచారణలో గుర్తించారు.
పుల్వామాకు చెందినవాడు ఉమర్
ఢిల్లీ పేలుడులో పుల్వామాకు చెందిన ఉమర్ మాస్టర్ మైండ్ అని దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ పేలుడులో ఉమర్ కూడా మరణించాడని దర్యాప్తు సంస్థలు ధృవీకరించాయి. వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఉమర్, జైషే మహ్మద్ ఉగ్ర సంస్థలతో సంబంధం కలిగి ఉన్నాడు. పేలుడుకు ముందే పోలీసులు ఉమర్ ముఠాలోని పలువురు సభ్యులను అరెస్టు చేశారు. వారి నుండి 2900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో దాడులకు ఈ గ్రూప్ ప్లాన్ చేసింది. ముఖ్యంగా దీపావళి, రిపబ్లిక్ డే ఈవెంట్లను వాళ్లు దాడులకు ముఖ్యమైన తేదీలుగా భావించారు. అయితే చివరి నిమిషంలో దీపావళి సమయంలో పేలుళ్లు, దాడుల ప్లాన్ ను ఉపసంహరించుకున్నారని దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది.