కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా వారసులు ( Bhuma Family ) మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ప్రజల్లోకి వస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో ఇంత కాలం లో ప్రోఫైల్ రాజకీయం చేస్తున్న వీరు ఇప్పుడు ప్రజా పోరాటాలకు సిద్దమయ్యారు. భూమా శోభ, భూమా నాగిరెడ్డి కొంత కాలం వ్యవధిలోనే చనిపోవడంతో వారి రాజకీయ వారసత్వాన్ని అంది పుచ్చుకున్న అఖిలప్రియ ( Bhuma Akila priya ) మాతృత్వం కారణంగా కొంత కాలంగా రాజకీయాలపై దృష్టి పెట్టలేకపోయారు. ఇటీవల ఆమె మళ్లీ జనంలోకి వస్తున్నారు. ఆళ్లగడ్డలో రోడ్ల విస్తరణ పేరుతో టీడీపీకి చెందిన వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఇటీవలి కాలంలో భూమా వర్గీయులు ఆరోపిస్తున్నారు. భూమా నాగిరెడ్డి పేరుతో నిర్మించిన బస్ షెల్టర్‌ను కూడా కూల్చివేశారు. దీన్ని భూమా వర్గీయులు అడ్డుకున్నారు. ఇదే కారణంగా భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్ విఖ్యాత్ రెడ్డిపై కేసులు పెట్టారు. దీనిపై భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.
బస్ షెల్టర్ కూల్చివేతను ప్రశ్నించేందుకు వెళ్లిన తమ అనుచరులపై తమ్ముడుపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని భూమా అఖిలప్రియ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్పీ తమకు న్యాయం చేస్తారని అఖిలప్రియ ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా తమపై కక్ష సాధింపు తో తప్పుడు కేసులు పెట్టి, ఇబ్బందులకు గురిచేస్తున్నారని అఖిలప్రియ మండిపడ్డారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు ధోరణితోనే చేస్తున్నారని అఖిలప్రియ అన్నారు. 12వ తేదీన బస్ షెల్టర్‌ను కూల్చివేయడం జరిగింది. అదే రోజు తమపై తప్పుడు కేసులు పెట్టాలని, 13 వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. 14వ తేదీన సంబంధిత కాంట్రాక్టర్ కు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని అన్నారు. అసలు కాంట్రాక్టర్ కు ఎటువంటి వర్క్ ఆర్డర్ లేకపోయిన ఏలా బస్ షెల్టర్ కూల్చివేతను పాల్పడ్డారని ప్రశ్నించారు. తప్పుడు కే్సులపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు విఖ్యాత రెడ్డిలకు హైకోర్టులో ఊరట లభించింది.సీఆర్పీసీలోని సెక్షన్ 41 ఎ ప్రకారం విచారణ జరపాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది.
ఆళ్లగడ్డ ( Allagadda ) , నంద్యాల ( Nandyal ) నియోజకవర్గాలను టీడీపీ తరపున భూమా కుటుంబసభ్యులు చూసుకుంటున్నారు.గత ఎన్నికల్లో అటు అఖిలప్రియతో పాటు ఇటు భూమా బ్రహ్మానందరెడ్డి కూడా ఓడిపోవడం.. తర్వాత వరుసగా కేసులు నమోదు కావడంతో దూకుడుగా రాజకీయాలు చేయలేకపోతున్నారు. వ్యక్తిగత సమస్యలు కూడా తోడు కావడంతో చాలా వరకూ సైలెంట్‌గా ఉండిపోయారు. గతంలో యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా భూమా అఖిలప్రియ పోరాడారు. ఇప్పుడు భూమా కుటుంబం మళ్లీ పూర్తి స్థాయిలో రాజకీయాలు చేసే అకాశం కనిపిస్తోంది. ఎన్నికల వేడి ప్రారంభం కావడంతో వారు ప్రత్యర్థులపై ఎలాంటి వ్యూహాలతో విరుచుకుపడుతారోనన్న ఆక్తి కర్నూలు జిల్లా రాజకీయాల్లో ప్రారంభమయింది.