BRS Internal Problems :  బీఆర్ఎస్ నేతలు ఎంతగా ఎదురుదాడి చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మాత్రం ఆగడం లేదు. బలమైన నేతలుగా పేరున్న వారే బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.  జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల తర్వాత పట్నం మహేందర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి సహా పలువురు ప్రముఖ నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వీరంతా సీటు గ్యారంటీ లేకపోవడంతోనే వెళ్లిపోతున్నారు. ఇలా సీటు గ్యారంటీ ఇవ్వకపోవడానికి కేసీఆర్ అవసరం లేకపోయినా కాంగ్రెస్ నుంచి ప్రోత్సహించిన ఫిరాయింపులే కారణం. 
బీఆర్ఎస్ అధినేత వ్యూహాత్మక తప్పిదం కారణంగా ఎన్నికలకు ముందు పార్టీ నుంచి వలసలు పెరుగుతున్నాయన్న  అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోఉంది. 


బలమైన నేతల్ని దూరం చేసుకోవాల్సిన పరిస్థితి ! 


బీఆర్ఎస్ అధినేత అవసరం లేకపోయినా ప్రతిపక్షాల్ని నిర్వీర్యం చేయడానికి ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు. ఇప్పుడు ఆ ఫిరాయింపులే పార్టీకి గుదిబండగా మారాయి.  నమ్మి తన వెంట వచ్చిన నేతల్ని వదులుకోవాల్సి వస్తోంది. పదవులు, నిధులకు ఆశపడి గెలిచి నపార్టీని వదిలి వచ్చిన వారికే ప్రాదాన్యత ఇవ్వాల్సి వస్తోందని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.  జూపల్లి కృష్ణారావు  పార్టీకి విధేయంగానే ఉన్నారు. బలమైన నాయకుడు కూడా . స్వల్ప తేడాతో 2018లో ఓడిపోయారు.  ఆయన కు వ్యతిరేకంగా గెలిచిన నేతను తీసుకుని ఆయనను పక్కన పెట్టేయడంతో వేరే పార్టీని చూసుకోక తప్పలేదు. ల  పొంగులేటి శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉండి పార్టీలో చేరినా...  నామా నాగేశ్వరరావును తీసుకొచ్చి టిక్కెట్ ఇచ్చారు కానీ ఆయనను పట్టించుకోలేదు.  అయినప్పటికీ ఆయన విధేయంగానే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా టిక్కెట్ ఇవ్వబోమన్న సంకేతాలు ఇవ్వడంతోనే ఆయన పార్టీ మారిపోయారు.  వీరిద్దరే కాదు ఇంకా చాలా మంది ఉన్నారని తాజాగా బయటకు వస్తున్నపేర్లు వెల్లడిస్తున్నాయి.  


ఫిరాయించి వచ్చిన  వారందరికీ టిక్కెట్ గ్యారంటీ హామీ


 గత ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేల్ని ఫిరాయించేలా చేసుకున్నారు. ఆ పన్నెండు చోట్ల టీఆర్ఎస్ తరపున పని చేసిన నేతలు  పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో వర్గ పోరాటం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ గుర్తుపై గెలిచి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు కేసీఆర్ మొదటే టిక్కెట్ హామీ ఇచ్చారు.  2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. కాంగ్రెస్, టీడీపీ ఎల్పీలను సైతం టీఆర్ఎస్‌లో విలీనం చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ సిట్టింగ్‌లకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ఓడిపోయిన ప్రతీ చోటా బలమైన అభ్యర్థులు ఉన్నరు. పట్నం మహేందర్ రెడ్డి,  తీగల కృష్ణారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సహా ఫిరాయించిన ఎమ్మెల్యే ఉన్న ప్రతీ చోటా బలమైన బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. వారంతా ఇప్పుడు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.  


బీఆర్ఎస్ కాకపోతే  బీజేపీ,  కాంగ్రెస్ ! 


నిన్నామొన్నటి వరకూ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఏదో ఓ పదవి ఉంటుందని నేతలు అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.   బీజేపీ, కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి.  ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీలో చాన్స్ ఉంటుంది. రెండు పార్టీలూ నేతలకు వల వేస్తున్నాయి. ఆఫర్లతో రెడీగా ఉన్నాయి . అందుకే ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న చోట బీఆర్ఎస్ నేతలంతా ప్రత్యామ్నాయం చూసుకోాల్సిందే.  ఎందుకంటే..  ఎన్నికల్లో పాల్గొనే స్టామినా ఉన్న నేతల్ని... నామినేటెడ్ పోస్టులతో కట్టడి చేయాలనుకోవడం సాధ్యం కాకపోవచ్చు.. గ్రేటర్ పరిధి, ఖమ్మం వంటి చోట్ల ఇప్పుడు టీడీపీ కూడా బీఆర్ఎస్ నేతలకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది.  సనత్ నగర్ నియోజకవర్గం నుంచి కూన వెంకటేష్ గౌడ్  మరోసారి టీడీపీలో చేరారు.  ఇతర చోట్లా కూడా ఉన్న ఈ అసంతృప్తి  బయటపడితే బీఆర్ఎస్‌లో సంక్షోభం మరింత ముదురుతుందన్న ఆందోళన బీఆర్ఎస్‌లో వ్యక్తమవుతోంది.