Mla Tellam Venkatrao Joined In Congress: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరారు. తాజాగా, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు (Tellan Venkatrao) బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో హస్తం గూటికి చేరారు. మంత్రి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వెంకట్రావుతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు. కాగా, గత కొద్ది రోజులుగా ఆయన కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారని.. పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా, ఆయన  సీఎం రేవంత్ రెడ్డిని కలవడం, కాంగ్రెస్ నేతలతో భేటీ కావడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. వాటన్నింటినీ నిజం చేస్తూనే.. తెల్లం వెంకట్రావు కారు దిగ హస్తం గూటికి చేరారు.  శనివారం తుక్కగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జన జాతర సభకు సైతం తెల్లం హాజరయ్యారు. 






అయితే, ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు దానం నాగేందర్, కడియం శ్రీహరి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. పలువురు కీలక నేతలు సైతం బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. కాగా, దానం, కడియంలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యపై గెలిచారు. కాగా, ఖమ్మం నుంచి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమని ఎన్నికలకు ముందు పొంగులేటి అన్నారు. ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో భద్రాచలం నియోజకవర్గం మినహా 9 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ కు ఉన్న ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరారు. దీంతో ఖమ్మం జిల్లా మొత్తం 'హస్త'గతం అయ్యింది. మరి తెల్లం వెంకట్రావు చేరికపై బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. అటు, ప్రభుత్వ మాజీ విప్ రేగా కాంతారావు తెల్లం వెంకట్రావు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేస్తున్నామని, ఒకవేళ ఆయన చర్యలు తీసుకోకుంటే న్యాయపరంగా ముందుకెళ్తామని అన్నారు.


Also Read: డిప్యూటీ సీఎం భట్టి కాన్వాయ్‌లోని కారును ఆపేసిన కమిషనర్ - పోలీసుల అత్యుత్సాహం!