తెలంగాణ బీజేపీ ఇప్పుడు ఉత్సహంగా ఉంది. ట్రిపుల్ ఆర్‌లు ఎమ్మెల్యేగా సభలోకి అడుగు పెడుతున్నారని ప్రభుత్వం సంగతి చూస్తారని గతంలో బండి సంజయ్ హెచ్చరికలు చేసేవారు. ఇప్పుడా సందర్భం వచ్చేసింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలను ప్రస్తావించడంతోపాటు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం పట్టుపట్టాలని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం నిర్ణయించింది. అందులో భాగంగా డబుల్ బెడ్రూం ఇండ్లు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భ్రుతి, 317 జీవో, పోడు భూములు, యాసంగిలో ధాన్యం కొనుగోలు, పంట నష్టపరిహారం, కొత్త రేషన్ కార్డులు, ఆసరా ఫించన్లు, మద్యంతోపాటు విద్యావైద్య వ్యవస్థలోని లోపాలవల్ల ప్రజలపై పడుతున్న భారం వంటి అంశాలను అసెంబ్లీలో లేవనెత్తేందుకు సిద్ధమైంది. 


రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల కారణంగా తీవ్ర అసహనంతో ఉన్న టీఆర్ఎస్ పార్టీ బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు, ప్రతిపక్షాలను తన ట్రాప్ లోకి నెట్టేందుకు శతవిధాల ప్రయత్నించే అవకాశం ఉందని బండి సంజయ్ తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు.  టీఆర్ఎస్ ట్రాప్ లో పడకుండా ప్రజా సమస్యలపైనా, ఏడేళ్లలో టీఆర్ఎస్ వైఫల్యాలపైనా ప్రభుత్వాన్ని ఎండగట్టేలా ప్రణాళిక రూపొందించుకోవాలని బండి సంజయ్ సూచించారు. అసెంబ్లీ వేదికగా ప్రశ్నోత్తరాలు, షార్ట్ డిస్కషన్స్, జీరో అవర్ వంటి వాటిని ఉపయోగించుకుని ప్రజా సమస్యలపై గళమెత్తాలని కోరారు.  
  
సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం బీజేపీ పోరాడుతుందనేలా అసెంబ్లీలో వ్యవహరించాలని బండి సంజయ్ సూచించారు.  సీఎంసహా టీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు,  విద్యా రంగం దుస్థితి, యాసంగిలో ధాన్యం కొనుగోలు,  మద్యం దుష్ప్రభావాలు, దళిత బంధు, రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల పరిస్థతి, రెగ్యులరైజేషన్, ఫీల్డ్ అసిస్టెంట్లు, విద్యా వలంటీర్లు, స్టాఫ్ నర్సులు, స్కూల్ స్కావెంజర్స్ తొలగింపు వంటి అంశాలు సభలో చర్చకు వచ్చేలా చూడాలని సంజయ్ పార్టీ ఎమ్మెల్యేలను కోరారు. తెలంగాణపట్ల కేంద్రం వివక్ష చూపుతోందని, నిధులు కేటాయించడం లేదని అధికార పార్టీ  ప్రస్తావనకకు వస్తే కేంద్రం కేటాయించిన నిధులు, ఖర్చు చేసిన వివరాలతోపాటు ఇతర పథకాలను ఆయా నిధులను దారి మళ్లించిన అంశాలను ప్రస్తావిస్తూ అధికార పార్టీని నిలదీయాలని బండి సంజయ్ సూచించారు. 


అధికార పార్టీ సభ్యులు పదేపదే రెచ్చగొట్టి సైడ్ ట్రాక్ పట్టించాలని చూస్తారని.. ఈ విషయంలో మీరు మాత్రం టీఆర్ఎస్ ట్రాప్ లో పడకుండా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టానికే ప్రాధాన్యత ఇవ్వాలని బండి సంజయ్ కోరారు.  బీజేపీ గ్రాఫ్ పెరుగుతుండటంతో సీఎం కేసీఆర్ స్ట్రాటజిస్ట్ పీకే టీంతో కలిసి బీజేపీని బదనాం చేసే కుట్రలు చేస్తున్నారనే అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చింది.