Pawan Kalyan: మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆదివారం (సెప్టెంబర్ 10) జనసేన పీఏసీ సమావేశం కానుంది. సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం జరుగనుంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశానికి హాజరుకానున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చర్చించనుంది. చంద్రబాబు అరెస్టు తదనంతరం జరిగిన పరిణామాలపై, భవిష్యత్ వ్యూహాలపై పీఏసీ సమావేశంలో చర్చించనున్నారు. వారాహి తదుపరి షెడ్యూల్ పై పీఏసీ సమావేశంలో కమిటీ నిర్ణయం తీసుకోనుంది. అలాగే పొత్తుల గురించి చర్చించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
పొలిటికల్ హీట్ పెంచిన పవన్ కల్యాణ్
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జరగాల్సిన పార్టీ పీఏసీ సభ్యులు, ముఖ్య నాయకుల సమావేశం కోసం పవన్ శనివారం సాయంత్రం విజయవాడకు రావాల్సి ఉంది. అలాగే చంద్రబాబును పరామర్శించడానికి పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. డీజీసీఏ నుంచి అనుమతి తీసుకున్నారు. అయితే ఏపీలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే అవకాశం ఉందని పోలీసులు పవన్ విమానానికి చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు. లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని కృష్ణా జిల్లా పోలీసులు తెలపడంతో బేగంపేట విమానాశ్రయం నుంచి ఫ్లైట్ టేకాఫ్ కాలేదు. పోలీసుల రిక్వెస్ట్ తో ఎయిర్ పోర్ట్ అధికారులు పవన్ ప్రత్యేక విమానం గన్నవరం వెళ్లడానికి టేకాఫ్ చేయనీయలేదు. దాంతో పవన్ నిరాశగా వెనుదిరిగారు.
మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగాల్సిన పార్టీ పీఏసీ సభ్యులు, ముఖ్య నాయకుల ఆదివారం సమావేశం కానున్నారు. శనివారమే విజయవాడకు వెళ్లాలని జనసేనాని పవన్ భావించారు. కానీ కృష్ణా జిల్లా పోలీసుల రిక్వెస్ట్ తో బేగంపేట ఎయిర్పోర్ట్ లోనే పవన్ ను పోలీసులు ముందుకు వెళ్లనివ్వలేదు. ఉద్దేశపూర్వకంగానే ఏపీ పోలీసులు పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ బయల్దేరిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా జనసైనికులు నిరసనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పవన్.. ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చేందుకు వీసా, పాస్‌పోర్టు కావాలేమో అంటూ వ్యాఖ్యానించారు. హైవేపై కాన్వాయ్ ఆపడంతో కోదాడ వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో గరికపాడు వద్ద పవన్ కాన్వాయ్‌ను వదిలేసిన పోలీసులు మరోసారి అనుమంచిపల్లి వద్ద అడ్డుకున్నారు. దీంతో పవన్ వాహనం దిగి జాతీయ రహదారిపై నడుచుకుంటూ ముందుకు సాగారు.
పోలీసులు అప్రమత్తమై ఆయన్ను అక్కడే బలవంతంగా నిలువరించారు. పోలీసుల తీరుకు నిరసనగా పవన్ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అయితే మరోసారి జగ్గయ్యపేట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అసంతృప్తికి గురైన పవన్ కల్యాణ్ వాహనం దిగి నడుచుకుంటూ ముందుకు సాగడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యతో పవన్ రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. మొదట పవన్ ను అదుపులోకి తీసుకోవాలని చూడగా, చివరికి ఆయనను విజయవాడ వెళ్లేందుకు అనుమతించారు. మూడు వాహనాలతో పవన్‌ను తీసుకొచ్చారు.
జనసేనాని పవన్ కల్యాణ్‌కు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన పోలీసులు చివరికి మూడు వాహనాలతో పవన్ కల్యాణ్ విజయవాడ వెళ్లేందుకు అనుమతించారు. అర్ధరాత్రి తర్వాత తన కాన్వాయ్‌తో విజయవాడ చేరుకున్నారు పవన్ కల్యాణ్. మంగళగిరి కార్యాలయానికి వెళ్లి తీరుతానని జనసేనాని భీష్మించుకొని కూర్చోవడంతో కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితులు విషమించకుండా పోలీసు సెక్యూరిటీ మధ్య మంగళగిరి కార్యాలయానికి ఆయన్ని తరలించారు. ఆయనకు దారిపొడవునా రక్షణ వలయంగా జనసైనికులు, వీర మహిళలు ఉన్నారు.