Notices to Vijay soon again in Karur Stampede case:  తమిళ సూపర్ స్టార్, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్ జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో  చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ దుర్ఘటనలో  41 మంది మరణించగా , వందలాది మంది గాయపడ్డారు. ఈ విషాదానికి ప్రధాన కారణం విజయ్ ఆలస్యంగా రావడం , నిర్వాహకుల వైఫల్యమేనని సీబీఐ ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం.

Continues below advertisement

సీబీఐ విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం..   ప్రచార కార్యక్రమం కోసం అనుమతించిన దానికంటే ఐదు రెట్లు ఎక్కువ మందిని తరలించారు. విజయ్ నిర్ణీత సమయానికి రాకపోవడంతో, గంటల తరబడి ఎండలో వేచి ఉన్న అభిమానులు ఒక్కసారిగా ముందుకు తోసుకురావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ప్రజలు సొమ్మసిల్లి పడిపోతున్నా విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగించారని, వాహనంపై నిలబడి అభివాదం చేయడం వల్ల జనం మరింత రెచ్చిపోయారని సాక్ష్యులు , వీడియో ఆధారాల ద్వారా సీబీఐ గుర్తించింది. 

 సీబీఐ  గత ఆదివారం విజయ్‌ను ఢిల్లీలోని తన ప్రధాన కార్యాలయంలో ఏకంగా ఏడు గంటల పాటు విచారించింది. అంతకుముందు విజయ్ తన బిజీ షెడ్యూల్ కారణంగా 15 రోజుల సమయం కావాలని, విచారణను చెన్నైలో జరపాలని కోరినప్పటికీ, సీబీఐ ఆ విన్నపాన్ని తిరస్కరించి ఢిల్లీకే పిలిపించింది.  ఈ విచారణలో ప్రధానంగా విజయ్ ఆలస్యంగా రావడం వల్ల పెరిగిన ఉద్రిక్తతలు, నిర్వాహకులు అనుసరించిన జనసమీకరణ పద్ధతులపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. విజయ్ ఢిల్లీ కార్యాలయం నుంచి బయటకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడగా, ఆయన కారు సన్ రూఫ్ నుంచి వారికి అభివాదం చేస్తూ వెళ్ళిపోయారు.  

  కొన్ని కీలక ప్రశ్నలకు విజయ్ ఇచ్చిన సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయని సీబీఐ భావిస్తోంది. ముఖ్యంగా జనసమీకరణకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి?   భద్రతా ఏర్పాట్లలో వైఫల్యానికి బాధ్యులెవరు? అనే అంశాలపై ఆయన స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించిన తర్వాత, విజయ్‌ను మరోసారి విచారించాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. అందుకే, త్వరలోనే ఆయనకు   నోటీసులు ఇచ్చి హాజరుకావాలని కోరే అవకాశం ఉంది.  41 మంది మరణించిన ఈ కేసులో దర్యాప్తును వీలైనంత త్వరగా ముగించి, కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని సీబీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ప్రధాన నిందితులు , సాక్షుల స్టేట్‌మెంట్లను క్రాస్ వెరిఫై చేయడానికి విజయ్‌ను మళ్లీ పిలిచే అవకాశం ఉంది.