Kinjarapu Atchannaidu: ప్రపంచంలో ఎవరిని అడిగిన చంద్రబాబు విజన్, దార్శనిక గురించి కొనియాడుతారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం విశాఖపట్నంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.. తెలుగు ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని, అలాంటి విజన్ ఉన్న నాయకుడిని స్కిల్ కేసులో ఇరికించి, దారుణంగా వేధిస్తున్నారని అన్నారు. నిన్న ఉదయం ఆరుగంటల సీఐడీ అధికారులు చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారని, ఆయన ఏమీ ఉగ్రవాది కాదని, పారిపోలేదని, ఎక్కడో దాక్కొని తప్పించుకున్న వ్యక్తి కాదన్నారు.
ప్రజాస్వామ్యంలో చీకటి రోజు
కేంద్రం ఇచ్చిన ఎన్ఎస్‌జీ భద్రత ఇచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అన్నారు. చంద్రబాబును రాజకీయ కుట్రలో భాగంగా కేసులో ఇరికించారని అన్నారు. రాజకీయ కక్షతోనే ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టడమే జగన్ పని అని విమర్శించారు. ప్రతిపక్ష నేతలను జైలులో పెట్టి సీఎం జగన్ రాక్షషానందం పొందుతున్నారని మండిపడ్డారు. జగన్ పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. స్కిల్ డెవెలప్ మెంట్ సెంటర్ల ద్వారా ఎంతో మంది యువత, మహిళలు శిక్షణ పొంది ఉద్యోగాలు పొందిన సంగతి జగన్‌కు తెలిదా అని ప్రశ్నించారు.
పోలీసులు తీరు చూస్తే బాధేస్తుంది
స్కిల్ డెవెలప్‌మెంట్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఒక ఊహాలోకాన్ని సృష్టించుకుని కేసులు పెట్టి చంద్రబాబును దారుణంగా అరెస్ట్ చేశారని అన్నారు. ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని, ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా చంద్రబాబు సహకారం అందించారని చెప్పారు. ఎవరు కష్టాల్లో ఉన్నా, ప్రపంచంలో ఏమూలన తెలుగువారు బాధపడుతున్నా మొదట స్పందించిన నాయకుడు చంద్రబాబు అని అన్నారు. నంద్యాల నుంచి 9 గంటల పాటు కారులో రోడ్డు మార్గంలో తీసుకొచ్చారని అన్నారు. ప్రజలు కోపం, బాధతో రోడ్డు మీదకు వస్తే పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారని విమర్శించారు. పోలీసుల తీరు చూస్తే చాలా ఆవేదన కలుగుతుందన్నారు.
వైసీపీ తొత్తుగా మారిన సీఐడీ
చంద్రబాబును విచారణ పేరుతో రెండు రోజుల పాటు తిప్పుతున్నారని, ఆయనకు విశ్రాంతి కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ కేసులో ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ అధికారి ఉండాల్సిన అవసరం ఏం ఉందన్నారు. ఆయన రెండు రోజుల పాటు ఏం విచారణ చేశారని ప్రశ్నించారు. సీఐడీ చీఫ్ చెప్పిన విషయాన్నే ఇన్వెస్టిగేషన్ అధికారి రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారని ఆరోపించారు. సీఐడీ జగన్ మోహన్ రెడ్డికి, వైసీపీ తొత్తుగా మారిందన్నారు. తప్పుడు కేసులు పెట్టి టీడీపీ అధినేతను వేధించేందుకు కథ అల్లారని అన్నారు. 2019 డిసెంబర్ 19వ తారీఖున కేసు పెట్టారని అన్నారు. ఎఫ్‌ఐఆర్‌తో చంద్రబాబు పేరుగాని, తన పేరుగాని లేవన్నారు.
వారి పేర్లు ఎందుకు లేవు
ఈ కేసులో చాలా మందిని అరెస్ట్ చేస్తే వారందరూ బెయిల్‌పై బయట ఉన్నారని, మరి కొందరికి కోర్టు రిమాండ్ నిరాకరించిందన్నారు. ఆ రోజు పథకం అమలు చేసిన అధికారుల పేర్లు ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరచలేని ప్రశ్నించారు. తమ సామాజికవర్గానికి చెందిన అధికారుల పేర్లను ఎందుకు ఎఫ్‌ఐఆర్‌లో రాయలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బలహీన వర్గాలకు చెందిన వాళ్లైతే కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. ఈ కేసుతో తనకు, చంద్రబాబు నాయుడుకు ఏం సంబంధం ఉందని ఆయన నిలదీశారు.
అవినీతి నిరూపిస్తే పీక కోసుకుంటాం
ఎక్కడైనా ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు నిరూపిస్తే పీక కోసుకుంటామని అచ్చెన్నాయుడు అన్నారు. ఫలానా ప్రాజెక్టులో ఫలానా వ్యక్తికి లాభం చేకూర్చామని, తనకు, తన కుటుంబ సభ్యులు, తన చుట్టూ ఉన్నవారికి ఒక్క పైసా వచ్చిందని నిరూపించినా, చంద్రబాబు అకౌంట్లోకి కాని, ఆయన కుటుంబానికి చెందని వ్యక్తులకు లాభం చేకూరిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటామని పీక కోసుకుంటామని సవాల్ చేశారు. రిమాండ్ రిపోర్ట్‌లో 409 సెక్షన్ ఎందుకు పెట్టారని, ప్రత్యక్ష్యంగా లేదా పరోక్షంగా లాభం జరిగే ఆ సెక్షన్ పెడతారని అన్నారు. సీఐడీ అధికారులకు సిగ్గులేదని, సీఎం జగన్ రెడ్డి ఏ నాటకం ఆడమంటే ఆ నాటకం ఆడుతున్నారని విమర్శించారు.
తండ్రిని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించారు
ఎక్కడైనా చిన్న ఆధారం, సాక్ష్యం దొరికితే అప్పుడు తమపై కేసులు పెడితే తాము బాధపడమని అన్నారు. చంద్రబాబు, లోకేష్, తనపై కేసులు పెట్టడం ద్వారా టీడీపీని భయపెట్టాలని చూస్తే అది జరగదని, తామేమి తప్పు చేయలేదన్నారు. జగన్ మోహన్ రెడ్డి అంటే అవినీతి, అవినీతి అంటే జగన్ మోహన్ రెడ్డి అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారని అన్నారు. సాక్షి, సిమెంట్ కంపెనీల్లో అక్రమ పెట్టుబడులు వచ్చాయన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదన్నారు.