Key leaders from Assam Congress are joining BJP: ఎన్నికలు జరుగుతున్న ఐదు  రాష్ట్రాల్లో నేరుగా బీజేపీతో కాంగ్రెస్ ఢీకొడుతున్న రాష్ట్రం అస్సాం.  మిగిలిన రాష్ట్రాల్లో జూనియర్ భాగస్వామి గానో.. ప్రబావం చూపలేని పార్టీగానో ఉంది.  బీజేపీతో ముఖాముఖి పోరులో అస్సాంలో కాంగ్రెస్ పార్టీ దయనీయంగా మారుతోంది. గత కొద్ది రోజుల్లో..  పీసీసీ చీఫ్..సిట్టింగ్ ఎంపీ సహా కీలక నేతలు బీజేపీలో చేరిపోయారు. వారిని ఆపడానికి రాహుల్,ప్రియాంక చేసిన ప్రయత్నాలు కూడా ఫలితం ఇవ్వలేదు.   ఒకప్పుడు అప్రతిహతంగా పాలించిన ఈ రాష్ట్రంలో, నేడు ఆ పార్టీ మనుగడ కోసమే పోరాడాల్సిన దయనీయ స్థితికి చేరుకుంది.  

Continues below advertisement

పీసీసీ చీఫ్ నిష్క్రమణ - గట్టి దెబ్బ 

ఎన్నికలకు కేవలం కొద్ది  రోజుల ముందు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా పార్టీని వీడి బీజేపీలో చేరడం కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ. ఫిబ్రవరి 2026లో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళాన్ని నింపింది. కాంగ్రెస్‌లో ఆత్మగౌరవం ఉన్నవారు ఎవరూ ఉండలేరు  అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలోని అంతర్గత సంక్షోభానికి అద్దం పడుతున్నాయి. భూపేన్ బోరా ఒక్కరే కాదు, సిట్టింగ్ ఎంపీ ప్రద్యుత్ బోర్డోలోయ్ వంటి ఉద్దండులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో అస్సాం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం  రాజీవ్ భవన్  నేడు వెలవెలబోతోంది.

Continues below advertisement

రాహుల్, ప్రియాంకల విఫల యత్నాలు 

పార్టీని కాపాడుకోవడానికి ప్రియాంక గాంధీ వాద్రాను స్వయంగా అస్సాం ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా అధిష్టానం నియమించింది. ఆమె గువహటిలో పర్యటించి, ప్రభుత్వంపై  చార్జిషీట్లు  విడుదల చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను నిలబెట్టలేకపోయారు. అగ్రనేతల బుజ్జగింపులను సైతం లెక్కచేయకుండా కీలక నేతలు వరుస కడుతుండటంతో, గాంధీ కుటుంబం పట్టు కూడా అస్సాంలో పనిచేయడం లేదు అని క్లారిటీవస్తోంది. 

అధికార వ్యతిరేకతను అందుకోలేని స్థితి 

హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పటికీ, సహజంగా వచ్చే అధికార వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. అభివృద్ధి పథకాలు, హిమంత బిశ్వ శర్మ  గట్టి పట్టు ముందు కాంగ్రెస్ వ్యూహాలు తేలిపోతున్నాయి. పాత తరం నేతలు వెళ్ళిపోవడంతో, గౌరవ్ గొగోయ్ వంటి యువ నేతలు ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోంది.  బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన అసోం సన్మిలితో మోర్చా  కూటమి కూడా బీటలు వారుతోంది. సీట్ల సర్దుబాటు విషయంలో ఏకాభిప్రాయం కుదరక రైజోర్ దళ్  వంటి మిత్రపక్షాలు కూటమి నుంచి బయటకు రావడం కాంగ్రెస్‌ను మరింత బలహీనపరిచింది. ఒంటరిగా బీజేపీని ఎదుర్కొనే సత్తా లేక, మిత్రపక్షాలను కలుపుకోలేక కాంగ్రెస్ ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా మారింది.

బిజెపి  ముఖాముఖి  వ్యూహం 

కాంగ్రెస్ బలహీనపడటంతో బీజేపీ తన వ్యూహాన్ని మరింత పదును పెట్టింది. కాంగ్రెస్‌లోని  చివరి హిందూ నేత  కూడా తమ పార్టీలోకి వచ్చేయాలని హిమంత శర్మ బహిరంగంగా సవాల్ విసరడం, కాంగ్రెస్‌ను కేవలం ఒక నిర్దిష్ట వర్గానికి పరిమితమైన పార్టీగా ముద్ర వేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. ముఖాముఖి పోరులో కాంగ్రెస్‌ను మానసికంగా దెబ్బతీసి, ఎన్నికల ముందే విజయాన్ని ఖరారు చేసుకునే దిశగా కమలనాథులు అడుగులు వేస్తున్నారు.  అస్సాంలో కాంగ్రెస్ పరిస్థితిని చూస్తుంటే, ఆ పార్టీ తన పునాదులను పూర్తిగా కోల్పోయినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు తరూర్ గొగోయ్ వంటి నేతలు నిర్మించిన కంచుకోట, నేడు సరైన నాయకత్వం లేక పేకమేడలా కూలిపోతోంది. పరిస్థితి మారకపోతే మే 2026 ఫలితాలు   కాంగ్రెస్ ఉనికిని  నామమాత్రం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు.