తెలంగాణలోటీఆర్ఎస్ గూండాలు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నా పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. డీజీపీ కనీసం తన ఫోన్ కూడా ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా ఎస్పీ రబ్బర్ స్టాంపులా మారారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు జరుగుతున్నా ఎందుకు కేసులు నమోదు చేయడం లేదో డీజీపీ సమాధానం చెప్పాలని... లేనిపక్షంలో దద్దమ్మ అని ఒప్పుకోవాలన్నారు.  గురువారం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ఘటనలో అరెస్టై జైలుకు వెళ్లిన 23 మంది బీజేపీ కార్యకర్తలు విడుదలయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో వారిని బండి సంజయ్ ఘనంగా సన్మానించారు. 



 బీజేపీ కార్యకర్తలపై  సిరిసిల్ల జిల్లా లో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారు.  జైలు కి పంపిస్తే బీజేపీ కార్యకర్తలు భయపడతారని అనుకుంటున్నారని.. మళ్లీ చెబుతున్నా.... నాతో సహ ఏ బీజేపీ కార్యకర్త జైలు కి వెళ్లినా గల్లా ఎగురవేస్తాని  ప్రకటించారు. ఎందుకంటే కంటే మేం ప్రజల కోసం పోరాడుతున్నామన్నారు.  కానీ కేసీయార్ కూడా త్వరలో జైలు కి వెళ్తారు. అప్పుడు జనం కేసీఆర్ ను ఛీ కొట్టడం ఖాయమని స్పష్టం చేశారు.  సిరిసిల్ల ఎస్పీ ఓ రబ్బర్ స్టాంప్ ..,సీఎంవో ఏది చెబితే అది చేస్తాడన్నారు.  పోలీస్ ఆఫీసర్ ని విమర్శిస్తే కొంతమంది పోలీస్ సంఘాల సభ్యులు మాట్లాడుతున్నారని.. సిరిసిల్ల గొడవలో కొంతమంది  పోలీస్ లు సీఎం మోచేతి నీళ్లు తాగి వారికి అనుగుణంగా పని చేస్తున్నారని ఆరోపించారు. 
 


బీజేపీ కార్యకర్తలను కొట్టిన టిఆర్ఎస్ నాయకులపై చట్ట ప్రకారం కేసులు కూడా నమోదు చేయడం లేదు. పదేపదే మాట్లాడుతున్న కొందరు పోలీస్ సంఘాల నాయకులు ఈ విషయంలో ఏం సమాధానం చెబుతారు? ఇలాంటి అరాచకాలపై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.  ఇదే విధంగా వ్యవహరిస్తే.... రిటైర్ అయ్యాక మిమ్ముల్ని కుక్కలు కూడా పట్టించుకోవు ... చివరకు మీ పిల్లలే మిమ్మల్ని ప్రశ్నిస్తారని గుర్తుంచుకోవాలన్నారు.  ఇకనైనా అధికార పార్టీ మోచితి నీళ్లు తాగి పని చేయకండి. చట్టం, న్యాయం ప్రకారం పని చేయమని పోలీసులకు బండి సంజయ్ సూచించారు.  తక్షణమే డీజీపీ దీనిపై సమాధానం చెప్పాలన్నారు.  


 డీజీపీకి తాను ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తట్లేదు ... ట్యాపింగ్ జరుగుతోందని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.  ఎల్లారెడ్డి పేట ఘటన లో బీజేపీ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. బోధన్ లోనూ ఇట్లాగే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. బైంసాలోనూ దాడులు చేసి జైలుకు పంపారు.   కార్యకర్తలను పరామర్శించేందుకు వెళుతున్న బీజేపీ నాయకులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు ఒవైసికి మాత్రం బోదన్ లో ప్రశాంతంగా తిరిగేలా అనుమతిచ్చారు. ఇదెక్కడి న్యాయం ?అని బండి సంజయ్ ప్రశ్నించారు.